Online Puja Services

పందొమ్మిది ముఖాలు కలిగిన వైశ్వానరుడు “గణపతే”!

3.14.15.94

పందొమ్మిది ముఖాలు కలిగిన వైశ్వానరుడు “గణపతే”!
- లక్ష్మి రమణ 

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సర్వ దేవగణ వంద్యుడు అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షదైవమై, ధర్మపరిరక్షకుడై భక్తకోటి పూజలందుకుంటున్నాడు. కలి ప్రభావం వల్ల ధార్మికులకు కలిగే విఘ్నాలను నివారిస్తూ ఉన్నాడు. అటువంటి విఘ్నహర్తుడు సయితం శ్రీరామవతార సమయంలో రావణాసుర వధకు పూనుకున్నప్పుడు ఆదిపూజితుడైన పార్వతీనందనుణ్ణి అర్చించాడు. వినాయక శాపానికి గురైన చంద్రుణ్ణి వినాయక చవితి నాడు చూసిన కారణంగా ప్రాప్తమయిన నీలాపనిందను శ్రీ కృష్ణావతారంలో భరించాడు. ఆవిధంగా భూలోకంలో సాధకులు వినాయకుణ్ణి పూజించే విశిష్ట ఉపాసనకు మార్గం వేసాడు. ఆ విధంగా వేదం బోధించిన గణపతి సాధనని  స్వయంగా శ్రీహరి కూడా చేశారు . 

 వేదాలు, ఉపనిషత్తులనే పునాదులపై సనాతన ధర్మం నిలచివుంది. ఈ గ్రంథాలలో వివిధ దేవతల వివరాలు, వారి ఉపాసనా మార్గాలను వివరించడం జరిగింది. మాండూక్య ఉపనిషత్తు “వైశ్వానర” అన్న భగవద్రూపాన్ని వివరిస్తూ పందొమ్మిది ముఖాలు కలిగిన వైశ్వానర రూపంలోని ప్రధాన ముఖం గజముఖమని పేర్కొనడం జరిగింది. “అహమ్ వైశ్వానరో భూత్వా” అన్న గీతావాక్యం ప్రకారం శ్రీహరియే గజముఖుడయిన వైశ్వానరుడు. “విశ్వంభర” అన్న మరో పేరును కలిగిన ఈ రూపమే విఘ్నవినాయకునిలో పూజలందుకొంటోంది. ఇంతటి వైశిష్ట్యం కలిగిన గజముఖ తత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేద్దాం . 

వేదాలలో గణపతి

నాలుగు వేదాలలో మొదటిదయిన ఋగ్వేదం గణపతిని రెండు మంత్రాలతో కీర్తిస్తోంది. విఘ్నేశునికి సంబంధించిన అత్యంత ప్రాచీనమైన ఉల్లేఖనాలు ఇవేనని పండితులు పేర్కొన్నారు. “గణానాం త్వాం” అన్న ఋగ్వేద మంత్రంలోని మొదటి అక్షరం “గ”, చివరి అక్షరం అనుస్వరం. ఈ రెండింటి కలయికగా ఆవిర్భవించిన బీజాక్షరం “గం.” గౌరీపుత్రుడైన గణేశుడు “గం” అనే బీజాక్షరానికి అధిదేవతగా వేదం పేర్కొంది. 

యజుర్వేదం మహాశివుణ్ణి “నమో గణభో” అని వర్ణిస్తూ శివుణ్ణి గణపతిగా పేర్కొంది. “ఆత్మా వై పుత్ర నామాసి” అన్న విధంగా గణపతి అయిన శివుని కుమారుడు కూడా గణపతి పేరుతో ప్రసిద్ధి చెందాడు. గణేశ సహస్రనామం, గణేశ పురాణం వంటి ప్రాచీన శాస్త్రాలు గణపతిని కీర్తించాయి.

గణేశ తాపినీ ఉపనిషత్తు గజముఖుణ్ణి ఓంకారానికి సంకేతంగా వర్ణించింది. “తతశ్చ ఓమ్ ఇతి ధ్వనిరభూత్ స వై గజాకారః” అని గణేశ తాపినీ ఉపనిషత్తు వాక్యం ఇందుకు నిదర్శనం. ఈ ఓంకారం – అకార, ఉకార, మకార సంయోగమై అత్యంత పవిత్రమైనది, ప్రభావవంతమైనది. సర్వవేదసారమైన ఈ ప్రణవాక్షరానికి గణపతిని సంకేతంగా భావించింది వేదం. ప్రణవాక్షరాన్ని సంస్కృతంలో వ్రాసినపుడు ఆ అక్షరం ప్రధానభాగం గణపతి తొండాన్ని, కుడిభాగం అతనికి ప్రియమైన మోదకాన్ని, పైభాగం గణపతి శిరస్సుపైనుండే అర్ధచంద్రాకృతిని పోలివుంటాయి. కనుక గణపతిని ప్రణవాక్షర సంకేతంగా భావించింది గణేశ తాపినీ ఉపనిషత్తు. ఈ కారణం వల్ల సర్వవిధ కర్మారంభంలో, విఘ్ననివారణకై ఓంకారాన్ని ఉచ్ఛరించడం జరుగుతుంది. ఇలా విఘ్నేశ్వరుడు వేదమంత్ర ప్రతిపాద్యుడై, ఉపనిషత్ప్రసిద్ధుడై, మంత్రాధిష్టాన దేవతగా భాసిస్తున్నాడు.

వీటితో బాటు బోధాయన గృహ్యసూత్రాలలో కూడా గణపతి ఆరాధనా వివరాలు ఉన్నాయి. గణపతికి చెందిన ఎన్నో అపురూప విశేషాలు వైదిక సాహిత్యంలో ఉండేవని, వాటిలో ఎన్నో కాలప్రవాహంలో కొట్టుకుపోయాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు .  అలా కాలానికి ఎదురీదినా, ఆటుపోటులని తట్టుకొని నీవుగప్పినా, నిప్పు ప్రకాశించినట్టు , వేద శాస్త్ర విజ్ఞానం సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూనే ఉంది . ఉంటుంది కూడానూ . అయితే, నేటి తరానికి పట్టిన  ఆధునికత వ్యామోహం అనే భ్రమ నశించి , ఆ దివ్య ప్రకాశాన్ని అర్థం చేసుకొనేలా, చూడాలని ఆ  విఘ్నేశుని వేడుకుందాం . 

శుభం !!

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda