Online Puja Services

కుజదోషాన్ని , కష్టాలనీ తొలగించే అంగారక సంకష్టహర చతుర్థి !

18.118.200.136

కుజదోషాన్ని , కష్టాలనీ తొలగించే అంగారక సంకష్టహర చతుర్థి ! 
- లక్ష్మీరమణ 

సంకష్టహర చతుర్థికి గణపతిని పూజిస్తే, కష్టాలన్నీ తొలగిపోతాయి . ఆ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే అది మరింత విశేషమైనది . ఆరోజుని అంగారక చతుర్థి అంటారు . ఆ నాడు గణపతిని సేవించుకోవడం , సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారంగా చేసుకోవడం  వలన అనంత శుభ ఫలితాలు కలుగుతాయి . అంగారక చతుర్థి ప్రాధాన్యత ఎటువంటిది? ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఆ విశేషాలు తెలుసుకుందాం . 

సంకష్టహర చతుర్థి సాధారణంగా మన పంచాంగాలలో సమయ నిర్ధారణ చేసి ఉంటాయి .  ప్రతిమాసంలోనూ కృష్ణపక్షంలో అంటే, పౌర్ణమి తర్వాత 3, 4 రోజుల్లో చవితి వస్తుంది.  సూర్యాస్తమయ సమయాన్ని ప్రదోషకాలం అంటారు . ఈ సమయంలో ఎప్పుడు చవితి తిధి ఉంటుందో ఆ రోజుని సంకష్టహర చతుర్థిగా పరిగణించి , ఆ రోజు ఈ వ్రతాన్ని పాటించాలి . రెండురోజుల పాటు వరుసగా ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు .  ఒకవేళ అలా జరిగితే, తదియ ఉన్న చవితిని, సంకటహర చతుర్థిగా లెక్కించవలసి ఉంటుంది .

 ఈ సంకష్టహర చతుర్థి గనుక మంగళవారం వస్తే, అది మరింత విశేషం . ఈ రోజుని అంగారక చతుర్థి అంటారు .  ఈ రోజు గనుక, గణపతిని పూజిస్తే, జీవితంలో ఉన్న సంకటాలు తొలగిపోవడమే కాదు , జాతకంలో ఉన్న కుజదోషాలు కూడా పరిహారం అవుతాయని శాస్త్రం .  కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థిని గణాధిప సంకష్టహర చవితి అని పిలుస్తారు . 

మంగళవారం వచ్చిన సంకటహర చతుర్థి వెయ్యి సూర్య గ్రహణాల పుణ్య కాలానికి సమానం . ఈ అంగారక చతుర్థి కృష్ణపక్షంలో వస్తే, మరింత విశేషం. ఆ ప్రభావాన్ని వర్ణించడం వెయ్యి తలలున్న ఆదిశేషుడికి కూడా తరం కాదని శృతి వాక్యం . మాఘమాసం ,భాద్రపద మాసం , కార్తీకమాసాల్లో వచ్చే ఈ రకమైన అంగారక చతుర్థి విశేషమైన ఫలితాన్ని అందిస్తుంది . అంగారక చతుర్థి నాడు ఉపవాసం ఉండి, గణపతిని పూజిస్తే,  కుజుడు ప్రసన్నుడవుతాడు . కుజుడు గణపతి కోసం చేసిన వెయ్యి సంవత్సరాల తపః ఫలితం ఈ రోజు గణపతిని పూజించినవారికి కుజుడు అనుగ్రహిస్తారట.  అంత విశేషమైనది ఈ అంగారక చతుర్థి.  

సాధారణంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించదలచినవారు, 3, 5, 11, లేదా 21 నెలలు ఆచరించవలసి ఉంటుంది . ఈ సంఖ్యలల్లో మీ ఓపికని బట్టి, అనుకూల్యతనిబట్టి ఎంచుకొని చక్కగా సంకటహర చతుర్థి వ్రతాన్ని నియమంగా ఆచరిస్తే, ఖచ్చితమైన ఫలితాలని ఆ గణపతి అనుగ్రహంతో పొందే అవకాశం ఉంటుంది. ఈ వ్రతాన్ని ఏదేని సంకట చతుర్థినాడు మొదలు పెట్టాలి . విధివిధానాలు ఎలా ఉంటాయో చూద్దాం . 

చక్కగా తలంటి స్నానం చేయాలి . ఎరుపు/ తెలుపు రంగులో ఉన్న జాకెట్ బట్టని గానీ ఒక తుండును గానీ తీసుకొని పసుపు పెట్టి, చిటికెడు కుంకుమ వేసి , దాంట్లో మూడు దోసిళ్ళ బియ్యాన్ని లేదా ఒకటింపావు కిలోల  బియ్యాన్ని పోయాలి .  ఆ తర్వాత , రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు , తమలపాకులూ  ఉంచి ఆ తాంబూలాన్ని దక్షిణ సహితంగా ఆ బట్టలో ఉంచి మూటగా కట్టి, గణపతి ముందర ఉంచి, మీ మనసులో ఏ  కార్య సిద్ధికోసం ఈ పూజని సంకల్పించారో ఆ కార్యాన్ని గణపతికి విన్నవించండి . ఇప్పుడు యథాశక్తి గణపతిని పూజించండి. టెంకాయ , పళ్ళు స్వామికి నివేదించండి. 

పూజ ముగించాక, గణపతి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ, 3, 11 లేదా 21 ప్రదక్షిణాలు చేయండి . ఏ పూజకైనా మనసే కదా ప్రధానం ! టెంకాయలు , పూలూ, పళ్ళు ఇత్యాదుల లెక్కల కన్నా, మన చిత్తం స్థిరంగా ఆ గణపతిమీద నిలవడం ముఖ్యం. ఆ విధంగా పూజని ముగించి రోజంతా ఉపవాసం ఉండాలి . 

ఉడికించిన పదార్థాలని గానీ, ఉప్పు తగిలించిన పదార్థాలని సూర్యాస్తమయం వరకూ తినకూడదు . పాలూ, పళ్ళు, పచ్చి కూరగాయలూ ఆహారంగా స్వీకరించవచ్చు.  ఇదొక్కటే నియమం . సూర్యాస్తమయం తర్వాత, తిరిగి స్నానం చేసి , గణపతికి దీపారాధన చేసి, యధోశక్తి పూజించి,  ఆ తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని మామూలుగా భోజనం చేయవచ్చు .  ఈ విధంగానే ముందుగా మీరు మీ కార్యసిద్ధి కోసం ఎన్ని వారలైతే వ్రతాన్ని ఆచరిస్తామని అనుకున్నారో , అన్ని వారాలూ వ్రతాన్ని చేయాలి . 

ఇలా పూర్తిగా అన్నివారాల దీక్షా పూర్తయ్యాక, ముందుగా ముడుపుకట్టి గణపతి దగ్గర ఉంచిన బియ్యంతో పొంగలి చేసి , స్వామికి నివేదన చేసి , సాయంత్రం భుజించాలి . ఈ మొత్తం వ్రతాన్ని విధివిధాయకంగా ఆచరించడం మంచిది . 

అలా చేయలేము అనుకునే వారు , ఉపవాసదీక్షని పాటించి , సంకటనాశన గణేశా స్తోత్రాన్ని చదివి , దగ్గరలోని గణేశ ఆలయాన్ని దర్శించినా సరిపోతుంది . ఉపవాసం కూడా ఉండలేని వారు పిల్లలు , వృద్ధులు, అనారోగ్యవంతులు అయితే చక్కగా నాలుగు సార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం ఉత్తమం .   

ఈ వ్రతాన్ని అంగారక చతుర్థినాడు తప్పక పాటించాలి . దీనివల్ల కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది . వివాహాలలో ఆటంకాలు, ఆలస్యం అయ్యేవారు, ప్రతి కార్యంలో విఘాలతో ఇబ్బందులు పడేవారు , జీవితంలో కష్టాలకి ఇక అంతేలేదా అని బాధపడేవారు ఈ రోజు నమ్మకంతో గణపతిని ఆరాధించండి .   

ఓం గణాధిపాయ నమః ! శుభం భవతు !!

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore