ఆ మంత్ర తీర్థమహిమ ఒక్కటే

54.174.225.82

పరమాచార్యవారిచ్చినా, సామాన్యుడిచ్చినా ఆ మంత్ర తీర్థమహిమ ఒక్కటే !! 
కూర్పు: లక్ష్మీ రమణ
 
సంధ్యావందనం చాలా విశిష్టతతో కూడుకున్నది. ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు తప్పనిసరిగా చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యావందనం అంటే,  సంధిసమయములో  (రోజులో కాలము మారే సమయములో / కాలము యొక్క సంధి సమయములో చేసేది . ఉదాహరణకి పగలు రాత్రి కలసియున్న సమయం - సాయంత్రం పూట ) చేయదగినది. సంధ్యావందనము చేయకుండా యితర కర్మలను చేయకూడదు అని శాస్త్రం . సంధ్యావందనము కర్మలో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం , గాయత్రీ మంత్ర జపం విధిగా చేయాలి. ఈ జప మహిమని కంచి పరమాచార్యవారు క్రియాత్మాకంగా ఒక భక్తునికి వివరించి, ఫలితాన్ని అనుభవం చేయించారు .  

సంధ్యా వందనము రోజుకు మూడుసార్లు చేయాలి . 

రోజులో మొదటిసారి సంధ్యా వందనము- రాత్రి యొక్క చివరిభాగములో  నక్షత్రములు ఇంకా కనిపిస్తుండగా  అంటే తెల్లవారుజాము సమయంలో ఆచరించాలి . ఇది ఉత్తమం .  నక్షత్రములు వెళ్ళిపోయిన తర్వాత సంధ్యావందనాన్ని ఆచరించడం మధ్యమము. సూర్యోదయమైన తరువాత చేయడం అధమము.

ఇక రెండవసారి మధ్యాహ్న సంధ్యా వందనము-మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆచరించడం ఉత్తమం. 

సాయం సంధ్యావందనము- సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో చేయడం  ఉత్తమము.  నక్షత్ర దర్శనము కాకుండా చేయడం మధ్యమము, నక్షత్ర దర్శనము అయిన తరువాత చేయడం అధమము. 

సంధ్యా వందనము పురుడు, మైల, పక్షిణి సమయములలో అర్ఘ్యప్రదానము వరకు మాత్రమే చేయాలి. ప్రయాణాల్లో వీలుపడనప్పుడు మనస్సులో సంధ్యా వందనము చేయవచ్చని శాస్త్రం . కానీ ప్రతిరోజూ క్రమం తప్పక సంధ్యా వందనము ఆచరించాలి .

ఉపనయన సంస్కారం ఉన్నవారు, ఉపనయనం అయినప్పటినుండి ప్రతినిత్యం తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. ఉపనయన ఆచారం ఉన్నవారు ఒక విధంగా చేస్తారు. ఉపనయన ఆచారం లేని వారు మరో విధంగా చేస్తారు. ఋగ్వేదీయులు, సామవేదీయులు, యజుర్వేదీయులలో సంధ్యావందనం వేర్వేరుగా ఉంటుంది. పూర్తిగా వేరా అంటే కొన్ని కొన్ని భేదాలతో ఒకే విధంగా  అంటుంది. మంత్ర భేదమున్నప్పటికీ- దాని తత్వం, పరమార్ధం, ప్రయోజనం, అంతరార్ధం అనేవి మారవు.

ద్విదులు అంటే మూడు వర్ణముల వారు అనగా బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ముగ్గురు తప్పనిసరిగా సంధ్యావందనం చేయాలి. ఎంత పండితులైనా ఏ ఇద్దరూ ఒకలా సంధ్యావందనం చేయరు. పూర్తి సంధ్యావందనానికి 20 నిముషాల మాత్రమే సమయం పడుతుంది. రోజులో ఏ పూట చేసే పాపం ఆ పూట సంధ్యా సమయంలో సంధ్యా వందనం ద్వారా పోతుందని పురాణాలు చెబుతున్నాయి. సంధ్యావందనం తోపాటు గాయత్రీ జపం తప్పనిసరిగా చేసుకోవాలి. గాయత్రీ మంత్రాన్ని ఈ జగత్తుకి అందించిన మహర్షి విశ్వామిత్రులవారు . ఆ దివ్య మంత్రంలోని ప్రతి అక్షరం ఒక శక్తినిపాతం అనేది ఎల్లరూ గుర్తుంచుకోవాల్సిన విషయం . ఆ మంత్రం శక్తిని గురించి ఒక సందర్భంలో కంచి పరమాచార్య వారు విశదీకరించారు . 

ఒకసారి కంచి పరమాచార్యులవారి  దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వచ్చారు. స్వామి వారిచ్చే తీర్థం తీసుకుని, అదే తీర్థం తనతో తెచ్చుకున్న చిన్న పాత్రలో కూడా కొద్దిగా పోసిమ్మని అభ్యర్ధించారు . స్వామివారు దేనికని అడగగా, తన భార్యకు అస్వస్థతగా ఉన్నదని, తీర్థం ఇస్తే నయమవుతుందని విన్నవించారు.

కానీ, స్వామివారు తీర్థం ఇవ్వడానికి నిరాకరించారు. దానికి మారుగా , ‘నీవు గాయత్రి మంత్ర జపము చేస్తావా?’ అని అడిగారు. ఆ బ్రాహ్మణుడు నిత్యమూ చేస్తానన్నాడు. ‘అయితే జపానంతరము నీవే తీర్థమివ్వచ్చుకదా!’ అన్నారు స్వామివారు. ‘తమరిచ్చే తీర్థము, నాజప తీర్థము సమమవుతాయా స్వామి’ అన్నాడా బ్రాహ్మణుడు. ‘ఎందుకు కాదు, నీవిచ్చినా నేనిచ్చినా 'గాయత్రిమంత్ర జప తీర్థమే' కదా, నీవే యిచ్చిచూడు’ అని చెప్పి పంపారు ఆ బ్రాహ్మణుణ్ణి.

ఒక వారం తరువాత, ఆ బ్రాహ్మణుడు స్వస్థత చేకూరిన భార్యని తీసుకుని స్వామి వారి దర్శనానికి వచ్చారు .  తనచేతే , తీర్థాన్నిప్పించి ఆమెకు స్వస్థత చేకూర్చినందుకు కృతఙ్ఞతలు తెలిపారు ఆ భక్తుడు . స్వామివారు చిరునవ్వుతో ఆ శక్తి 'గాయత్రి మంత్ర జప తీర్థానిదే' కాని, తనదికాదని చెప్పారు. గాయత్రి మంత్ర జప విశిష్టత అది.

అందువల్ల , ఉపదేశం పొందిఉన్నవారు , కనీసం ఉదయం , సాయంత్రాలైనా కుదిరినంతవరకూ ఉత్తమమైన సమయాలలో సంధ్యావందనాన్ని ఆచరించి , గాయత్రిని చేసుకొని ఆ తీర్థాన్ని మీరు, మీ కుటుంబం తీసుకోండి . అస్వస్థతతో , అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారికిచ్చి వారి బాధని దూరం చేసేందుకు సాయపడండి . నమ్మినవారు మనవారు . మనకర్తవ్యం మనం చేద్దాం . సర్వేజనా సుఖినోభవంతు ! అనేది కదా మన ఆర్యుల ఉద్దేశ్యం. శుభం .  

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya