మీసాలు, నామాలున్న చేపలే దేవుడు

100.24.115.215

ఆ మునుల కొండమీద మీసాలు, నామాలున్న చేపలే దేవుడు !
లక్ష్మీ రమణ 

చేపలకూర కోరి వండినానోయి మామ అని ఈ చేపలు పట్టి వండారో , ఇక అంతే సంగతులు . ఆ విధంగా ప్రయత్నించినవారు సరాసరి పరలోకానికి టిక్కెట్టు తీసుకున్నారట ! మునులందరూ తపస్సు చేసిన  ఈ కొండమీద మాత్రమే ఇలాంటి తిరునామాలు ధరించిన చేపలు కనిపిస్తుంటాయి .  భగవంతుని లీలా విలాసాలకీ , ఆయన చూపించే మహిమలూ భారత భూమిపైన చాలా ప్రాంతాలు వేదికలుగా ఉన్న, ఈ క్షేత్రం వాటికి తలమానికమైనదంటే , అతిశయోక్తి కాదుమరి . 
    
వేములకొండంటే వేయిమునుల కొండ అని అర్థం. ఒకప్పుడు జైనమునులు ఇక్కడ నివసించేవారు. ఆ తర్వాత , కాలక్రమంలో ఈ ప్రాంతానికి వేములకొండ అని పేరు వచ్చింది. ఈ గుట్టపైన ఉన్న నీటి గుండంలో ఉండే చేపల రకం పేరు మార్పుడుగాళ్ళు. వాటిని పట్టుకొని తినే ప్రయత్నం చేసేవాళ్ళంతా చచ్చిపోతారనే కథ ప్రచారంలో ఉంది.

ఈ మార్పుడుగాళ్ళు అని పిలిచే పుష్కరిణిలోని చేపలు మూడు (విష్ణు) నామాలు, మీసాలతో కనిపిస్తాయి. ఇలా నామాలు, మీసాలు కనిపించడంతో భక్తులు వీటిని భగవంతుడి అవతారంగా భావిస్తారు. లక్ష్మీనర్సింహస్వామి స్వయంగా మత్స్య అవతారంలో వెలిసాడని భక్తులు విశ్వాసం. చేపలకు పులిహోర, దద్దోజనం లాంటి ప్రసాదాలతోపాటు బిస్కెట్లు కూడా ఉదయం ఆరు గంటలకే సమర్పిస్తారు.

గతంలో సరస్సును శుద్ధిచేయడంలో భాగంలో పాత నీటిని తీసివేసి, కొత్త నీటితో సరస్సును నింపారట. కొత్తనీరు చేర్చిన తర్వాత ఓ ట్రక్ లోడ్ సరిపోయే చేపలు సరస్సులో మరణించడం భక్తుల విశ్వాసంపై తీవ్రంగా ప్రభావం చూపిందని అక్కడివారు చెబుతారు. అయితే సరస్సులోని చేపగుడ్లు మళ్లీ ఫలదీకరణం చెందడంతో మళ్లీ విష్ణు నామాలున్న చేపలు భారీ సంఖ్యలో జన్మించాయని స్థానికులు వెల్లడించారు. మండు వేసవి కాలంలో కూడా ఈ సరస్సులో నీళ్లు నిండుగా ఉంటాయి. ఈ సరస్సులో చేపల్ని పట్టడానికి ఎవర్ని అనుమతించరు. గతంలో ఈ సరస్సులో చేపలు పట్టిన స్థానికుడు రక్తం కక్కుకుని మరణించాడని అక్కడి వాళ్లు చెబుతారు. ఆ ప్రాంతపు చుట్టు పక్కల వారు రెగ్యులర్ గా ఆలయాన్ని సందర్శించుకోవడంతోపాటు చేపలకు బిస్కెట్ ప్రసాదాన్ని సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తులోవున్న కొండపై లక్ష్మీనర్సింహ స్వామి మత్స్య అవతారంలో వెలిసాడు. కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుండం ఎప్పుడూ నీళ్లతో కళకళలాడుతుంటుంది. ఒకప్పుడు ఈ గుట్టపై గుడి ఉండేదికాదు. తరువాతికాలంలో ఈ గుడి, మిగిలిన నిర్మాణాలు జరిగాయి తెలుస్తుంది. పూర్వం కొండ కిందనుండి మెట్లదారి ఉండేది. ద్వార బంధానికి మత్స్యం చెక్కిఉంటుంది . మెట్లదారికి కుడివైపున కొండరాతికే చెక్కిన గణపతి, ఆంజనేయ శిల్పాలుంటాయి . ఈ  శిల్పరీతిని బట్టి రాష్ట్రకూటుల కాలానికి చెందినవిగా చెబుతున్నారు. గుడికి రాతి ప్రహరి నిర్మించిన ఆనవాళ్ళున్నాయి. 

ఇక్కడ పలుచని నలుపు, ఎరుపు, బూడిద రంగు కుండపెంకులు ఇబ్బడి ముబ్బడిగా లభించడంతో ఈ గుట్ట ప్రాచీన కాలం నుండి మానవునికి ఆవాసంగా ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు.

మత్స్యగిరి లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వేములకొండ గ్రామం సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము ఇది . వేములకొండ గుట్టకు రెండు వైపుల ఘాట్‌ రోడ్డు ఉంది.  భువనగిరి రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది . అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలి .  బస్సులు భువనగిరి , హైదరాబాదుల నుండీ అందుబాటులో ఉంటాయి . 

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna