Online Puja Services

వినాయకునికి తెల్లజిల్లేడు

18.222.125.171
ప్రాచీనకాలంలో దక్షిణ భారతదేశాన్ని  "అర్కవనం " అని పిలిచేవారు.ఆ ప్రాంతమంతా దట్టమైన జిల్లేడు చెట్లతో మూలికా వనాలతో నిండి ఉండేది.  కుంభకోణం ..ఆడుతురై  సమీపాన వున్న సూర్యదేవుని దేవాలయ స్ధలపురాణంలో యీ  జిల్లేడు వేరు యొక్క అపూర్వమైన విశిష్టత  వివరించబడియున్నది. 
ఒకానొక కాలంలో గాలవ మహర్షి  హిమాలయాలలో  తపస్సు చేసుకుంటూ భవిష్యత్ ను తెలుసుకొనే  దివ్యశక్తి ని సంపాదించాడు.

ఆ పర్వతాలలో తపస్సు చేసుకునే మునులు కొందరు ఆయన వద్దకు వచ్చి, తమ భవిష్యత్ ను గురించి తెలుసుకున్నారు. ఒక యువ సాధువు కూడా వచ్చి గాలవ మహర్షిని తన భవిష్యత్ గురించి చెప్పమని అడిగాడు . గాలవ మహర్షి  వెంటనే  " నీకు  భవిష్యత్ లేదు.  ఫలితాలు లేవు.." అని చెప్పగా ,  తక్షణమే, ఆ సాధువు చివుక్కూన లేచి  " నేను  ఎవరో  తెలుసా..  కాలదేవుడిని.  ముందు  నీ
భవిష్యత్  ఏమిటో తెలుసుకో ," అని అదృశ్యమైపోయాడు. 

గాలవ మహర్షి జ్ఞాన దృష్టితో తనని గురించి తాను చూసుకోగా, గత జన్మలో తాను ప్రాణంతోవున్న పీత  కాళ్ళను పీకి తినినందున, యీ జన్మలో,  నికృష్టమైన కుష్టు వ్యాధితో బాధపడవలసి వస్తుందని,  అదే తన భవిష్యత్ అని తెలుసుకున్నాడు. తక్షణమే వింధ్యపర్వతాలకు వెళ్ళి,  అగ్నిని ప్రజ్వలింపజేసి
నవగ్రహా పూజలతో వారిని ప్రసన్నం చేసుకున్నాడు. వారు ఒకే సమయాన  గాలవ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఆ మహర్షికి  ఏ వ్యాధి రాకుండా వరాలను అనుగ్రహించారు.  నవగ్రహాలు ఇచ్చిన వరాలకు ఆగ్రహించిన  బ్రహ్మదేవుడు  కోపంతో , "  విధి ని ఎదిరించి మీరు వరాలు యిచ్చినందున మీ‌రు తొమ్మండుగురు గాలవ మహర్షి వ్యాధి విముక్తుడయ్యే వరకూ  భూలోకంలోని కష్టాలను అనుభవించమని, " శపించాడు.

వ్యాకులపడిన నవగ్రహాలు శాపవిముక్తి  ప్రసాదించమని వేడుకున్నారు. అందుకు "  భరతఖండంలోని దక్షిణప్రాంతంలో  కావేరీనదీ తీరానగల అర్కవనానికి  వెళ్ళి సోమవారమునాడు పవిత్ర స్నానాలు చేసి,  అక్కడ వెలసిన మంగళనాయకి సమేత ప్రణవనాధుడిని భక్తి శ్రధ్ధలతో  పూజించి,  అక్కడ మొలచిన  జిల్లేడు ఆకులలో పెరుగు అన్నము భుజించి మీ మీ స్థావరాలకు చేరమని " బ్రహ్మదేవుడు ఆదేశించాడు.

నవగ్రహ నాయకులు బ్రహ్మదేవుని ఆనతిని పాటించి శాప విముక్తులైనారు. అక్కడ అగస్త్య మహర్షిని
దర్శించి  ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. అప్పుడు అగస్త్య మహర్షి వారికి  శ్వేత గణపతి గురించి తెల్ల జిల్లేడు మూలికల విశిష్టత గురించి తెలియజేశాడు. ఈ తెల్ల జిల్లేడు మూలిక  అత్యంత వశీకరణ శక్తి కలదిగా సిధ్ధ పురుషుల స్తోత్రపాఠాల ద్వారా తెలుస్తున్నది.  

తెల్ల జిల్లేడు మూలికలతో తయారు చేసిన చిన్న వలంపురి వినాయకుని ప్రతిమను , యీ మంత్రసమన్వితమైన  రాగి యంత్రం  మీద పెట్టి విధి విధానాలు పాటిస్తూ పూజిస్తే సకల సిరి సంపదలతో తులతూగుతూ ,భోగభాగ్యాలు  అనుభవిస్తారు. వశిష్ఠ మహర్షికి   శ్వేతార్క మూలిక మహిమ గురించి అగస్థ్యముని ప్రధమ శిష్యుడైన  శ్రీదిరణ  ధూమాగ్ని  యిలా తెలియ చేశాడు. 
మన పూజలను అందుకునే  గణపతి భక్త సులభుడు. నవగ్రహాల దోషాలను, చెడు దృష్టి దోషాలు వంటి
పలువిధాలైన దోషాలను శ్వేతార్క గణపతి అని పిలవబడే తెల్ల జిల్లేడు మూలికతో చేసిన గణపతిని
పూజించడం ద్వారా తొలగించుకొని సర్వ శుభాలను పొందవచ్చును. 

శేషశ్రీ

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore