Online Puja Services

స్వామి మద్దిలేరు నారసింహుడు

3.139.82.23

అమ్మ కడుపుతీపి ఎరిగిన స్వామి మద్దిలేరు నారసింహుడు !
-లక్ష్మీ రమణ . 

‘అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలూ’ అని లక్ష్మీ దేవి అనుకున్నట్టే ఉన్నారు . సింహ స్వరూపం ధరించిన ఉగ్రనారసింహుడు అలిగి , చిన్నారి గోపాలుడిలా మారి , ఉడుక్కుంటే చూడబుద్దేసినట్టుంది అమ్మవారికి . అందుకే,  శ్రీ కదిరి  నరసింహస్వామి వారిని పాచికలు ఆడమని ఆహ్వాఆనించింది. ఆడేది ఆదిశక్తి , ఆడుతున్నవాడు ఆ జగచ్ఛలకుడు. అయినా ఇద్దరే ఆడేప్పుడు గెలుపోటములు సహజమేగా ! స్వామి ఓడిపోయారు .  అమ్మ సరదాగా శ్రీవారిని గేలిచేసింది. అంతే , ఉడుక్కుని స్వతంత్రంగా ఉండాలని కదిరిని వదిలి , స్థలాన్వేషణలో పడ్డారట నారసింహులవారు . 

అలా వచ్చేసిన స్వామీ ఎర్రమల, నల్లమల కొండలలో సరైన స్థలం కోసం అన్వేషణ సాగించారు. కేశవునికి శివుడు , శివునికి కేశవుడేగా అండాదండా ! అలా శ్రీవారు యాగంటి వద్ద శ్రీ ఉమా మహేశ్వర స్వామిని కలుసుకుని నివాస స్థలము కోసం సలహా కోరారు. దాంతో  ఉమా మహేశ్వర స్వామి వారు  మద్దిలేరు  కాలువ పక్కన వున్న లోయలో ఇప్పుడున్న ఆలయ ప్రదేశాన్ని చూపించారు . స్థలం దొరకగానే , శిలారూపమై నిలిస్తే, భక్తజనోద్ధరణ ఎలా ? దానికీ ఓ లెక్కుంది మరి . జగన్నాటకసూత్రధారి మద్దిలేరు దగ్గర కొలువయ్యేందుకు కన్నప్ప దొర ద్వారా కథ నడిపించారు . 

మద్దిలేరు కాలువ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘మొక్షపట్టణం’ రాజ్యాన్ని కన్నప్ప దొరవారు ఏలుతున్న కాలమది . కన్నప్ప దొర ప్రతి శనివారం అడవికి వెళ్ళేవారు. అలా అడవిలో వెళుతున్నప్పుడు అతనికి ఒక ఉడుము  ప్రకాశిస్తూ కనిపించింది . అప్పుడు కన్నప్ప దొర ఆ ఉడుముని  పట్టుకోవాలని తన సైనికులను ఆదేశించారు. ఆ సైనికులు అనేక మార్గాలో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు . చివరికి ఆ ఉడుము  కోమలి అని పిలవబడే పుట్టలోకి దూరిపోయింది . అప్పుడు ఆ సైనికులు పుట్టను తవ్వి చూస్తారు . కానీ ఉడుము మాత్రం కనబడలేదు . కన్నప్ప దొర నిరాశతో తిరిగి తన రాజ్యానికి చేరుకున్నారు . అదే రోజు రాత్రి నరసింహస్వామి  వారు  రాజుకి  కలలో కనిపించి, ప్రొద్దున నీకు ఉడుములా కనిపించి పుట్టలోకి ప్రవేశించింది నేనే అని తెలియజేస్తారు . ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు వేద పండితులతో పుట్ట వద్దకు చేరుకొని స్వామి వారికి పూజలు చేశారు .

రాజు వారి  పూజలతో సంతోషించిన స్వామి వారు 10 సంవత్సరాల బాలుడి రూపంలో  పుట్ట నుండి బయటకు వచ్చారు .ఆ చిన్నారి స్వామిని ఎత్తుకొని మద్దిలేరు కాలువ దగ్గరకు తీసికొనివచ్చి కూర్చోబెట్టి పూజలు చేశారట ఆ రాజు . ఆ  తరువాత స్వామి వారు శిల రూపంలోకి మారిపోయారు . అలా మద్దిలేరు  కాలువ పక్కనే నరసింహ స్వామి ప్రత్యక్షంగా కనబడినందున ఈ స్థలం మద్దిలేటి నరసింహ స్వామి ఆలయం అని పేరొందింది .

ఇంట నాటకాన్నిసూత్రధారిగా నడిపించి , అమ్మవారిమీద అలక నటించి వచ్చేసిన శ్రీవారు అమ్మని వదిలి ఉన్నారనుకున్నారా ? మద్దిలేరులోనూ లక్ష్మీ సమేత నారసింహునిగానే దర్శనమిస్తుంటారు . అయినా స్వామికి వల్మీకములంటే చాలా మక్కువలే ! ఆ రోజు వైకుంఠం వదిలి అమ్మ వెళ్లిపోయిందని, పుట్టలో నుండీ వెంకటేశుడై బయటికి వచ్చారు . ఆ తర్వాత ఇదిగో ఇలా మద్దిలేరు దగ్గర పుట్టనుండీ స్వయంగా చిన్నారి బాలుడై బయటికి వచ్చారు . లీలామానుష రూపుని విన్యాసాలు అనంతాలేకదా ! 

చుట్టూ పరుచుకున్న పచ్చని చెట్లు , అందమైన మద్దలేరు గలగలలు నడుమ లోయలో కొలువైన నారసింహుని ఆలయం చాలా బాగుంటుంది . ఆధ్యాత్మిక సాధకులకు చక్కని చోటని చెప్పాలి . ఈ స్వామీ సంతాన ప్రదాత. తల్లి గర్భం వంటి వాల్మీకము నుండీ ఉద్భవించారు కదా ! అందుకే అమ్మ కడుపుతీపి ఎరిగిన స్వామి . సంతానం లేనివారు మద్దిలేరు స్వామిని దర్శించి, వేడుకుంటే, తప్పకుండా స్వామి అనుగ్రహంతో సంతానవతులవుతారని స్థానిక విశ్వాసం . ప్రతి శుక్రవారం సంతానార్థం వచ్చేవారి కోసం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . 

ఎలా చేరుకోవాలి :

కర్నూలుకు 65 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. బేతంచెర్ల, డోన్‌ నుంచి ఆర్‌ఎస్‌ రంగాపురం వరకు బస్సు, రైలు సౌకర్యం ఉంది. నంద్యాల, డోన్‌ రైలు మార్గంలో రంగాపురం స్టేషన్‌లో దిగి ఆలయానికి చేరుకోవచ్చు.

 బనగానపల్లె మండలం క్రిష్ణగిరి మెట్ట నుండి కాలినడకన లేదా బేతంచెర్ల మండలం RS రంగాపురం నుండి రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore