Online Puja Services

కొబ్బరికాయకి , అయ్యప్ప దీక్షలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది .

3.145.173.132

కొబ్బరికాయకి , అయ్యప్ప దీక్షలో ప్రత్యేక  ప్రాముఖ్యత ఉంది . 
- లక్ష్మి రమణ 

కొబ్బరికాయకి పూజల్లో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది . ఇందులో పెద్ద విశేషం ఏముంది ? అనుకోవచ్చు . కానీ అయ్యప్ప స్వామి పూజల్లో మాత్రం కొబ్బరికాయకున్న ప్రాధాన్యతే వేరు .  కొబ్బరికాయలో నెయ్యి నింపి, ఆ నేతితో హరిహరసుతుని అభిషేకిస్తారు .  ఈ విధానం మరే  పూజల్లోనూ మనం చూడము . ఇలాంటివే మరెన్నో ప్రత్యేక ప్రయోజనాల కోసం అయ్యప్పలు కొబ్బరికాయని వినియోగిస్తారు . ఆవిశేషాలు ఇక్కడ తెలుసుకుందాం . 

ఇరుముడి కట్టి శబరిమలకు వెళుతున్న అయ్యప్పలు ఖచ్చితంగా తమ ముద్ర సంచీలో నెయ్యి నింపిన కొబ్బరికాయని తీసుకువెళతారు. ఆ కొబ్బరికాయని అగ్నిలో ఆహుతి చేస్తారు .  ఇందులో భగద్భవమూ, భక్తుని అంతరంగము, గొప్ప ఆంతర్యము దాగిఉంది . 

 కొబ్బరికాయలోనే నేతిని ఎందుకు నింపాలి ?

 కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు శివుని నేత్రాలుగా, కొబ్బరికాయ చుట్టూ ఉండే నిలువు చారలు విష్ణు నామాలుగా భావిస్తారు .  ఇలా  శివకేశవులు కొబ్బరికాయ అయితే, అందులో ఉండే   కొబ్బరి వారి తనయుడైన అయ్యప్పగా  భావిస్తారు. కొబ్బరికాయలో నెయ్యి పోయడమంటే సాక్షాత్ అయ్యప్పను అభిషేకించటం అనేది ఇక్కడ  భక్తుల విశ్వాసం అన్నమాట !! ఇక్కడ భగవంతుని రూపాన్ని ధారణ చేశారు . 

కొబ్బరికాయని హోమగుండంలో ఎందుకు వెయ్యాలి ? 

ఇలా ఇరుముడిలో పెట్టుకొని తలపైన మోసుకుంటూ వెళ్ళిన ఆ నేతి కొబ్బరికాయలోని నేతితో అయ్యప్పకు అభిషేకం చేస్తారు . అభిషేకం చేసిన తరువాత నేతి కొబ్బరికాయను హోమగుండంలో వేస్తారు. ఇక్కడ భక్తుని భావం గమనించండి.   శరీరమనే కొబ్బరికాయలో తన ప్రాణాన్ని నెయ్యిగా పోసి స్వామివారికి అర్పణ చేయడం .  ఇదే స్వామికి చేసే నెయ్యఅభిషేకం లోని అంతరార్ధం. ఆత్మ పరమాత్మతో సంలీనమయ్యాక మిగిలిన శరీరం కట్టే తో సమానమే ! అప్పటివరకూ భగవంతుని రూపమై , ఆ భగవంతుని సన్నిధికి చేరేందుకు చేయూతనిచ్చిన ఆ శరీరంపైన అభిమానాన్ని వదిలేసి, దానిని అగ్నికి ఆహుతి చేయడం ఇందులోని పరమార్థం . 

గుమ్మం ముందర కొబ్బరికాయ కొట్టాకే యాత్రకి బయలుదేరాలి !

అయ్యప్పలు శబరిమల  యాత్రకి బయలుదేరుతున్నప్పుడు, ఇంటి గుమ్మం ముందర కొబ్బరికాయ కొట్టాకే ముందుకు కదుల్తారు . పరదేశ యాత్రకు  వెళ్తున్నప్పుడు  తన ఇంటిని, ఇంటిలోని వారిని సురక్షితంగా  తాను తిరిగి వచ్చేంతవరకు కాపాడమని గ్రామదేవతని కోరుకునే క్రమమే ఇది .  యాత్రకు బయలుదేరే అయ్యప్పలు వారి ఇంటి ముందర  కొబ్బరికాయ కొట్టి ప్రార్ధించగానే, తన పరివార గణములో ఒక గణమును ఇంటి రక్షణ కోసం ఆ దేవత కేటాయిస్తుంది . శబరియాత్ర నుండి తిరిగి వచ్చాక, తిరిగి అయ్యప్పలు ఇంటి గుమ్మానికి కొబ్బరికాయ కొట్టి,   ,ఆ శక్తిని పంపిన గ్రామ దేవతకి నమస్కారం చేసుకొని, కృతఙ్ఞతలు చెప్పుకొని, గృహప్రవేశం చేస్తారు . అందుకే , ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి, ఇరుముడి కట్టించుకున్న తరువాత, యాత్ర పూర్తి చేసేవరకూ తిరిగి  మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని చెబుతుంటారు . 

చూశారా ! అయ్యప్ప పూజల్లో కొబ్బరికాయకి ఎంతటి ప్రత్యేక ప్రాశస్త్యమున్నదో !!

స్వామియే శరణమయ్యప్ప !!

#ayyappa #deeksha #coconut

Tags: ayyappa, deeksha, coconut, sabarimala

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore