వినాయకుడూ- సుబ్రహ్మణ్యుడూ నైష్ఠిక బ్రహ్మచారులు

3.230.142.168

వినాయకుడూ- సుబ్రహ్మణ్యుడూ నైష్ఠిక బ్రహ్మచారులు 
కూర్పు - లక్ష్మీ రమణ 

గణపతి ఉపాసన, కుమారస్వామి ఉపాసన విడివిడిగా చేసేటప్పుడు సిద్ధి,బుద్ధి -గణపతికి, వల్లీ,దేవసేనా- కుమారస్వామికి ఉన్న దేవేరులుగా పరిగణ చేస్తుంటాం . కానీ అమ్మవారి తనయులుగా వారిని భావించినప్పుడు శిశురూపంలోనే వారు సాక్షాత్కరిస్తున్నారు. ఇది ఉపాసనాపరమైన మర్మం. వీరిద్దరూ భ్రాంతిమాత్ర దాంపత్యం అనుసరిస్తున్నారు  అంటారు పండితులు . 

గణపతికి  – సిద్ధి,బుద్ధి దేవతలనూ , కుమారస్వామికి  – వల్లీ,దేవసేనా దేవిలను  భార్యలుగా అన్వయించడానికి వీలులేదు. వీరు ఆ దేవతల శక్తులకు సంకేతం. అందుకే దీనిని ‘భ్రాంతిమాత్ర దాంపత్యం’ అంటారు. దాంపత్యం వంటిదే తప్ప దాంపత్యం కాదు. ఇది ఉపాసనాపరమైన మర్మం అని విశ్లేషిస్తున్నారు.

గణపతికి సిద్ధిబుద్ధి భార్యలు, పుత్రులు క్షేముడు, లాభుడు. ఈ పేర్లని జాగ్రత్తగా పరిశీలించాలి . ఈ నామాలు సంకేతములు మాత్రమే. దేవతా విషయంలో స్త్రీలు అని చెప్పినప్పుడు శక్తులు అని అర్థం. గణపతి కార్యసిద్ధిని కలిగించే దేవత. అందుకే సిద్ధివినాయకుడు అంటాం. ఏ కార్యమైనా మనకి పరిపూర్ణఫలం ఇవ్వాలంటే రెండు లక్షణాలు ఉండాలి – కార్యానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి, చిట్టచివరికి ఆ కార్యం మనకి సిద్ధింపబడాలి. అందుకే కార్యానికి కావలసిన జ్ఞానము -బుద్ధి, కార్యము యొక్క ఫలము- సిద్ధి. ఈ రెండింటినీ శక్తులుగా కలిగినటువంటి కార్యసాధక శక్తి ఏదైతే ఉన్నదో ఆయన -గణపతి. అంటే, కార్యానికి అవసరమైన సాధన బుద్ధి, కార్యం యొక్క ఫలం సిద్ధి. ఈ రెండింటినీ ఇచ్చేవాడు విఘ్నసంహారకుడైన గణపతి. ఈ రెండూ ఒనగూరినాక మనకు లభించేది క్షేమము, లాభము. క్షేమం పరమార్థానికి సంబంధించినది, లాభం భౌతికమైన ఇహజీవితానికి సంబంధించినది. ఈ రెండూ గణపతి వల్ల మనకు లభిస్తున్నాయి కాబట్టి, పుత్రస్థానాలుగా చెప్పారు. అంతేకానీ భార్యలని, పుత్రులని భౌతికంగా, లౌకికంగా, దేవతారూపంగా కూడా భావించడం తగని విషయం. అయితే ఉపాసనాపరంగా వాటి బీజములు వాటికి ఉన్నాయి గనుక మంత్రబీజం అంటూ ఉంటే దేవతాకృతి అంటూ ఉంటుంది గనుక సిద్ధీ,బుద్ధీయుత గణపతిని ఉపాసించడం అనే మంత్రశాస్త్రవిషయం వేరు. అది పౌరాణిక కథలకు అన్వయించడానికి లేదు.

యోగపరంగా చెప్పుకుంటే యోగియైన సాధకుడికి ఋతంభరా అయినటువంటి ప్రజ్ఞ లభిస్తుంది. సృష్టికి ఆధారమైనటువంటి సత్యాలకి కూడా ఏవి ఆధారమైనవో ఆ సత్యాలను ఋతములు అంటారు. ఆ ఋతములు తెలుసుకోగలిగే ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఋతంభరా ప్రజ్ఞ అంటారు. యోగియైన సాధకుడికి ఋతంభరా ప్రజ్ఞ సమృద్ధిగా ఉంటుంది. ఆ ఋతంభరా ప్రజ్ఞాస్వరూపుడే గణపతి. అయితే ఈ ప్రజ్ఞాలాభం కలిగినప్పుడు బుద్ధి, సిద్ధి మనకి వశ్యం అవుతాయి. ఆ ప్రజ్ఞ కలుగకుండా అడ్డుకునేవి బుద్ధి, సిద్ధి. మన బుద్ధి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. బుద్ధి రకరకాలుగా ఆలోచనలు చేసి మేధాపరమైన భావనలు తెచ్చేటప్పటికీ బుద్ధికి కూడా అతీతమైనటువంటి ఋతంభరా ప్రజ్ఞను చేరుకోవడానికి బుద్ధియే ఆవరోధం అవుతోంది. వీటిని అధిగమించాలంటే చేయవలసింది గణపతి సాధన అని అర్థం . ఇక్కడ మూలాధార చక్రంలో వసించేది గణపతి అనే విషయాన్ని మరువకూడదు .  

అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని ‘గుహాయనమః’ అని పూజిస్తుంటాం . ఈయన సుషుమ్ననాడికి ప్రతిరూపం . సర్పస్వరూపం .  ఆయనని చుట్టుకొని ఉండే వల్లి, దేవసేనలు - ఇళ , పింగళ నాడులు . ఈ నదులలో పైకి చేరుకొనే శక్తి కుండలినియే జ్ఞానమాత .  ఇది కుండలినీ తంత్రం చెప్పే మాట ! 

నిజానికి గణపతిని, కుమారస్వామిని నైష్టిక బ్రహ్మచారులు అంటారు. అందుకే గణపతి ఆరాధనలోను, సుబ్రహ్మణ్య ఆరాధనలోను బ్రహ్మచారి (వటువు) పూజ ప్రత్యేకించి చెప్పారు. ఈ వటుపూజయే తెలియజేస్తుంటుంది వాళ్ళు నిత్యబ్రహ్మచారులు అని.

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda