Online Puja Services

పరమేశ్వరుడే ఉపదేశించిన గణపతి పూజావిధి

18.191.223.123

అన్ని కార్యాలలో విజయాన్నిచ్చే, పరమేశ్వరుడే ఉపదేశించిన గణపతి పూజావిధి ఇదీ . 
- లక్ష్మి రమణ 

గజాసురుని వృత్తాంతంలో పరమేశ్వరుడు గణపతితో యుద్ధం చేసి , చివరికి గణపతిని సంహరించి తిరిగి బ్రతికించిన వృత్తాంతాన్ని గణపతి చతుర్థి నాడు కథగా చదువుకుంటూ ఉంటాం . అయితే, స్కాంద పురాణంలో పరమేశ్వరుడు బ్రహ్మాదిదేవతలకూ ఉపదేశించిన గణేశపూజా విధానం ఉన్నది .  ఆయన పూజా విధితో పాటు, గణేశున్ని ఏవిధంగా భావన చేసి , పూజించాలి అనే విషయాన్ని కూడా మహేశ్వరుడు వివరిస్తారు . ఈ విధంగా గణేశున్ని పూజిస్తే, సర్వ కార్యాలలో విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థితి ప్రాప్తిస్తుంది . అంత్యాన మోక్షం సిద్ధిస్తుంది . 

పూజావిధి : 

 ప్రతి నెలలోనూ వచ్చే రెండు పక్షాలలో అంటే శుక్లపక్షంలోనూ, బహుళపక్షంలోనూ ఉండే చతుర్థి తిథినాడు విధిగా  గణేశున్ని ఆరాధించాలి . ఆరోజు ఉదయమే తెల్ల నువ్వులు కలిపిన నీళ్లతో స్నానం చేయాలి. తరువాత యధావిధిగా నిత్య పూజలు నిర్వహించి, గణపతి ప్రతిమని స్థాపించాలి.  ముందుగా గణపతిని ధ్యానించాలి.  గణపతికి ఎన్నో పేర్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన నామాలని ఇలా పూజ చేసేటప్పుడు చెప్పుకుంటే  సరిపోతుంది.  

పంచవక్త్రో గణాధ్యక్షో దశాబాహు స్త్రీలోచనః 
కాంతస్పటిక సంకాశో నీలకంఠో గజాననః 

అంటే, ఐదు తలలు కలిగినటువంటి వాడు, గణాలకి అధిపతి, 10 చేతులు కలిగిన వాడు, మూడు కళ్ళు కలిగిన వాడు, అందమైన స్పటికం లాంటి కాంతితో మెరిసిపోయేవాడు నీలం రంగు కంఠాన్ని కలిగిన వాడు గజాననుడు అనేది గణపతి ప్రధానమైన పేర్లు. 

ఈ శ్లోకంలో వివరించిన ఆ గణపతికున్న ఐదు తలలు, ఐదు రకాలైన వర్ణాలతో విభిన్నంగా ఉంటాయి. ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు పది రకాలుగా ఉంటాయి. అవి ఏ రకంగా ఉంటాయో కూడా భావానికి అనుకూలంగా స్కాంద పురాణం వివరిస్తుంది . 

మద్యమం తు ముఖం గౌరం చతుర్ద చతుర్దంతం త్రిలోచనం | 
శుండాదండమనోజ్ఞం చ పుష్కరే మోదకాన్వితం|| 

తథాన్యత్పీత వర్ణంచ నీలంచ శుభ లక్షణం| 
పింగళంచ తధా శుభ్రం గణేషశ్య శుభాననం || 

తధా దశబుజేష్వే హ్యాయుధాని బ్రవీమి వః  | 
పాశం పరశుపద్మే చ అంకుశం దంతమేవచ|| 

అక్షమాలాం లాంగలం చ ముసలం వరదం తథా | 
పూర్ణించ మోదకై: పాత్రం పాణినాచ విచింత యేత్ || 

లంబోదరం విరూపాక్షం నవీతం మేఘలాన్వితం | 
యోగాసనే చోపావిష్టం చంద్రలేఖాంకశేఖరం|| 

ఈ శ్లోకము లో వినాయకుని రూపము, ఆయన ఆయుధాలు వివరించారు . ఇటువంటి రూపాన్ని మనం పూజించాలి. అదెలా ఉన్నదంటే,  వినాయకుడి మధ్యలో ఉన్న ముఖము ఎర్రటి రంగుతో ,మూడు కళ్ళతో, ఒక దంతంతో అందంగా ఉంటుంది.  ఆ దంతాలో ఒక మోదకం కూడా ఉంటుంది.  ఇతర ముఖములలో ఒకటి  పసుపు రంగుతో,  మరొకటి  నీలం రంగుతో, మరో ముఖము ధూమ్ర వర్ణంతో, ఐదవ ముఖము తెల్లటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. 

 ఇలా ఐదు ముఖములతో ప్రక్షశిస్తున్న గణేశుడు  10 చేతులు కలిగి ఉంటారు . ఆ దశ భుజాలలోనూ వరుసగా పాశము, పరశువు, పద్మము అంకుశము, దంతము, అక్షమాల, నాగలి, రోకలి, వరాలనిచ్చే అభయ హస్తము, మోదకాలు నిండిన పాత్రని పట్టుకున్న చేయి ఉంటాయి.

గణపతి యొక్క ఈ విశిష్టమైన రూపంతో పాటుగా , లంబోదరునిగా, విరూపాక్షునిగా, యజ్ఞోపవీతాన్ని వడ్డానాన్ని ధరించిన గణపతిని,  యోగాసనంలో కూర్చుని చంద్ర రేఖని తలమీద ధరించిన స్వరూపముగా కూడా ఆరాధన చేయాలి .  

గుణాతీతుడైన గణేశున్ని, త్రిగుణాలకీ ప్రతీకగా చేస్తూ ఆరాధన చేయడం, ధ్యానం మరింత విశిష్టం. దీని వల్ల ఆయా గుణాల వల్ల వ్యక్తులలో గలిగే ప్రతికూలతలని అధికమించి , వాటి సమన్వయాన్ని సాధించడం సాధ్యమవుతుంది . అటువంటి గణపతిని ఎలా ధ్యానించాలో వివరించారు .   

భక్తితో వినాయకుడిని సాత్విక, రాజసిక, తామసిక అనే మూడు గుణాల ప్రతీకలుగా  ధ్యానం చేయాలి. ఈ  గుణాలకి అది దేవుడిగా దేవునిగా ధ్యానం చేయాలి. 

పరిశుద్ధమైన బంగారం లాంటి రంగుతో మెరిసిపోయే వాడు అలౌకిక గజాన మూర్తి .  ఆయన సాత్విక గుణ సంపన్నుడు. నాలుగు భుజాలు, మూడు కళ్ళు, ఒక దంతము, పెద్ద పొట్ట కలిగి ఉండి  చేతులలో  పాశము, అంకుశము చేతులలో ధరించి దర్శనమిచ్చే గణపతి రాజసిక గణపతి . ఈ రూపంతో ఉన్న స్వామిని భావన చేస్తూ  రాజసిక ధ్యానాన్ని చేయాలి . దంతంతో మోదకాల పాత్రను ధరించి, నీలం రంగు ముఖంతో వెలుగొందే స్వామీ తామస గణపతి.  ఈ విధంగా మూడు రకాల ధ్యానాలు చేసి ఆ తరువాత గరికలతో గణపతిని పూజించాలి . 

గణపతి పూజలో భాగంగా స్వామిని ఇరవై ఒక్క నామాలతో పూజించాలి. అలా పూజించేందుకు ముందుగా, 11 గరికపరికల్ని తీసుకుని దాన్ని ఒక కట్టగా కట్టాలి.  అలాంటివి 21 గరిక కట్టలని, అలాగే 21 మోదకాలు లేదా లడ్డూలని పూజలో భాగంగా గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. 

గణాధిప నమస్తేస్తు  ఉమాపుత్ర విఘ్ననాశన|  
వినాయకేష పుత్రేతి  సర్వసిద్ధి ప్రదాయకః || 
ఏకదంతే భవక్ర్తితి తథా మూషక వాహన | 
కుమార గురవే తుభ్యనీయః ప్రయత్న: || 

అంటే గణాలకి అధిపతి, పార్వతీపుత్రుడు, పాపాలని నశింప చేసేవాడు, వినాయకుడు, ఈశ్వర పుత్రుడు, అన్ని రకాల సిద్దులని ఇచ్చేవాడు, ఒకే దంతాన్ని కలిగిన వాడు, ఏనుగు ముఖంతో ఉన్నవాడు, మూషిక వాహనాన్ని ఎక్కినవాడు, కుమారస్వామికి గురువుగా ఉన్నవాడు అనే ఈ శ్లోకాన్ని చెప్పుకుని ఆ తర్వాత గణపతిని పైన చెప్పుకున్నట్టు 21 నామాలతో అర్చించాలి .  

 ఈ విధంగా గణపతిని పూజిస్తే మీరు చేసే పనులకి ఎటువంటి ఆటంకాలు కలగవు.  అన్ని సర్వదా విజయాలే సిద్ధిస్తాయి.  అని పరమేశ్వరుడు దేవతలు అందరికీ ఈ గణపతి పూజా విధానాన్ని, దాని ఆవశ్యకతని వివరించారు.  ఆయన చెప్పిన ప్రకారం దేవతలందరూ ప్రతి శుక్ల కృష్ణపక్ష చతుర్ధితులలో గణపతి పూజ చేయడం ప్రారంభించారు.  ఆ ఆచారం ఆనాడు అలా ప్రారంభమై నేటి వరకు కొనసాగుతోంది. శుభం . 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi