Online Puja Services

సంసార దుఃఖాల నుండీ కాపాడే వ్యాఘ్ర నారసింహుడు.

3.144.77.71

సంసార దుఃఖాల నుండీ కాపాడే వ్యాఘ్ర నారసింహుడు. 
- లక్ష్మీరమణ 
 
కొండలమీద నివాసముండడం హరిహరులకి వేడుకైతే, ఆ స్వామి నివాసానికి తామే కొండగా మారడం వారి భక్తులకి అలవాటు. అదే అలవాటుని ఆకిరిపల్లి లోనూ కొనసాగించారు శివకేశవులు . శివుడేమో కొండపైన మల్లేశ్వరుడయ్యారు.  కేశవుడేమో కొండకింద నారసింహుడయ్యారు. పురాణ ప్రాసస్త్యం, స్థలమహత్యం కలగలిసిన స్వయం వ్యక్త మూర్తులు ఇక్కడి హరిహరులు . మనసుతో ప్రార్థిస్తే, విద్యని అనుగ్రహిస్తారు . ఆర్తితో ఆరాధిస్తే, పిలిచినంతనే పలికే దైవాలై ఆదుకుంటారు . ఆంధ్రప్రదేశ్లోని పామర్రుకు దగ్గరలోని ఈ ఆకిరిపల్లి దివ్య క్షేత్రాన్ని అక్షర స్వరూపంగా దర్శిద్దాం .  

ఆకిరిపల్లి ఆపదల్లో ఉన్నవారికి కల్పతరువు.  ఆపదలు సంభవించినప్పుడు , కస్టాలు చుట్టుముట్టినప్పుడు ఇక్కడి ప్రజలు నమ్ముకునేది ఇక్కడి నారసింహుడినే ! “ స్వామీ మమ్మల్ని ఈ సంకటం నుండీ గట్టెక్కించు . మేము నీ జాతరకు వచ్చి, నీ రథం లాగుతామని మొక్కుకుంటారు . దాంతో వాటి కష్టాలని స్వయంగా ఆ నారసింహుడే పలు రూపాలలో వ్యక్తమై పరిష్కరించారని, పరిష్కరిస్తారని ఇక్కడి ప్రజల బలమైన విశ్వాసం . 

వరాహతీర్థం : 

క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం నుండే ఇక్కడ వరాహ తీర్థం ఉన్నట్టు ఆధారాలున్నాయి . ఆకిరిపల్లికి ఆ పేరు రావడం వెనుక కూడా స్వామి వరాహమూర్తి గా చూపిన లీల దాగుంది .  కిరి అంటే వరాహమూ అనిఅర్థము . ఆయన స్వయంగా కిరిగా మారి త్రవ్విన వరాహతీర్థం ఇక్కడే ఉంది.  ఆ వరాహమూర్తి ఉన్న పల్లె అనే అర్థంలో ఈ ప్రాంతానికి ఆకిరిపల్లె అని పేరొచ్చింది. 

పురాణ ప్రశస్తి: 

శ్రీ బ్రహ్మాండ పురాణంలో శ్రీ శోభనాచల క్షేత్ర మహత్యాన్ని ,వివరించారు . కృతయుగంలో కళ్యాణాద్రి అని త్రేతా యుగంలో శోభనాచలమని, ద్వాపర యుగంలో స్వప్నశైలమని  ప్రసిద్ధి చెందిన కొండ ఈ కలియుగంలో శోభనాద్రిగా పేరొందింది. పూర్వం ఒకప్పుడు  హరిహరులు ఇద్దరు విహారర్థం బయలుదేరారు.  శోభాయ మానమైన శోభనగిరి ప్రాంతము వారికి ఉల్లాసాన్ని కలిగించగా, ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు.  గిరిపైన హరుడు కొండ మల్లేశ్వరునిగా నిలిస్తే, పర్వత పాద ప్రాంతాలలో శ్రీహరి శ్రీ లక్ష్మీ వ్యాఘ్ర నరసింహనిగా వెలసి పూజలు అందుకుంటున్నారు.  

స్థల పురాణం : 

పూర్వకాలంలో శుభవ్రతుడనే చంద్రవంశపు రాజు సౌరాష్ట్ర దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు.  అతను విష్ణు భక్తుడు.  సనత్కుమార మహర్షి ఆ రాజుకి  నృసింహ మంత్రాన్ని ఉపదేశం చేశారు .  నిశ్చల భక్తితో తపస్సు చేసి ఆయన నారసింహుని ప్రసన్నుడిగా చేసుకున్నారు . తాను  హరితములతో నిండిన కొండగా మారతానని , హరునితో కూడా కలిసి ఆ కొండపైన వెలసి ఆపదల నుండీ, సంసార దుఃఖాల నుండీ  ప్రజలని రక్షించాలని ఆ స్వామిని కోరుకున్నారట శుభవ్రతుడు .  అప్పటినుండి  భక్త పరాధీనులైన ఆ శివకేశవులు ఇక్కడ అర్చనలు అందుకుంటున్నారు.  భక్తుల అభీష్టాలని అనుగ్రహిస్తున్నారు .

స్వామి మహిమ : 

శ్రీ శోభనాచలేశ్వరుని ఆజ్ఞానుసారం గోపయ్యాచార్యులు అనే బ్రాహ్మడు  స్వామివారికి అర్చనాదులు జరుపుతూ ఉండేవారు. ఆయనకి వార్ధక్యం మీదపడడంతో అసక్తుడై, తన  కుమారుడైన సొబ్బయ్య చార్యులకి స్వామి కార్యాన్ని పురమాయించాడు. అతను చాలా అమాయకుడు . కాస్త బుద్ధిమాంద్యం  కూడా ఉండేది .  దాంతో చదువూ పెద్దగా వంటపట్టలేదు. తండ్రి ఆజ్ఞ మేరకు సోబ్బయ్య  నరసింహ ఆరాధనకు వెళ్లారు. నివేదన పెట్టి, స్వీకరించమని ప్రార్థించారు.  స్వామిలో చలనం లేదు.  చివరకు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు.  కరుణాసముద్రుడైన నరహరి ఆ భక్తుని కల్మషం లేని భక్తికి కరిగిపోయారు.  స్వయంగా వచ్చి  నివేదన స్వీకరించారు.  భక్తుని అనుగ్రహించి పాదాలపై బీజాక్షరాలను లిఖించి విద్యను ప్రసాదించారు. అనంతర కాలంలో ఆయన శోభనాచల శతకాన్ని రచించారు. 

నైజాం నవాబుకు దర్శనం : 

సోబ్బయ్యాచార్యులు ఆ తర్వాత స్వామిని గొప్ప సేవా నిరతితో అర్చిస్తూ ఉన్నారు .  ఆయన ఆలయ నిర్వహణకు శాశ్వత సంపదను ఏర్పాటు చేయాలని తలిచారు.  అప్పటి  నైజాం ప్రభువు వద్దకు వెళ్లి అభ్యర్థించారు.  నవాబు “ఏడయ్యా నీ స్వామి? స్వామిని నాకు చూపించు.  లేదా, నీ తల ఏనుగులతో తొక్కిస్తా”నన్నాడు. సొబ్బయ్యాచార్యులవారు నరహరిమీద ఉన్న అచంచల విశ్వాసంతో సరే అన్నారు .  శ్రీ శోభనాచలేశ్వరుని నివేదన కోసం చక్కెర కలిపిన వెన్న తెప్పించారు . స్వామిని స్వీకరించాల్సిందిగా ఆర్తిగా అభ్యర్ధించారు. భక్తవత్సలుడైన నరహరి ఆ ప్రార్థన విని పులి (వ్యాఘ్రం)  రూపంలో వచ్చారు. వెన్నని చక్కగా ఆరగించడం ఆ నవాబు స్వయంగా చూశాడు. సొబ్బయ్య చార్యుని భక్తి తత్పరతకు మెచ్చి, ఒక అగ్రహారాన్ని ఇవ్వమని ఆజ్ఞాపించాడు. క్రీస్తుశకం 1628లో నవాబు ఆజ్ఞానుసారం జూపూడి నారాయణరావు అనే మజ్ను గారు సర్వమాణ్యంగా అగ్రహారాన్ని స్వామి సేవకు అర్పించాడు. 

తిరునాళ్ళు : 

నూజివీడు జమీందారులు శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు గారు స్వామివారి తిరునాళ్లు నవరాత్రి ఉత్సవాలకు విశేష దానాలు చేశారు . శ్రీ శోభనాచలేశ్వరునికి వరాహ పుష్కరిణిలో తెప్పోత్సవము గొప్ప తిరునాళ్లుగా జరిగేది మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవము రథసప్తమి నాడు రథోత్సవము ఇప్పటికీ అత్యంత వైభవంగా జరుగుతాయి.  
 

శోభనాద్రి నివాసాయ 
శోభితార్థ ప్రదాయినే 
రాజ్యలక్ష్మీ సమేతాయా 
నారసింహాయ మంగళం! 

శుభం . 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi