Online Puja Services

గణేశుని ఈ వాహనాలగురించి ఎప్పుడైనా విన్నారా ?

3.15.190.144

గణేశుని ఈ వాహనాలగురించి ఎప్పుడైనా విన్నారా ?

గణేశుని పూజించకుండా భారతదేశంలో ఏ శుభకార్యమూ మొదలవదంటే అతిశయోక్తి కాదు .  గణాధిపతిని ఆటంకాలను తొలగించేవాడిగా (విఘ్నేశ్వరుడు), కళలకు, శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు. భారతదేశంలో పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన గణపతిని గురించిన కథ తెలియనివారుండరు. హిందూ ధర్మగ్రంధాలలో గణేశ పురాణం, ముద్గల పురాణం, గణపతి అధర్వశీర్షం, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం, తదితరాలు గణాధిపతి వైశిష్యతను వివరిస్తాయి. 

 సాధారణంగా గణపతిని మూషిక వాహనారూడునిగానే చూస్తుంటాం . మూషికాసురుడనే రాక్షసుని గర్వమనిచి , తన వాహనంగా చేసుకున్నా గణేశుని కథని వినాయక చవితినాడు  గుర్తుచేసుకుంటాం కదా ! అయితే ఈ ఎలుక వాహన సంకేతాన్ని అనేకవిధాలుగా వివరిస్తారు విజ్ఞులు . గజాననుడు జ్ఞాన స్వరూపమైతే , ఎలుక తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణిచి వేయడానికి చిహ్నంగా ఆయన మూషికవాహనం పై స్వారీ చేస్తున్నట్టు చెబుతారు. ఇక  పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని (సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది. గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం ప్రకారం వినాయకుని ధ్వజంమీద ఎలుక ఉంటుంది. గణపతి సహస్రనామాలలో "మూషిక వాహన", "అఖుకేతన" అనే పేర్లున్నాయి.


కానీ మన శ్రుతులు వినాయకునికి ఇతర వాహనాలు కూడా వివరించాయి. ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతార విశేషాలు  చెప్పబడినాయి. వారే వక్రతుండ, ఏకదంత, మహోదర, గజవక్త్ర, లంబోదర, వికట, విఘ్నరాజ, ధూమ్రవర్ణ వినాయకులు. వీరిలో  ముగ్గురు ముషికేరవాహనాలను కలిగిఉన్నట్టు ఈ మహాకావ్యం చెబుతుంది . వక్రతుండుని  వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ అవతారం వాహనం శేషువు. 

కాగా  గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి. అందులో మహోటక అవతారంలో సింహవాహనం , మయూరేశ్వర అవతారంలో నెమలివాహనం, ధూమ్రకేతు అవతారంలో  గుర్రం, గజాననుని అవతారంలో ఎలుక గణేశుని వాహనాలుగా చెప్పబడ్డాయి. 

జైన సంప్రదాయాలలో కూడా గణేశారాధన ఉంటుంది.  వీరి సంప్రదాయంలో  గణేశునికి ఎలుక, ఏనుగు, తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి.

-లక్ష్మీ రమణ 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore