Online Puja Services

దేవుడు ఎవరు ?

3.145.156.250

దేవుడు ఎవరు ?
-లక్ష్మీ రమణ . 

విష్ణువా ? ఆయన నాభి నూనె ఉద్భవించిన బ్రహ్మా? వీరిద్దరికీ పరీక్షపెట్టిన శివుడా ? వీళ్ళందరికీ శక్తిగా మారిన ఆ అంబికా ? లేక, ఇతరములైన వివిధ నామధేయాలతో , వివిధ ఆచార ప్రవృత్తులతో, సంప్రదాయాలతో వచ్చిన మతాలకు, సిద్ధాంతాలకూ  సంబంధించినవారా ? ఎవరీ దేవుడు ? 

భాగవతంలోని ప్రధాశ్వాసంలో భగవంతుని ప్రార్ధిస్తూ పోతనామాత్యుడు ఇలా అంటారు .  

విశ్వ జన్మస్థితివిలయంబు లెవ్వని-
వలన నేర్పడు, ననువర్తనమున
వ్యావర్తనమునఁ గార్యములం దభిజ్ఞుఁడై-
తాన రాజగుచుఁ జిత్తమునఁ జేసి
వేదంబు లజునకు విదితముల్ గావించె-
నెవ్వఁడు, బుధులు మోహింతురెవ్వ
నికి, నెండమావుల నీటఁ గాచాదుల-
నన్యోన్యబుద్ధి దా నడరునట్లు


త్రిగుణసృష్టి యెందు దీపించి సత్యము
భంగిఁ దోఁచు, స్వప్రభానిరస్త
కుహకుఁ డెవ్వఁ, డతనిఁ గోరి చింతించెద,
ననఘు సత్యుఁ బరుని ననుదినంబు.

భావము:
ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో; ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో; ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో; ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేసాడో; ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో; ఎవనియందు సత్త్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్లలాగా , గాజు వస్తువుల్లో ప్రతిబింబంలాగా , అసత్యమై కూడ సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో; ఎవడు తనతేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో ఆ పాపరహితుడు, సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యమూ స్తుతి చేస్తున్నాను.

ఇక్కడ దేవుని పేరుని యేమని చెప్పారు ? అసలు చెప్పారా ? మన భావన చేత, ‘ఈ కార్యాలన్నీ చేసేవాడు వీడే’ , అని మనం ఎవరిని నమ్ముతామో , మన మనస్సు ఏ రూపం పైన ‘ఈయన పరమాత్ముడు’ అని స్థిర పడుతుందో అదే ఆయన రూపం . 

రంగూ , రుచీ , వాసన ఉంటేనే అది రుచికరమైన టీ  అని విశ్వసించే మనుషులంకాదా మనం . మరి రూపం, గుణం, రంగు ఏదీ లేని ఆ సర్వవ్యాపకుని ఏ విధంగా ఊహిస్తాం . ఎలా మనస్సులో నిలుపుతాం ? ఇది ఆ భగవంతుడికి ముందే తెలుసు . అందుకే ఒక మంచి కాఫీ లాంటి మాట చెప్పారు భగవద్గీతలో ! ‘నన్ను చేరడానికి నిర్గుణోపాసకన్నా , సగుణోపాసన తేలికైన మార్గం’ అంటారు భగవానులు తనని తానూ విశ్లేషించుకుంటూ కురుక్షేత్రంలో ప్రవచించిన గీతలో .  అందువల్ల ఆయన్ని సులువుగా చేరుకోవడానికి ఒక రూపం అనే మార్గం అవసరం. రాముడిని , కృష్ణుడనీ , హనుమంతుడనీ మనకిష్టమైన రూపంలో, మన మనసు నిలిచి , కొలిచే రూపంలో మనం భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాము . 

హిరణ్యకశిపుడు రాక్షసరాజు . ఆయన కొడుకు ప్రహ్లాదుడు . తండ్రికి  హరిపై అమితమైన కోపం . కొడుకుకి ఆ హరి అంటే అమితమైన భక్తి . చిన్న పిల్లాడైన ప్రహ్లాదుణ్ని హరి భక్తి మానమని నానా హింసలకీ గురిచేశాడు హిరణ్యకశిపుడు . అయినా ప్రహ్లాదుని చిత్తం హరి పాదాన్ని కోరింది. తండ్రి ప్రలోభాలకు లొంగలేదు. అదరలేదు . బెదరలేదు . 

ఇక చివరికి తండ్రి , ‘హరీ హరీ అని నామజపం చేస్తుంటావు కదా ! ఆ హరి ఈ స్థంభమున  చూపగలవా ?’ అని ప్రశ్నించాడు . అప్పటివరకూ తనకి తండ్రి కల్పించిన గండాల నుండీ కాచిన హరి , తన దైవం ఖచ్చితంగా తాను పిలిస్తే వస్తాడని ఆ పిల్లడు నమ్మాడు . అంతేకాదు, ఆ పిల్లాడి ఊహలో (పిల్లల ఆలోచనలు చాలా చిత్రంగా ఉంటాయని ఇక్కడ గుర్తుంచుకోవాలి . సృజనాత్మకంగా ఆలోచించగల శక్తి వారికుంటుంది ) హరి సింహముఖుడై దర్శనమిచ్చారు . అదే రూపం ధ్యానం చేశాడు ఆ చిన్నారి . వెంటనే , పెళ పెళ రావాలతో , సింహ గర్జనతో నారసింహుడు ఉద్భవించాడు . 

ఆయన మనిషా ? సింహమా ? దైవమా ? హరేనా కాదా ? హరి సుందరాకారుడూ , సౌందర్యోపాసకుడు, అలంకార ప్రియుడూ అనేకదా వర్ణన . మరి ఈ సింహం ముఖం, పెరిగిన గోళ్లు , కోపంతో రగిలిపోతున్న ఎర్రని కళ్ళు , మెడ వరకూ  సింహం, ఆ క్రింది భాగం మనిషి స్వరూపం గా ఉన్న నారసింహుడు - చదువుతుంటేనే యెంత భయంకరంగా ఉన్నారో అర్థమవుతోంది కదూ ! 

అందుకేమరి , మా దేవుడు గొప్పంటే, మాదేవుడు గొప్పని వాదించుకోకండి . దేవుడు రూపం లేనివాడు . కానీ తన భక్తుల కోసం రూపాన్ని ధరించాడు . ఆడాడు, పాడాడు, చిలిపి చేష్టలు చేశాడు. నవ్వించాడు , కవ్వించాడు , మైమరపింపజేశాడు . కానీ అంతరాలలో ఆయన యోగులకి వశుడు . తనని తెలుసుకోగలిగిన వారికి బద్దుడు . భక్తి ఉండాలి గానీ, ఏరూపం అయినా భగవంతుడిగా మారిపోతుంది. దర్శించగలిగే మనసు ఉండాలిగానీ , అణువణువులోనూ , ఈ చరాచర సృష్టి అంటా భగవంతుడు దర్శమిస్తాడు .

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha