Online Puja Services

వినాయకుని అసలైన ప్రభావాన్ని ఈ అష్టరూపాలూ వ్యక్తపరుస్తాయి .

3.20.238.187

వినాయకుని అసలైన ప్రభావాన్ని ఈ అష్టరూపాలూ వ్యక్తపరుస్తాయి . 
- లక్ష్మి రమణ 

వినాయకుడు ప్రధమ పూజ్యుడు . ఎందుకు వినాయకుణ్ణే ముందుగా పూజించాలి ? అంటే మనం సాధారణంగా ఆయన విఘ్నాలకి అధిపతి. అందువల్ల ఆయన్ని పూజించాలి అనే సమాధానాన్ని వింటూ ఉంటాము . అసలు విఘ్నాలు అంటే ఏమిటి ? అని అడిగితే , అరే  అది కూడా తెలీదా ! మనకి పనుల్లో ఎదురయ్యే ఆటంకాలని విఘ్నాలు అంటారు . అని చాలా సులువుగా చెప్పేస్తాం . కానీ ఆధ్యాత్మికం లోని అర్థాలు అంత సుళువైనవి కావు. సంసార సాగరాన్ని అధిగమించేప్పుడు వచ్చే భౌతికమైన అడ్డంకులని మాత్రమే భావన చేస్తే వినాయకుని అసలు మహత్యం మనకి అర్థం కాకుండానే మిగిలిపోతుంది .  వినాయకుని ప్రభావం అంతకు మించినది. ఆయన ఆరాధన వలన లౌకికమైనవి , అలౌకికమైనవి ఇలా రెండు ప్రయోజనాలూ నెరవేరతాయి. 

వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు .  ఆయన రూపం , స్వభావం వెనుక లోతైన అర్థం ఉంది . గణేశుని ఆరాధన వలన  ఈ సంసారంలో ఎదురయ్యే విఘ్నాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతే కాదు, వినాయకుడు ఈ జన్మ జన్మల పరంపర నుండీ కూడా మనల్ని ఒడ్డుకు చేర్చగల మహనీయుడు . ఆయన వక్రతుండము లోని అసలైన అర్థం కూడా ఇదే !వినాయకుని ఆరాధనలో దాగున్న ఇటువంటి రహస్యాలని చెప్పే ముద్గల పురాణం లేదా వినాయకపురాణంలో ఆయన ఎనిమిది అవతారాలు విశ్లేషిస్తారు . 

వక్రతుండ గణపతి : 

పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోయి దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. 

వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి.

ఏకదంత గణపతి : 

చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే లోకాధిపత్యం దక్కుతుందన్నాడు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించి

మదాసురునికి తిరుగులేకుండాపోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులు తీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించారు.  ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. 

ఇక్కడ మదాసురుడు అంటే మదానికి అంటే గర్వంకి  చిహ్నం. దాన్ని నివారించే  ఏకదంతుడు ఈ సృష్టి యావత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. 

మహోదర గణపతి : 

శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంత కాలమైనా ఆయన ఆ తపస్సుని వీడకపోవడంతో పార్వతి కంగారుపడి పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నించింది . చక్కని గిరిజన యువతిగా మారిపోయింది. ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి తపో భంగం అయ్యింది . ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్థం కాక, అయోమయానికి లోనయ్యారట. ఆ స్థితిలో ఆయన నుండీ జనించిన రాక్షసుడు  మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు మహాఉదరం కలిగిన మహోదరునిగా  అవతరించాడు. ఆ మోహాసురుని బారి నుండీ లోకాలని కాపాడారు. 

మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది.

గజానన గణపతి :

కుబేరుని ధనాశ, లోభత్వం నుండీ లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. పరమాత్మ అయిన వేంకటేశ్వరుని చేత ప్రామిసరీ నోటు రాయించుకున్నపుడే ఆ కుబేరుని లోభత్వం మనకి అర్థం కావాలి . అటువంటి ఆయన చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసు కున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. 

గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. 

గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచి స్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాకతప్పవు.

లంబోదరుడు:

దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించగా విష్ణువు తన నిజరూపంలోకి రావడంతో శివుడు భంగపడి క్రోధితుడయి క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడగా హర్షం,శోకం అనేసంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు.

 క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి.

వికటుడు:

పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే  ఆ గణేశుడు వారికి ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. వికట గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. 

ఆ ఓంకార స్వరూపంతో కామాన్నిఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది.

విఘ్నరాజు

కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగుపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. 

ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి.

ధూమ్రవర్ణుడు

అరిషడ్వార్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు. ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతుని ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. 

‘నేను’ అనే అహంకారాన్ని పక్కనపెట్టి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూ పరులకు ఉపకారం చేస్తూ దైవ చింతనతో దైవాన్ని వెతుకుతూ మోక్షంకోసం సాధన చేయడమే దీని సారాంశం.

చూశారా, ఇలా పరమాత్మ వైపు చేసే మన ప్రయాణంలో అడ్డుపడే విఘ్నాలని తొలగిస్తాడు , కనుక ఆయన విఘ్ననాయకుడయ్యారు .  ఇటువంటి విఘ్నాలు అధిగమించాలి అనే ఉద్దేశ్యంతో మనం నిజమైన సాధన చేయాలి .  కానీ, క్షణికమైన ప్రయోజనాలు మాత్రమే మనకి పరమాత్మ ఎదుట గుర్తొస్తాయి . వాటన్నింటినీ అధిగమించిన సాధకునికి వినాయకుడు తన తొండంతో పట్టి లేపి మరీ పరమాత్మ దర్శనం చేయిస్తారు .  శుభం 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya