మిరియాలు, ఉప్పు వదలడంలోని అంతరార్థమేమి ?

54.224.117.125

సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర మిరియాలు, ఉప్పు వదలడంలోని అంతరార్థమేమి ?
-లక్ష్మీ రమణ 

జిహ్వచాపల్యం ఎంతటివారినైనా లొంగదీసుకొనే ఐహిక విశేషం .  ఇంద్రియాలలో జయించదగిన అత్యంత ప్రధానమైన విశేషం ఏదైనా ఉందంటే , అది నాలుకని జయించడమే నంటే , అతిశయోక్తి కాదు. బ్రహ్మచారి ఇంద్రియసుఖములని మరిగి , జ్ఞానసముపార్జనముని అలక్ష్యం చేయకూడదని కదా శాస్త్రం ! 

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటం
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా! 

అంటాడు భాస్కర శతకకారుడు. అలాగే, చదువుకున్న జ్ఞానాన్ని ఆచరించక పోయినా , చేసేపనిలో అంకితభావం లేకపోయినా , నలభీమపాకమైనా ఉప్పులేక రుచిని కోల్పోయిన చందమె మరి !బ్రహ్మచారి జ్ఞానాన్ని పక్కకుపెట్టి ఇంద్రియములకు వశుడుకావవద్దనే సందేశం మన ఈ ఆచారంలో ఉంది . 

జిహ్వకి ఆనందాన్నిచ్చేది రుచే కదా ! ఆ రుచి జనించేది ఉప్పూ, కారాల నుండే. పూర్వం వంటల్లో, ప్రత్యేకించి మనదేశంలో మిరపకాయల కారానికి బదులు మిరియాలనే వాడేవారు.  

జ్ఞానాన్ని సముపార్జించే యోగంలో ఉన్న బ్రహ్మచారికి రుచి నిషిద్ధమే . సుబ్రహ్మణ్యుడు కుండలినీ స్వరూపుడు. జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. అందుకు సంకేతంగానే సర్పాకారంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ యోగమూర్తి సన్నిధిలో రుచులపై మోహం వదులుకుంటున్నామని, యోగమార్గంలోకి వస్తున్నామని తెలియచేయటానికి ఉప్పు, మిరియాలు ధ్వజస్థంభం దగ్గర ఉంచుతారు . అంటే, స్వామీ సన్నిధికి వెళ్ళే ముందే ఇంద్రియాలమీద మమకారాన్ని వదిలేసినట్టన్నమాట. 

ధ్వజస్తంభ పీఠాన్ని, బలిపీఠంగా భావిస్తారు. పక్షుల కోసం అర్చకులు అక్కడ అన్నం ఉంచడం (బలిహారం ) ఆలయ సంప్రదాయం. అటువంటి బలిపీఠం దగ్గర ఉప్పుకారాలు వదలడం అంటే, ఇంద్రియ చాపల్యాన్ని నీ దగ్గర వదిలేస్తున్నాను . నాకు జ్ఞానమార్గాన్ని చూపమని సుబ్రహ్మణ్యుడని వేడుకోవడమే . 

మరో కోణంలో చూస్తే, సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి, జ్ఞానమూర్తి. ఉపనయన క్రతువులో నాందీముఖంలో బ్రహ్మచారికి ఉప్పుకారాలు లేని భోజనం వడ్డిస్తారు. విద్యపై అభిరుచి తప్ప మరే ఇతర రుచులపై బ్రహ్మచారి ఆసక్తి కలిగి ఉండరాదన్నది బ్రహ్మచర్య వ్రతంలో భాగం. స్వామి బ్రహ్మచర్య వ్రతదీక్షను గౌరవిస్తూ భక్తులు ఇలా ఉప్పు, మిరియాలు వదలడం ఆచారంగా వస్తోందని పండిత వచనం . 

ఏదేమైనా సూక్షమైన ఆచార వ్యవహారాలలో ఇంతటి విజ్ఞానాన్ని , గొప్పదైన సంస్కారాన్ని నింపి అందించిన గురుమూర్తులైన పెద్దలకు నస్సుమాంజలులు అర్పిస్తూ , శలవు .

Quote of the day

Man learns through experience, and the spiritual path is full of different kinds of experiences. He will encounter many difficulties and obstacles, and they are the very experiences he needs to encourage and complete the cleansing process.…

__________Sai Baba