Online Puja Services

గణపతిమూర్తిని మట్టితో చేసి పూజించడం వెనుక....

3.144.33.41

గణపతిమూర్తిని  మట్టితో చేసి  పూజించడం వెనుక పంచీకరణం ఉంది.

భాద్రపద శుక్ల చతుర్థీ అనగానే అందరికీ వినాయక చవితి గుర్తుకు వస్తుంది. వినాయకచవితి పూజ నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను చెప్పారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. గణపతిని మట్టితో పూజించడం వెనుక పంచీకరణం ఉంది. పంచీకరణం అంటే , పంచభూతాల సమన్వయం . అదే చైతన్యం . 

ఆకాశం నుండి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి. నీటి నుంచి భూమి ఏర్పడింది. జడపదార్ధమైన భూమి చైతన్యం కలిగిన నీళ్ళతో చేరినప్పుడు ప్రాణశక్తి కలిగి – ఆహారపదార్ధాలనూ, ఓషధులని మనకు అందిస్తుంది. నీరు ప్రాణాధారశక్తి. జడశక్తులు కలయికతో ఈ సృష్టి ఏర్పడిందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తాం. అప్పుడది పూజార్హం అవుతుంది.

మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి అంటుంది యోగశాస్త్రం. 6 చక్రాల్లో మొదటిది మూలాధారచక్రం, వెన్నుపూస చివరిభాగాన ఉంటుంది. నాలుగు రేకులు పద్మంవలే, ఎరుపు రంగు కాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం మూలాధార చక్రానికి గణపతి అధిష్ఠానదేవత.
మూలాధారం – పృధ్వీ తత్వం, అంటే భూమికి సంకేతం. కనుక వినాయకుడ్ని మట్టితోనే చేయాలి.  పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉ దాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే ‘పంచీకరణం’ అంటారు. ఒక్కో తత్వానికి ఒక్కో అధిష్ఠానదేవత ఉంటారు.

భూతత్వానికి అధిష్ఠానదేవత గణపతి, ఆకాశతత్వానికి ఈశ్వరుడు (శివుడు), జలతత్వానికి నారాయణుడు, అగ్నితత్వానికి అంబిక, వాయుతత్వానికి ప్రజాపతి (బ్రహ్మ). మనం పూజించే విగ్రహంలో గణపతి తత్వం 1/2 భాగం ఉండగా, మిగిలిన ఈ దేవతల తత్వం 1/8 భాగంగా ఉంటుంది.

పరమాత్ముడు ఒక్కడే, ఎన్నో విధాల కనిపించినా, అన్నీ ఒక్కడినే చేరుతాయి. వినాయక విగ్రహ నిర్మాణంలో 1/2 భూతత్వం, తక్కినవి 1/8 ప్రకారం ఉంటాయి. మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచ మహాభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్ధాల చేత చేయబడిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలుగదు.

పంచభూతాలతో ఆధునిక మానవుడు సంబంధం తెంచుకున్న కారణం చేతనే అనేక సమస్యలకు, ఒత్తిళ్ళకు, రోగాలకు బాధితుడవుతున్నాడు. ఏ తత్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, చివరికది ఆ తత్వాలలోనే లయం అవుతుంది. అదే సృష్టి ధర్మం. కనుక వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి. ఓషధిగుణాలు కల్గిన 21 రకాల పూజపత్రాలు, విగ్రహంతో పాటూ నీళ్ళలో కలపడం వలన ఆ నీళ్ళలో కాలుష్యం హరించబడుతుంది. రోగకారక క్రిములు నశిస్తాయి. కనుక వినాయకుడిని మట్టితో చేసి పూజించడమే సర్వశుభప్రదం, మంగళప్రదం.

- లక్ష్మి రమణ 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya