వినాయకుని నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 విషయాలు ఇవే..!

3.239.58.199

వినాయకుని నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!

విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. అంతేనా, బుద్ధిమంతుడైన వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వంతో ఏవిధంగా నడుచుకోవాలనేది ఆచరణలో చూపిన మహనీయుడు. ఆయన కథల నుండీ ఎన్నో విషయాలని మనం నేర్చుకోవచ్చు . అలాంటి ఒక ఐదువిషయాలను గురించి ఇక్కడ చూద్దాం .    

1. విధి నిర్వహణకే అధిక ప్రాధాన్యం 

పార్వతీదేవి నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసింది. తాను అభ్యంగనం ఆచరించడానికి వెళుతూ ఎవ్వరినీ లోపలికి రానీయకుండా కాపలా కాయమంది. అమ్మ మాట శిరోధార్యంగా విధి నిర్వాహణకు ఉపక్రమించారు పార్వతీనందనుడు . గజాసుర గర్భస్త చెరను వీడి కైలాసానికి చేరిన నిటలాక్షుని, లోపలి వెళ్లకుండా ద్వారం వద్దే అడ్డుకున్నారు  గణేషుడు . శివుడు తాను ఫలానా అని చెప్పినా గణపతి వినరు . తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరినీ రాకుండా చూసుకోవాలి. అమ్మమాట అదేమరి ! కనుకనే సాక్షాత్తూ శివుడే వచ్చినా, తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణ నుండీ వెనుతిరగరు . తన కర్తవ్యాన్ని చివరిక్షణం వరకూ విడువరు.  ఆతర్వాత గజాననుడై పునర్జీవుడైన గౌరీతనయుని కథ అందరికీ తెలిసిందే . ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్యసాధనలో, కెరీర్‌లో ఖచ్చితంగా ముందుకు దూసుకెళ్లవచ్చు.

2. జగతిన తల్లిదండ్రుల కన్నా మిన్న లేనే లేదు  

గణేషుడు, కుమారస్వామిలలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు. వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్య క్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు. దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయల్దేరతారు . కానీ వినాయకుడు  మాత్రం తల్లిదండ్రులైన ఆదిదంపతులనే ఈ చరాచర సృష్టిగా భావించి వారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు . దీంతో కుమారస్వామికి తానూ ఎక్కడికి వెళ్లినా, అన్నగారు తనకన్నా ముందుగా అక్కడికి చేరుకొని మారలి వెళ్తున్నట్టు దర్శనం అవుతుంది.  వినాయకుడు గణాధిపతి అవుతాడు. నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుని జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది.

3.క్షమాగుణాన్ని అలవరచుకోవాలి. 

వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తుంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు. దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడై చంద్రున్ని ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండాపొమ్మని చెప్పి శాపం పెడతాడు. అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణనాయకుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్క రోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు. అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించమని మనకు వినాయకుడి జీవితం చెబుతుంది.

4.పనిలో అలసత్వం కూడదు . 

వేద వ్యాసుడు పంచమవేదమని ప్రసిద్ధి చెందిన మహాభారతాన్నిఆశువుగా చెబుతుంటే , అదే వేగంతో  వినాయకుడు తాళపత్ర గ్రంథాలపై రచన చేశారు. అయితే తాను ఆ మహాకావ్యాన్ని చెప్పేప్పుడు, చెప్పడం పూర్తి అయ్యేవరకూ  మధ్యలో ఆటంకం కలుగరాదని , రాయడం ఆగకూడదని వ్యాసులు ముందుగానే గణపతిని హెచ్చరిస్తారు . దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా, నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని చెప్పింది చెప్పినట్లుగా రాస్తూనే ఉంటాడు. ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం విరిగిపోతుంది .వ్యాసులు చెప్పడం ఆపరు . రచన ఆగకూడదు . దీంతో విఘ్నేషుడు తన దంతాల్లోంచి ఒక దాన్ని విరిచి, ఆ దంతాన్నే ఘంటంగా పట్టి గ్రంథ రచన సాగిస్తారు .అంతేకానీ , అవాతారమొచ్చిందన్న కారణంతో,  అర్థఅంతరంగా ఆగరు .  ఇలాగే మనంకూడా  ఏ పనిచేపట్టినా, ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి. కారణాలు ఏవైనా సంకల్ప సాధనకి పట్టు వీడకుండా కృషి చేయాలి . వాయిదాలు వేస్తూ, అలసత్వాన్ని అలవాటు చేసుకోకూడదు. 

5. ఆత్మ గౌరవం

ఒకసారి శ్రీమహావిష్ణువు ఇంట్లో జరిగే శుభ కార్యానికి దేవతలందరూ వెళ్తారు. స్వర్గలోకానికి గణపతిని కాపలా ఉంచి అందరూ వెళ్తారు. అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందునే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్లిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది. దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్లే దారిలో అన్నీ గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు. మూషికం దేవతలు వెళ్లే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది. దీంతో ఆ దారిలో వెళ్తున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు. అటుగా వెళ్తున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు. అతను వచ్చి వినాయకుని ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటకు లాగుతాడు. దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు. 

వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు. వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది. దీంతో వినాయకుడి వద్దకు వెళ్లి క్షమాపణలు కోరతారు. అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను ప్రదర్శించినా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మ గౌరవంతో అలా వ్యవహరించడం, మనకూ ఆదర్శనీయం కాదా ! ఆయనలోని ఆ గుణాన్ని కూడా మనమూ అనుసరించాల్సిందే. ఎట్టి పరిస్థితిలోనైనా ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు తెలియజేస్తుంది..!

అందుకేగా గణేశున్ని గుణాధ్యక్షాయ , గుణాధీశాయ, గుణవరిష్ఠాయ ధీమహి ! అని ప్రార్థిస్తాం . సకల సద్గుణాలకూ అధీశుడైన సిద్ధి బుద్ధి సమేత గణపతిని మనసారా స్మరిస్తూ , శలవు .

- లక్ష్మి రమణ 

Quote of the day

And as long as you're subject to birth and death, you'll never attain enlightenment.…

__________Bodhidharma