Online Puja Services

అసలు గణాధిపతి ఎవరు ?

18.119.107.96

అసలు గణాధిపతి ఎవరు ?
- లక్ష్మి రమణ 

గణపతిని వినాయకుడు అని పిలుస్తాం .  విశేషమైన నాయకున్ని వినాయకుడు అంటారు .దేవతా గణాలందరికీ నాయకుడిగా ఉండాలంటే, అంతటి విశేషజ్ఞత ఉండాలిగామారి . మన గణపతి దేవగణాలకి గణాధిపతి . ప్రధమ పూజ్యుడు . అయితే,  “అగ్నిర్వై దేవానాం సేనానీ” అని యజుర్వేదం అంటుంది .  అంటే, ఇక్కడ అగ్ని దేవతల సేనానాయకుడు అని చెబుతుంది . పైగా మమ్మల్ని సరైన మార్గంలో నడిపించు తండ్రీ అని అగ్ని దేవుని ప్రార్ధించడం కనిపిస్తుంది . మరి అసలు గణాధిపతి ఎవరు ? అగ్ని దేవుడా ? గణేశుడా ? 

 గణపతిని వేదములు పరమేశ్వరునిగా కీర్తిస్తున్నాయి. ఈశ్వర స్వరూపమైన యజ్ఞము కూడా గణపతి స్వరూపమే . యజ్ఞస్వరూపుడైన ఈ యజ్ఞేశ్వరుడు రక్త వర్ణములో ఉంటారు . వక్రతుండాన్ని, వంకరటింకరగా ఉండే అగ్ని శిఖలు  ప్రతిఫలిస్తుంటాయి. ఇక ఆయన లంబోదరానికి అర్థం సర్వభక్షకుడైన అగ్ని స్వరూపమే. అగ్ని జీర్ణశక్తికి కొలమానమేమున్నది.  

పంచముఖములతో ప్రభవించిన గణేశుడు, పంచమహా యజ్ఞాలకి ప్రతీక . గణేశున్ని మూషకధ్వజుడు లేదా ధూమ్రధ్వజుడు అంటారు .  అగ్నిని ఋగ్వేదము ధూమ్ర ధ్వజుడు , దూమ్రకేతువు అని చెబుతుంది. ఆకార సమానతని  అనుసరించి ధూమ్రము - మూషికము అవుతుంది.  మూషికము, అగ్నికి - మూషికముకి వినాయకునికి ఉన్న సంబంధమే ఉండడం ఆశ్చర్యం అనిపిస్తుంది .  తైత్తరీయోపనిషత్తు ప్రకారము, భూమి సూర్యుని నుండీ విడిపోయినప్పుడు, భూమికూడా అగ్ని ఖండముగానే ఉంది. కానీ ఆ అగ్ని ఒక ఎలుక భూమిలోపలికి కలిగి చేసుకొని దూరిపోయిన మాదిరి, భూమిగర్భము లోపలికి చేరిపోయింది. 

  యజ్ఞము లో అగ్నిదే కదా ప్రధానమైన పాత్ర . ఆరణి లేనిదే సృష్టి యజ్ఞము కూడా సంపూర్ణము కాదుకదా ! శతపథ బ్రాహ్మణంలో చెప్పినట్టు , నిజానికి అగ్నియే యజ్ఞము (అగ్నిరైవ్యావ యజ్ఞో).యజ్ఞము నుండి మేఘము , మేఘమునుండి వర్షము , వర్షము నుండి అన్నము, అన్నము నుండి ప్రజోత్పత్తి , పాలన, పోషణ జరుగుతున్నది . 

ఇక్కడ సైన్స్ చెబుతున్నదానికి కూడా అన్వయించి చూడండి. సూర్యుడు అగ్ని , ఆ అగ్ని వేడిమికి ఆవిరైన నీటివలన మేఘము ఉత్పన్నమవుతుంది. మేఘము చల్లబడి వర్షిస్తుంది. దానివల్ల పంటలు పండి పోషణ సాధ్యమవుతుంది. పోషణవల్ల శక్తి దానివల్ల తిరిగి ప్రజోత్పత్తి, పాలన , పోషణ జరుగుతుంది . కాబట్టి సృష్టే ఒక యజ్ఞము . మనం క్రియాత్మకంగా చేసి యజ్ఞము ఈ కార్యమునకి ప్రతీక అంటే అతిశయోక్తి కాదు .  

సృష్టి అగ్నివలన ఉత్పన్నమై పోషింపబడి తిరిగి లయమవుతున్నది అనుకుంటే, ఆ సర్వానికి ఒక సుందరమైన స్వరూపము మన లంబోదరుడు . 

ఆరణి (అగ్ని) రెండు ఆరణులు రుద్దడం వలన జనిస్తుంది . అవి అంతరిక్షానికి , పృథ్వికి ప్రతీకలు .కాబట్టి వీటిని అగ్నికి మాతృ స్వరూపాలుగా చెప్పుకోవాలి .   మన గణపతికి ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డడని (ద్వైమాతరుడు) పేరుంది కదా !   ఈ విధంగా గణపతి అగ్నిస్వరూపమే అవుతున్నాడు . 

గణపతి విభిన్న రూపాలలో విద్యాగణపతి , బుద్ధిగణపతి, సిద్ధిగణపతి, లక్ష్మీ గణపతి , సరస్వతీగణపతి కూడా ఉన్నారు .  వేదము సరస్వతీస్వరూపము- సిద్ధి స్వరూపము. యజ్ఞమువలన వేసవిద్య రక్షించబడి, పోషించబడుతుంది. కాబట్టి సిద్ధి ప్రసాదకుడు , రక్షకుడు , పోషకుడు అగ్నిస్వరూపమైన యజ్ఞేశ్వరగణపతి అవుతున్నారు. బుద్ధి అంటే సంవృద్ధి అని అర్థం . దీనినే మనం లక్ష్మి అంటున్నాము . బుద్ధిగణేశుడు , లక్ష్మీగణేశుడు కూడా యజ్ఞము వలననే ప్రీతిని పొందుతాడు. అందువల్ల యజ్ఞము వలన సంవృద్ధి కలుగుతుంది . 

భగవద్గీత యజ్ఞమును ‘కామధుక్’ అని పేర్కొంది. అంటే కోరిన కోర్కెల్ని అనుగ్రహించేది అని అర్థము .  అది ఇహమునకైనా , పరమునకైనా! 

క్రియగా యజ్ఞాన్ని నిర్వహించడం ఒక విధానం అయితే, శరీరమే యజ్ఞకుండము అని అనుకుంటే, పంచాగ్నిస్వరూపమై ఆ పరమాత్మ మనలో ఉన్నట్టే కదా ! మూలాధార చక్రస్థానంలో నిలిచి మొదటగామనకి దర్శనమిచ్చే స్వామీ ఈ గణేశుడే !

ఏవిధంగా చూసినా ప్రథముడు,వినాయకుడు మన గణపతే! అగ్ని స్వరూపమైన , చిరునవ్వులొలికే ముగ్ధమోహనమైన వినాయక రూపమైనా ఆ స్వామి కరుణ కావలసిందే ! అందువల్ల యజ్ఞం చేయడం అంటే అది గణపతిని పూజించడమే అవుతుంది . యజ్ఞం వలన గణపతి అనుగ్రహముతో మన కామ్యములు (కోరికలు) నెరవేరతాయి . సర్వకార్యములలో విజయము సంప్రాప్తిస్తుంది . 

శుభం . 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi