Online Puja Services

వినాయక చవితి పూజా విధానం..2023 (తెలుగు)

3.15.156.140
ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకుని, నమస్కరించుకుని, ఈ విధంగా ప్రార్ధించుకోవాలి. 
 
ప్రార్థన:
 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే || 
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు || 
 
తదేవలగ్నం, సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంఘ్రి యుగంస్మరామి || 
 
లాభస్తేషాం,  జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః 
యేషామిందీవర శ్యామో హృదయస్తో జనార్దనః || 
 
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమా మ్యహం || 
 
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః 
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః, 
వక్రతుండ శ్శూర్పకర్ణో, హేరంబః స్కంధ పూర్వజః    
 
అష్టావష్టౌ చ నామాని యః పఠేచ్ఛృణుయాదపి 
విద్యారంభే వివాహేచ ప్రవేశ నిర్గమేతథా 
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్యనజాయతే 
అభీప్సితార్థ సిద్ధర్థ్యం , పూజితో యస్సురైరపి,
సర్వవిఘ్నచ్చి దేత స్మై గణాధిపతయే నమః ||    
 
(నమస్కరించుకుని ఆచమనం చేయాలి. ఎడమచేతితో ఉద్దరిణ పట్టుకుని, నీటి పాత్ర నుంచి మూడుసార్లు నీటిని కుడి చేతిలో వేసుకుంటూ కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అంటూ నీటిని తాగాలి. హస్తం ప్రక్షాళ్య అంటూ ఉద్దరిణతో నీటిని తీసుకుని చేతిని కడుక్కోవాలి.)
 
గోవిందాయనమః, విష్ణవేనమః, మధు సూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయనమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయనమః, పద్మనాభాయనమః, దామోదరాయనమః, సంకర్షణాయనమః, వాసుదేవాయనమః, ప్రద్యుమ్నాయనమః, అనిరుద్దాయనమః, పురుషోత్త మాయనమః, అధోక్షజాయనమః, నారసింహాయనమః, అచ్యుతాయనమః, జనార్దనాయనమః, ఉపేంద్రాయనమః, హరయేనమః, శ్రీకృష్ణాయనమః.
 
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః |
(ప్రాణాయామం చేయాలి. నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ, గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించాలి) 
 
ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః ఓం తపః ఓగ్ మ్  సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
 
(దీపారాధన వెలిగించి ఈ విధంగా సంకల్పము చెప్పుకోవాలి)
 
సంకల్పం : 
 
ఓం || మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తె అద్యబ్రహ్మణః ద్వితీయపరార్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య .... ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పు కోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన  శ్రీ  శోభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే, చతుర్ధ్యాం  తిధౌ, స్థిర  వాసరే  , శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శుభతిధౌ, శ్రీమాన్ ... గోత్ర: ... నామధేయః, శ్రీమతః ...గోత్రస్య ...నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ద్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనో వాంఛా ఫలసిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళా వాప్త్యర్థం, వర్షేవర్షే  ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్దీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ది వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి) ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణాధిపతి పూజాం కరిష్యే | తదంగ కలశపూజాం కరిష్యే ||
 
కలశపూజ: కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | తస్యోపరి హస్తం నిధాయ |
(కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి) 
 
కలశస్యముఖేవిష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః 
మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా 
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః 
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః || 
ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయకారకాః 
 
(మన వద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్దతిలో తిప్పాలి) 
 
శ్లో || గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు || 
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య 
 
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించాలి.
 
విఘ్నేశ్వర పూజ:
 
గణానాంత్వాం గణపతిగం  హవామహే, 
కవిం కవీనా ముపమశ్రవస్తమం 
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణ్యస్పత్యః 
ఆనశృణ్వన్నూతిభి స్సీద సాదనం || 
శ్రీ మహాగణాధిపతయే నమః || . 
ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (మధ్య వేలితో నీటిని తాకాలి)
 
ధ్యానం: 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే 
 
అనే శ్లోకం చదువుతూ పూలూ అక్షతలూ కలిపి పసుపు గణపతి  పాదాల చెంత ఉంచాలి. పూజను దేవుని పాదాల వద్ద మాత్రమే  చేయాలి. శిరసుపైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు.
 
ధ్యాయామి ధ్యానం సమర్పయామి || 
ఆవాహయామి ఆసనం సమర్పయామి || 
పాదయోః పాద్యం సమర్పయామి || 
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి || 
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి|| 
 
అని చెబుతూ ఉద్ధరిణతో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెం లేదా పాత్రలో వేయాలి. 
(పసుపు గణపతిని గంధం, అక్ష తలు, పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. అగరువత్తులు వెలిగించి, బెల్లం లేదా పండు నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ చేయాలి.)
యధాభాగం గుడం నివేదయామి || 
శ్రీ మహాగణాధిపతి స్సుప్రసన్నో, సుప్రీతో, వరదోభవతు || 
శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసాగృహ్లామి || 
అంటూ పూజచేసిన అక్షతలు రెండు తీసుకొని తలపై ఉంచుకోవాలి.
 
శ్రీ మహాగణాధిపతియే నమః యథాస్థానం ప్రవేశయామి 
శోభనార్డే క్షేమాయ పునరాగమనాయచ
 
అంటూ పసుపు గణపతిని కొద్దిగా తూర్పు వైపుకు కదిలించి.. అక్షతలు వేసి నమస్కారం చేయాలి. 

మరల ఆచమనం మళ్ళీ చేయాలి. మరియు సంకల్పం కూడా చెప్పుకోవాలి. (క్రింద చెప్పిన విధంగా చేయండి)

ఇప్పుడు ఇంకొక చెంబులో నీరు తీసుకోవాలి. పసుపు గణపతి కోసం వాడిన చెంబు, నీరు ప్రక్కన పెట్టివేయాలి. 

(నమస్కరించుకుని ఆచమనం చేయాలి. ఎడమచేతితో ఉద్దరిణ పట్టుకుని, నీటి పాత్ర నుంచి మూడుసార్లు నీటిని కుడి చేతిలో వేసుకుంటూ కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా అంటూ నీటిని తాగాలి. హస్తం ప్రక్షాళ్య అంటూ ఉద్దరిణతో నీటిని తీసుకుని చేతిని కడుక్కోవాలి.)
 
గోవిందాయనమః, విష్ణవేనమః, మధు సూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయనమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయనమః, పద్మనాభాయనమః, దామోదరాయనమః, సంకర్షణాయనమః, వాసుదేవాయనమః, ప్రద్యుమ్నాయనమః, అనిరుద్దాయనమః, పురుషోత్త మాయనమః, అధోక్షజాయనమః, నారసింహాయనమః, అచ్యుతాయనమః, జనార్దనాయనమః, ఉపేంద్రాయనమః, హరయేనమః, శ్రీకృష్ణాయనమః.
 
ఉత్తిష్ఠంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూర్భువస్సువః దైవీ గాయత్రీ ఛందః. ప్రాణాయామే వినియోగః |
(ప్రాణాయామం చేయాలి. నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ, గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించాలి) 
 
ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః ఓం తపః ఓగ్ మ్  సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్. ఓ మాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.
 
సంకల్పం : 
 
ఓం || మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభేశోభనే ముహూర్తె అద్యబ్రహ్మణః ద్వితీయపరార్దే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, అష్టావింశతి తమే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరత వర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య .... ప్రదేశే (శ్రీశైలానికి ఏ దిక్కులో వుంటే ఆ దిక్కు పేరు చెప్పు కోవాలి), అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన  శ్రీ శోభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే, చతుర్ధ్యాం  తిధౌ, స్థిర  వాసరే  , శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం , శుభతిధౌ, శ్రీమాన్ ... గోత్ర: ... నామధేయః, శ్రీమతః ...గోత్రస్య ...నామధేయస్య (పూజ చేసే వారు గోత్రం, పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి) ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయిర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ద్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, మనో వాంఛా ఫలసిద్ధ్యర్థం, సమస్త దురితోపశాంత్యర్థం, సమస్త మంగళా వాప్త్యర్థం, వర్షేవర్షే  ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్దీ ముద్దిశ్య, శ్రీ వరసిద్ది వినాయకదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్యవేలితో నీళ్ళు ముట్టుకోవాలి)  తదంగ కలశపూజాం కరిష్యే ||

కలశపూజ: కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య | తస్యోపరి హస్తం నిధాయ |
(కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వుంచి దానిని చేతితో తాకుతూ ఈ మంత్రం చదవాలి) 
 
కలశస్యముఖేవిష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః 
మూలే తత్రస్థితో బ్రహ్మా, మధ్యే మాతృగణాస్మృతాః,
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా 
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః 
అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః || 
ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయకారకాః 

 
(మన వద్ద వున్న నీటిపాత్ర చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టి అందులో తమలపాకు వుంచుకోవాలి. ఈ శ్లోకం చదువుతూ ఆకును నీటిలో సవ్య పద్దతిలో తిప్పాలి) 
 
శ్లో || గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ 
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు || 
కలశోదకేన పూజాద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య 

 
తమలపాకుతో కలశంలోని నీటిని పూజాద్రవ్యముల మీదా, దైవము మీదా, తమమీదా కొద్దిగా చిలకరించుకోవాలి. అనంతరం వరసిద్ధి వినాయకుని పూజించాలి.

అథ శ్రీ వరసిద్ధి వినాయక పూజాం కరిష్యే. తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే- అంటూ కుడిచేతి మధ్య వేలితో నీటిని తాకాలి.
 
శ్రీ వరసిద్ది వినాయక ప్రాణప్రతిష్ఠ : (విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరించి)
 
ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం - 
ఇత్యాద్యేన ప్రాణ ప్రతిష్టాపనం కృత్వా, 
నమస్కృత్వా (నమస్కారం చేస్తూ) 
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః, 
 
శ్లో || స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం
తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు || 
అవాహితోభవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ, వరదోభవ, ప్రసీద, ప్రసీద, ప్రసీద (అంటూ వినాయకుడి విగ్రహం పాదాల వద్ద అక్షతలు లేక పూలు వేయాలి)
 
షోడశోపచార పూజా: 
 
భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ 
విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే || 
ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం 
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ది వినాయకమ్ || 
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం 
భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం || 
ధ్యాయే ద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం 
చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ||
 
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి || 
 
(వినాయకుడి విగ్రహం పాదాల వద్ద పూలు, అక్షతలు వేసి నమస్కరించాలి)
 
అత్రాగచ్చ జగద్వన్ద్య సురరాజార్చితేశ్వర 
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ || 
 
ఆవాహయామి || (మరల అక్షతలు వేయాలి) 
 
మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ 
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్  
 
ఆసనం సమర్పయామి || (అక్షతలు లేదా పూలు వేయాలి) 
 
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన 
గృహాణార్ఘ్యం మయాదత్తం గన్దపుష్పాక్షతైర్యుతమ్
 
అర్ఘ్యం సమర్పయామి || (ఉద్దరిణతో నీరును స్వామికి చూపించి పక్కన వుంచుకున్న పాత్రలో వేయాలి)   
 
గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్ట ప్రదాయక 
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన 
 
పాద్యం సమర్పయామి || (మరలా కొంచె నీటిని స్వామికి చూపు స్వామి పాదాల ముందుంచాలి)
 
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత 
గృహాణాచమనందేవ తుభ్యందత్తం మయా ప్రభో
 
ఆచమనీయం సమర్పయామి || (కొంచె నీటిని స్వామికి చూపించు పాత్రలో వేయాలి) 
 
దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ 
మధుపర్కం గృహాణేదం గజవక్త నమోస్తుతే
 
మధుపర్కం సమర్పయామి || (స్వామికి మధుపర్కాన్ని సమర్పించాలి.
 
స్నానం: 
పంచామృతైర్దేవ గృహాణ గణనాయక 
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత
 
పంచామృత స్నానం సమర్పయామి || 
(ఆవుపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు కలిపి స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి) 
 
గంగాది సర్వ తీర్దేభ్యః ఆహృతై రమలైర్జలై: 
స్నానం కురుష్వ భగవన్వుమాపుత్ర నమోస్తుతే 
  
శుధోదక స్నానం సమర్పయామి || (కొంచెం నీటిని స్వామిపై చల్లాలి)
 
రక్తవస్త్రద్వయంచారు దేవయోగ్యంచ మంగళం 
శుభప్రద గృహాణత్వం లమ్బోదర హరాత్మజ 
 
వస్త్రయుగ్మం సమర్పయామి || (స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకొనేట్లయితే పత్తికి పసుపు, కుంకుమ రాసి దానిని వస్త్రంగా ఇవ్వవచ్చు) 
 
రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకమ్ 
గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక 
 
ఉపవీతం సమర్పయామి ||  (యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి) 
 
చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం 
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ 
 
గంధం సమర్పయామి || (కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి)
 
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ 
శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే 
 
అక్షతాన్ సమర్పయామి || (స్వామికి అక్షతలు సమర్పించాలి) 
 
సుగన్దాని చ పుష్పాణి జాతీకుంద ముఖాని చ 
యేకవింశతి పత్రాణి, సంగృహాణ నమోస్తుతే 
 
పుష్పాణి పూజయామి || (స్వామిని పూలతో పూజించాలి) 
 
అథ అంగపూజ:
 
గణేశాయ నమః పాదౌపూజయామి | 
ఏకదంతాయ నమః గుల్సౌపూజయామి | 
శూర్పకర్ణాయ నమః జానునీ పూజ యామి|| 
విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి || 
ఆఖు వాహనాయ నమః ఊరూం పూజయామి || 
హేరంబాయ నమః కటిం పూజయామి || 
లంబోదరాయ నమః ఉదరం పూజయామి || 
గణనాథాయనమః నాభిం పూజయామి | 
గణేశాయ నమః హృదయం పూజయామి | 
స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి || 
స్కందాగ్రజాయనమః స్కందౌ పూజయామి | 
పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి || 
గజవక్రాయ నమః వక్రం పూజయామి | 
విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి | 
శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి ||    
ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి | 
సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి | 
విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి | 
 
అథ ఏకవింశతి పత్ర పూజ :
 
(ఒక్కొక్క నామం చదువుతూ బ్రాకెట్ లో పేర్కొన్న పత్రాలు తీసుకొని స్వామిని పూజించాలి. )
 
ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచిపత్రి) 
ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి (వాకుడాకు) 
ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు) 
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె) 
ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త) 
ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి (రేగి) 
ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి (ఉత్తరేణు) 
ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి (తులసి) 
ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి (మామిడి) 
ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి (గన్నేరు) 
ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంతం) 
ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ) 
ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి (దేవదారు) 
ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి (మరువం) 
ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి (వావిలి) 
ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి) 
ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (గండకీ) 
ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి)  
ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి) 
ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (మద్ది) 
ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (తెల్లజిల్లేడు) 
ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతపత్రాణి పూజయామి.
 
దూర్వాయుగ్మ పూజ 
(క్రింది మంత్రాలకు గరికతో పూజ చేయవలెను)
 
గణాధిపాయ నమః  దూర్వాయుగ్మేన పూజయామి 
ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
అఖువాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
సర్వసిద్ధి ప్రదాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మేన పూజయామి
కుమార గురవే నమః దూర్వాయుగ్మేన పూజయామి
 
** అనంతరం శ్రీ వినాయక అష్టోత్తరశతనామాలు చదువుతూ స్వామికి పూలతో లేదా అక్షతలతో ఇంకా, రకరకాల పత్రితో పూజ చేయాలి.)
 
గణేశ అష్టోత్తర శత నామావళి 
 
ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)
ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)
ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)
ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)
ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)
ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)
ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)
ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)
ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః (90)
ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్తదేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)
ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)
 
ధూపం 
 
శ్లో || దశాంగం గుగ్గులో పేతం సుగన్దిం సుమనోహరమ్
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ 
 
ధూపమాఘ్రాపయామి || (అగరువత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన వున్న స్టాండులో కాని, అరటిపండుకు కానీ గుచ్చాలి.)
 
దీపం 
 
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా 
గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే 
 
దీపం దర్శయామి || (దీపాన్ని స్వామికి చూపించాలి) 
 
నైవేద్యం (కొబ్బరికాయలు ఇంకా వుంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకు ముందు స్నానం సమయంలో కొట్టిన కొబ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపండ్లు మొదలైన వాటిని స్వామి ముందుంచాలి) 
 
సుగంధాన్ సుకృతాం శ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్, 
నైవేద్యం గృహ్యతాం దేవ చణముధ్యైః ప్రకల్పితాన్ || 
భక్ష్యం, భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయ మేవచ 
ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక 
 
మహానైవేద్యం సమర్పయామి ||

మీరు తయారు చేసుకున్న నైవేద్యాలన్నీ స్వామివారి ముందు పెట్టి నివేదన చేయాలి. 

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్
గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … .....

సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… 
ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, 
ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా నైవేద్యం  సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి 

నివేదనము చేసి నీటిని వదలవలెను.

తాంబూలం 
 
పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతమ్, 
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ 
 
తాంబూలం సమర్పయామి |
 
(తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని  వినాయకుడి విగ్రహం ముందు వుంచి నమస్కరించాలి.)
 
నీరాజనం 
 
సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ, 
భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక 
 
సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి || 
 
ఘృతవర్తి సహసైశ్చ కర్పూరశకలైస్తథా 
నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ 
 
నీరాజనం సమర్పయామి || (కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి, ఆ తరువాత హారతి పాత్రపై కొంచె నీటిని ఉంచి కళ్ళకు అద్దుకోవాలి)
 
మంత్రపుష్పం 
(పుష్పం, అక్షతలు తీసుకొని నిలుచొని ఈ శ్లోకాన్ని పఠించాలి) 
 
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః 
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా 
ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః 
వక్రతుండః మహాకాయ కోటిశూర్య సమప్రభ 
అవిఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా (అక్షతలు, పూలు స్వామి పాదాల వద్ద వుంచాలి) 
 
ప్రదక్షిణ 
 
శ్లో ॥ యానికానిచ పాపాని జన్మాన్తరకృతానిచ | 
తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదే పదే || 
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసమ్భవః | 
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల || 
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | 
తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప || 
 
ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ||
 
(ప్రదక్షిణ చేసి నమస్కరించాలి. సాషాంగ ప్రణామం చేయడం సంప్రదాయం ) ఆ తరువాత మరలా కూర్చొని, కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి.
 
 కొంచే నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకోవాలి.
యస్యస్మృత్యాచ నామోఖ్య తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణం తాం యాతి సద్యో వందే తం గణాధిపం 
 
మంత్రహీనం క్రియాహీనం శక్తి హీనం మహాప్రభో 
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||
 
అనయా ధ్యానమావాహనాది షోడషోపచార పూజయాచ, అష్టోత్తర నామార్చనయాచ, అవసర, మహా నివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు
 
అంటూ అక్షతలు, నీటిని పళ్ళెంలో వదలాలి. 
 
ఉద్యా పన: 
 
యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్ 
తే హనాకం మహిమానః సచంతే యత్రపూర్వే సాధ్యా సంతి దేవాః
 
శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి.. 
శోభనార్థం పునరాగమనాయచ.
 
అనే మంత్రం చదువుతూ విఘ్నాధిపతిని ఈశాన్యం దిశగా కదిలించి స్వామివారికి ఉద్యాపన చెప్పుకోవాలి. 
 
(నిత్యపూజ చేసి చవితి నుంచి 3, 5, 7, 9, 11 రోజుల్లో నిమజ్జనం చేసేవారు ఆ రోజున ఈ మంత్రం పఠించి ఉద్యాపన చెప్పుకోవాలి.)
 
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయ కరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం
 
అంటూ పంచామృతాలు, కొబ్బరి నీళ్ళను కలిపి తీర్థంగా తీసుకోవాలి. అనంతరం పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై వుంచాలి. పెద్దలు కూడా ఆ అక్షతలు శిరసుపై ధరించాలి.
 
వినాయక వ్రత కథ
 
సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం, ఆరోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించటం మొదలు పెట్టాడు.
ఒకప్పుడు గజ (ఏనుగు) రూపంలో వున్న గజాసురుడు అనే రాక్షస రాజు పరమ శివుడిని గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు.
అప్పుడు గజాసురుడు "స్వామీ, మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే వుండాలి" అని కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోర్కె తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే వుండటం మొదలు పెట్టాడు.
ఇదిలా వుంటే, కైలాసం (శివుడి ఇల్లు)లో వున్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్లా వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో వున్నాడని తెలుసుకుంది. కానీ, శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి, చివరికి విష్ణుమూర్తిని ప్రార్ధించి, తన భర్త విషయం చెప్పింది.
"ఓ మహానుభావా, పూర్వం భస్మాసురుని బారినుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు” అని కన్నీళ్ళు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీ దేవిని ఓదార్చి పంపేశాడు.
అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుని చం పేందుకు గంగి రెద్దులను ఆడించేవాడిగా వెళ్ళటమే సరైనది అని నిర్ణయించాడు.
శివుడి వాహనం నందిని ఒక గంగి రెద్దుగా చేసి, బ్రహ్మ మొదలైన దేవతల చేత తల కొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరు గంటలు, సన్నాయి తీసుకుని గజాసురుడు వుండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుడి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగి రెద్దు ఆట చూచి గజాసురుడు ఆనందం పొంది, “మీకు ఏం కావాలో కోరుకోండి. నేను ఇస్తాను" అని చెప్పాడు.
అప్పుడు శ్రీహరి “ఇది శివుడి వాహనం నంది. శివుడిని వెదికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు" అని కోరాడు.
 
ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగి రెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకుని, తనకు చావు తప్పదని అర్ధం చేసుకున్నాడు. అపుడు తన పొట్టలోపల వున్న శివుడిని “నా శిరస్సు అందరికీ పూజ్యనీయంగా వుండాలి. నా చర్మం నువ్వు ధరించాలి" అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా, లోపలనుంచి శివుడు బైటకు వచ్చాడు.
హరి శివుడితో "చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది” అని చెప్పాడు. తర్వాత బ్రహ్మ, ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు.
 
వినాయకుడి పుట్టుక
 
కైలాసంలో వున్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తల స్నానం చేయాలని నిర్ణయించుకుని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు వుంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకుని శివుడి కోసం ఎదురు చూడటం మొదలు పెట్టింది.
ఇది ఇలా వుండగా, శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో వున్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు.
లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురువచ్చి పూజించి, కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో వున్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి, తాను తీసుకు వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి 'గజాననుడు' అనే పేరు పెట్టి, పెంచుకోవటం ప్రారంభించారు.
గజాననుడు కూడా భక్తితో తల్లి తండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగటం మొదలు పెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహా వీరుడు. నెమలి అతని వాహనము.
 
విఘ్నేశాధిపత్యము 
 
ఒకరోజు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి, “విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి” అని కోరారు. తాను పెద్దవాడు కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే వుండాలని గజాననుడు కోరాడు. గజాననుడు పొట్టిగా వుంటాడు, తగిన అర్హతలు లేవు కాబట్టి అధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు.
శివుడు వారితో “మీలో ఎవరు మూడు లోకాల్లోని పుణ్య నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను" అని చెప్పాడు.
కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలూ తిరగటానికి వెళ్లిపోయాడు. గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి "అయ్యా, నా గురించి తెలిసి కూడా ఈ విధంగా చెప్పటం మీకు సరైనదా? మీ పాద సేవకుడిని. నాయందు దయ చూపి తగిన ఉపాయం చెప్పండి" అని కోరుకున్నాడు.
శివుడు "నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు మా చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఇది అన్ని తీర్ధాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది" అని చెప్పాడు. వినాయకుడు అదే విధంగా చేశాడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్టు అనిపించింది. అతనికి మూడు కోట్ల ఏభై లక్షల నదులో కూడా తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్టు కనిపించాడు.
ఇది చూసి ఆశ్చర్యపోయి, కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర వున్న అన్నను చూసి, నమస్కరించి, తన బలాన్ని తిట్టుకుని "తండ్రీ, అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను. క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్ధించాడు.
భాద్రపద శుద్ధ చతుర్ధి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు అన్ని దేశములవాళ్ళూ విఘ్నేశ్వరుడికి తమ స్థాయిని బట్టి కుడుములు, మిగిలిన పిండి వంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటి పళ్ళు, పానకము, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని, కొన్ని తన వాహనం అనింద్యుడికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకుని, నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు.
తల్లి తండ్రులకు నమస్కారం చేయబోగా పొట్ట భూమికి తగిలింది కానీ, చేతులు మాత్రం భూమిమీద ఆనలేదు. అతి కష్టం మీద చేతులు ఆన్చినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు. ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుడి తల మీద వున్న చంద్రుడు పగలబడి, ఎగతాళిగా నవ్వాడు. 'రాజదృష్టి సోకితే, రాళ్ళు కూడా నుగ్గవుతాయి' అన్న సామెత అనుసరించి వినాయకుడి పొట్ట పగిలి లోపల వున్న కుడుములు మొదలైనవి చుట్టుపక్కల దొర్లాయి. వెంటనే వినాయకుడు మరణించాడు.
పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి "పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందలు పొందుతారు" అని శపించింది.
 
ఋషిపత్నులకు నీలాపనిందలు 
 
అదే సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించి, మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజు రోజుకూ బలహీనంగా మారిపోవనారంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపం తప్ప, మిగిలిన ఋషి పత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది. ఋషులు తమ భార్యల రూపంలో వున్న స్వాహా దేవిని చూసి తమ భార్యలే అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు.
శాపం పలితంగానే ఋషి పత్నులకు ఈ నిలాపనింద కలిగింది. దేవతులు, మునులు, ఋషి పత్నులు
ఈ నీలాపనిందలను గూర్చి పరమేష్టికి తెలిపారు. అతడు సర్వజ్ఞుడు కావటంతో అగ్ని దేవుడి భార్యే ఋషి పత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్ళి ఉమామ హేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు. దాంతో పార్వతీ పరమేశ్వరులు ఎంతో సంతోషించారు.
అప్పుడు దేవతలు, మిగిలినవాళ్ళు "పార్వతీ, నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో వున్న వారికి కీడు జరుగుతోంది. కాబట్టి దానిని ఉపసంహరించు” అని ప్రార్ధించారు. -
వారి ప్రార్ధనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరకు తీసుకుని ముద్దాడి “ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో, ఆ ఒక్క రోజు మాత్రము చంద్రుని చూడకూడదు” అని చెప్పింది.
అప్పుడు బ్రహ్మ, మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. భాద్రపద శుద్ధ చతుర్ధిలో మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకుని సుఖంగా వున్నారు.
ఈ విధంగా కొంతకాలం గడిచింది.
 
శమంతకోపాఖ్యానము
 
ద్వాపరయుగంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి, ప్రార్ధించి మాట్లాడుతూండగా “స్వామీ, సాయం కాలం అయింది. ఈ రోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుడిని చూడకూడదు. నేను నా ఇంటికి వెళ్తాను, అనుమతించండి" అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు.
అప్పుడు శ్రీ కృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుడిని చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు. శ్రీ కృష్ణుడు క్షీర ప్రియుడు కావటంతో ఆ రోజు రాత్రి ఆకాశం వేపు చూడకుండా పశువులశాలకు వెళ్ళి పాలు పితుకుతూ పాలలో చంద్రుడిని ప్రతిబింబం చూసి “ఆహా! నాకు ఎలాంటి ఆపద రానుందో” అని అనుమానించటం ప్రారంభించాడు.
కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యవరంతో శమంతకమణిని సంపాదించి శ్రీ కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చాడు. శ్రీ కృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకు ఇవ్వమని అడిగాడు. అప్పుడు సత్రాజిత్తు “ఇది రోజుకు ఎనిమిది బారువుల బంగారం ఇస్తుంది. దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలివితక్కువవాడు ఇవ్వడు” అన్నాడు. శ్రీ కృష్ణుడు ఊరుకున్నాడు.
ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది. ఆ సింహం ఆ మణిని తీసుకుపోవుచుండగా, ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి, ఆ మణిని తీసుకుని తాను వుండే కొండ బిలానికి వెళ్ళి, తన కుమార్తె జాంబవతికి ఆటవస్తువుగా ఇచ్చింది.
 
మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మృతి వార్త విని “నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీ కృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు” తన పట్టణంలో చాటింపు వేయించాడు.
శ్రీ కృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి, దానిని తొలగించుకొనేందుకు బంధు మిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కళేబరం, సింహపు కాలి జాడలు, భల్లూకం కాలిజాడ కనిపించాయి. వాటిని అనుసరించి పోతూ ఒక పర్వత గుహద్వారంలో పరివారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి, అక్కడ ఉయ్యాలకి కట్టబడి వున్న మణిని తీసుకుని తిరిగి వచ్చుచుండగా, అది చూసి వింతమనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది.
అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి, అరుస్తూ, గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడి పై యుద్ధం ప్రారంభిచాడు. శ్రీ కృష్ణుడు అతనిని కింద పడదోసి భీకర యుద్ధం ప్రారంభించాడు. ఆ విధంగా మొత్తం 28 రోజులు పోట్లాడారు. చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగినవాడు రావణసంహారి అయిన శ్రీరామ చంద్రుడే అని అర్ధం చేసుకుని, నమస్కరించి "దేవాదిదేవా! ఆర్త జన రక్షకా! నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామ చంద్రుడని అర్ధం చేసుకున్నాను. అప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు. నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు. అది
మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను. మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు. నా శరీరం అంతా శిథిలం అయింది. ప్రాణాలు త్వరలో పోనున్నాయి. జీవితేచ్చ నశించింది. నా అపచారములు క్షమించి నన్ను కాపాడు. నీకంటే నాకు వేరే దిక్కు లేదు” అంటూ ప్రార్ధించాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు దయతో జాంబవంతుడి తన చేతితో నిమిరి “జాంబవంతా! శమంతక మణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవటం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు. నేను వెళ్ళిపోతాను” అని చెప్పాడు.
అప్పుడు జాంబవంతుడు శ్రీ కృష్ణునికి మణితో పాటు, తన కుమార్తెను కూడా ఇచ్చాడు. తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో, సైన్యంతో, మణితో, జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు. సత్రాజిత్తును పిలిపించి,
అందరిని పిలిచి జరిగినదంతా వివరించి, మణిని ఇచ్చాడు. అప్పుడు సత్రాజిత్తు “అయ్యో, లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను” అని విచారించాడు. మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి, తన తప్పు క్షమించమని వేడుకున్నాడు.
శ్రీ కృష్ణుడు ఒక శుభ ముహూర్తంలో జాంబవతీ, సత్య భామలను వివాహమాడాడు. అప్పుడు దేవతలు, మునులు శ్రీ కృష్ణుడిని స్తుతించి “మీరు సమర్ధులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు. మాలాటి వారు ఏమి చేయగలరు?” అని ప్రార్థించారు.
అప్పుడు శ్రీ కృష్ణుడు “భాద్రపద శుద్ధ చతుర్ధిలో ప్రమాదవశాత్తూ చంద్రుని దర్శనమైతే, ఆరోజు గణపతిని పూజించి శమంతకమణి కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా వుంటారు” అని చెప్పాడు. దాంతో దేవతలు, మునులు సంతోషించి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధిలో దేవతలు, మహర్షులు, మానవులు మొదలగువారు గణపతిని పూజించి, తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా వున్నారని - శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత, సూత - మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
 
సర్వేజనా స్సుఖినోభవంతు
 
#vinayakachavithi #ganeshchaturthi #2023vinayakachavithipoojavidhanam #ganeshpooja2023
 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore