యోగానంద లక్ష్మీ నారసింహుడు

44.192.25.113

32 ప్రదక్షణలు చేస్తే చాలు ముగ్దుడై కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు.- యోగానంద లక్ష్మీ నారసింహుడు 
 - కంచర్ల లక్ష్మీ రమణ

 భారత దేశంలో  దైవం స్వయంగా నడయాడిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. శిలా రూపం గా స్వయం వ్యక్తమై , నిత్య సేవలు చేసి తరించమని దైవం ఆదేశించిన దివ్య క్షేత్రాలూ ఉన్నాయి. భవసాగరంలో సాగే  జీవననౌకకు దిశానిర్దేశనం చేసే వెలుగుల చుక్కానులు ఈ దైవ క్షేత్రాలు. అటువంటి వాటిలో పంచ నారసింహ క్షేత్రాలు సుప్రసిద్ధమైనవి. ఈ క్షేత్రాలలో ఒకటైన మట్టపల్లి క్షేత్రాన్ని ఈ రోజు  సందర్శిద్దాం.

మహాబలేశ్వరం నుండి పరుగులు పెడుతూ ఆంధ్రావనిని పావనం చేస్తోంది కృష్ణవేణి. ఈ కృష్ణ వేణీ తీరానే ఉన్నది పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటైన మట్టపల్లి. కృష్ణ వేణమ్మ చేసుకొన్నపుణ్యం ఏమిటో కానీ, పంచ నారసింహ క్షేత్రాలు ఈ  నది ఒడ్డునే అవతరించాయి. పంచ నారసింహ క్షేత్రాలలో మట్టపల్లి కేంద్ర స్థానం లో ఉందని అంటారు.

‘ఏకమేవ క్షేత్రం మట్టపల్లి క్షేత్రం, న అన్యత్ క్షేత్రం మట్టపల్లి తుల్యం’. అని ఆర్యోక్తి. మట్టపల్లి కి సమానమైన క్షేత్రం మరొకటి ఈ భువిలో లేదని దీని భావం. నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ కు సుమారు 31 k m ల దూరంలో ఉన్నది మట్టపల్లి క్షేత్రం. హైదరాబాద్ నుండి నల్గొండ మీదుగా, విజయవాడ నుండి కోదాడ మీదుగా మట్టపల్లికి చేరుకోవచ్చు. లక్ష్మీ నరసింహుని దివ్య చరణ సన్నిధి లో ప్రకృతి రమణీయతతో వెలుగొందు తుంటుంది ఈ క్షేత్రం.
 
మట్టపల్లి క్షేత్రానికి ఆహ్వానం పలుకుతున్న తోరణ ద్వారంపై కొలువైన నరసింహ స్వామి వజ్ర నఖాలతో దర్శన మిస్తాడు. తనను ఆశ్రయించిన భక్తుల కష్టాలను హిరణ్య కశ్యపుని చీల్చినట్లు చీల్చి వేస్తానని అభయమిస్తాడు.  ఈ క్షేత్రంలో స్వామి  శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి. అమ్మవారు శ్రీ రాజ్య లక్ష్మీ తాయారు. వీరితోపాటు ఈ క్షేత్రంలో చెంచులక్ష్మీదేవి కూడా కొలువయ్యింది. ఈ స్వాగత ద్వారం నుండి సాగితే మనం కృష్ణా తీరం చేరుకోవచ్చు.

సప్త గంగలలో ఒకటి కృష్ణా నది. మట్టపల్లిలో స్వామి  సన్నిధికి సమీపం లో ప్రవహిస్తూ .... భక్తులను పునీతులను చేస్తోంది. ఇక్కడ ప్రహ్లాద, మార్కండేయ, బాలాజీ అనే పేర్ల తో స్నాన ఘట్టాలు ఉన్నాయి. వీటిలో స్నాన మాచరించి, కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పిస్తారు భక్తులు. తలనీలాలు అర్పించడమంటే...స్వామిని సర్వస్య శరణా గతి వేడడమే. 
 
నిర్మలమైన మనసుతో భక్తులు స్వామి దర్శనోత్సాహులై ఆలయం దిశగా సాగుతారు. దేవాలయ సమీపం లోనే పూజా సామాగ్రిని విక్రయించే దుకాణాలు ఉన్నాయి. వీటిలో పూజా సామాగ్రితో పాటు స్వామివారి చిత్రపటాలు చిరునవ్వుతో స్వాగతం పలుకుతాయి.

మట్టపల్లి వాసుని ప్రాంగణం చేరిన ప్రతి సుమం స్వామి పాదాలు చేరేందుకు తపిస్తుంటుంది. స్వామి దర్శనాకాంక్షతో భక్త మానస సరసిజాలు చాతకాలై పరుగిడతాయి. మధురానంద స్వరూపుడైన మట్ట పల్లి వాసుని అర్చించేందుకు సకల సంబారాలు కూర్చుకొని ఆలయ సింహ ద్వారం చేరుకొంటారు. ఈ ద్వారానికిరువైపులా జయ విజయులు కావలి కాస్తుంటారు. పైన  ప్రహ్లాద వరదుడైన స్వామి, లక్ష్మీ సమేతుడై దర్శనమిస్తారు. శరణన్న భక్తులను సకల ఆపదలనుండి కాపాడి, కైవల్యాన్ని అనుగ్రహిస్తానని అభయమిస్తారు.

నరసింహుని సింహ ద్వారాన్ని దాటి లోపలికి ప్రవేశించగానే ... ఆలయ ధ్వజస్తంభం ఠీవిగా దర్శనమిస్తుంది. దేవతలు ధ్వజ స్తంభం ద్వారానే భువిలో వెలసిన స్వామి దర్శనానికి వస్తారు. అందుకే ప్రత్యేక ఉత్సవ వేళల్లో దేవతలను ఆహ్వానించేందుకు గరుడ పతాకాన్ని ధ్వజస్తంభం పై ఎగుర వేస్తారు. మన ఇంటి శుభ కార్యాలకు వచ్చే బంధువులకు ఎదురెళ్ళి స్వాగతం పలుకుతాం కదా ! అలా ... స్వామి వేడుకలకు విచ్చేసే దేవతలకు, ఆయన వాహనమైన గరుత్మంతుడు ఎదురేగి ఆహ్వానిస్తాడన్నమాట. దేవతలు దివినుండి భువికి దిగి వచ్చేందుకు వాహకమైన ఈ ధ్వజస్తంభానికి పసుపు కుంకుమలతో పూజలు చేస్తారు. ఆతర్వాత బలిపీఠానికి హారతులిచ్చి స్వామికి ఆత్మ నివేదన చేసుకొంటారు.

 మట్టపల్లి ఆలయ ధ్వజస్తంభం పై, స్వామి విమానం పై సుదర్శన చక్రరాజం దర్శన మిస్తుంది. సర్వ శత్రు నికృంతన కేళీ విలాసుడైన నృసింహుని తత్వానికి ఇది ప్రతీక ! ధ్వజస్తంభం దగ్గరలో భక్తులు కొబ్బరికాయలు కొడతారు. అక్కడే కొలువై విరాజుల్లుతున్న నాగ శిలలకు శిరసు వంచి నమస్కారం చేసుకొంటారు.

సుదర్శన చక్రం వైష్ణవాలయాలలో నెలకొని ఉండడం సర్వ సాధారణమే. కానీ నృసింహాలయాలలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామి నృసింహుడు, సుదర్శనం రెండూ అగ్ని స్వరుపాలే ! సుదర్శన విగ్రహానికి వెనుక వైపు నృసింహమూర్తి ఉంటుంది. అందుకే నృసింహుని సన్నిధి సర్వ శత్రు వినాశకరం. సర్వరోగ ఉపశమనం. నాగ దేవతలు ధ్వజస్తంభం వద్దే కొలువై కనిపిస్తారు . నాగ శిలలు నాగ దోషాన్ని హరించి, సంతాన్ని ప్రసాదించే అమృత మూర్తులు. ఈ దేవతలను దర్శించుకొని, ఆపక్కనే స్వామికి కొబ్బరికాయలు సమర్పిస్తారు.    

భగవంతుని సన్నిధిలో కొబ్బరి కాయలు కొట్టడమంటే సాధారణ విషయం కాదు. దానిలో మహత్తరమైన అర్థం దాగి ఉంది. కొబ్బరికాయలోని నీరు మన ఆత్మ. దానిని పట్టి ఉంచే కొబ్బరి మన మనస్సు. దానిపైన ఉండే చిప్ప మన దేహం. దాని చుట్టూ అల్లుకొని ఉన్న పీచు మనకి మనం తగిలించుకొనే బాంధవ్యాలు, బంధాలు. వాటన్నింటినీ ఒలిచివేసి, శరీర స్పృహను పగుల గొట్టి, ఆత్మ లోని భక్తి భావంతో స్వామిని అభిషేకించి, మన మనసును ఆయన చరణారవిందాలకు సమర్పించడమే ... కొబ్బరికాయ కొట్టడం.

ధ్వజస్తంభాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తే ... ముఖమంటపానికి చేరుకొంటాం. ముఖమంటపంలో నుండి గర్భాలయం కనిపిస్తుంది. గర్భాలయ ద్వారం పై లక్ష్మీ నారసింహుడు దర్శన మిస్తాడు.
  

స్వామి ఈ గుహలో స్వయంవ్యక్తం కావడం వెనుక దివ్యమైన గాథ ఒకటి ఉంది.

భరద్వాజ మహాముని ఇక్కడి కొండ గుహలో నరసింహుని గురించి చాలా కాలం తపస్సు చేశాడు. భరద్వాజుని అనుగ్రహించి స్వామి  ప్రసన్న మూర్తిగా దర్శన మిచ్చారు. భరద్వాజుడు తనను అనుగ్రహించిన  రూపం తోనే మట్టపల్లిలో కొలువై భక్తులను బ్రోవమని వేడుకొన్నాడు. అలా మట్టపల్లి గుహలో స్వయం వ్యక్తమై, అనంతర కాలం లో రెడ్డిరాజుల చేత ఆలయాన్ని నిర్మింప జేసుకొన్నారు. 

తంగెడ ప్రాంతానికి రాజు అనుముల మాచిరెడ్డి ప్రభువు. స్వామి భక్తుడైన ఆ భుపాలునికి జగద్పాలకుడైన నృసింహస్వామి కలలో సాక్షాత్కారించారు. మట్టపల్లి లోని కొండపై ఒక అరిటిచెట్టు, దానిపై గరుడ పక్షి కనిపిస్తాయని, అక్కడ ముళ్ళ పొదల మాటున దాగిన గుహలో తాను వేంచేసి ఉన్నానని సెలవిచ్చారు. అప్పుడు మాచిరెడ్డి సపరివారంగా స్వామిని దర్శించి, కొలిచి తరించాడు. అనంతర కాలంలో ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మింప జేశాడు. అయితే ... ఇప్పుడున్న గర్భాలయ ముఖ ద్వారం మాత్రం ఇటీవల నిర్మితమైనది.

కోరిన కోరిక లన్నింటినీ తీర్చే స్వామిగా మట్టపల్లిలో కొలువై శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు.  ఉత్తర ముఖం గా ఉన్న చిన్నగుహంతర్భాగంలో పడమర ముఖంగా స్వామి దివ్య మంగళ స్వరూపం సాక్షాత్కరిస్తుంది. సన్నటి దీపపు వెలుగుల్లో దేదీప్యమానమై అభయమిస్తుంది. నేరుగా గర్భాలయం లోకి వెళ్లి భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. చతుర్భుజులైన స్వామి శంఖ, చక్ర, గదాయుధాలు ధరించి అభయ ముద్రతో వుంటారు. కరాళ దంష్ట్రలతో, వక్షస్థలం పై కౌస్తుభం తో, కొండలోనుండి వ్యక్త రూపుడై , లక్ష్మీ ప్రసన్నంగా దర్శన మిస్తారు శ్రీ యోగానంద నృసింహ స్వామి.

మట్టపల్లి క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి. ఏ క్షేత్రంలో నైనా క్షేత్రపాలకుని దర్శనం తర్వాతే, స్వామి దర్శనం. తన రాముని చేరుకోవడానికి కృష్ణా నదిని ఈది మరీ చేరుకొన్నారు ఈ హనుమంతులవారు. ఒక విచిత్ర లీలా విలాసం గరుడాళ్వార్ సన్నిధిలో ఆంజనేయ ప్రతిష్ట వెనుక దాగుంది.

 తండోప తండాలుగా భక్తులు స్వామి దర్శనం కోసం తరలి వస్తారు. ఆలయం లో ప్రతి నిత్యం అర్చన, అభిషేకాలు జరుగుతాయి. స్వామికి అర్చన పూర్తై, ఆరగింపు చేసే వేళ ఘంటా నాదాలు మిన్నంటుతాయి. స్వామి ఆరగింపు వేళను సూచించడమే  ఈ మంగళ నాదాలు చేయడం.
ఆరగింపు పూర్తయిన తరువాత మనసులనే పుష్పాలుగా మలచి నృసింహ స్వామికి మంత్ర పుష్పం సమర్పిస్తారు.

 స్వామిని దర్శించుకొని దక్షిణ ద్వారం వెలుపలకి రాగానే గోదామాత దర్శనమిస్తుంది. దివ్య పాశురాలతో స్వామిని అర్చించి, వరించిన దేవేరి కదా గోదామాత! ఆమె చేసిన ఆ అమృత ప్రబంధ సేవ ఇప్పటికీ మంత్ర పుష్పం అనంతరం శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం స్వామికి నివేదిస్తారు.

గోదా దేవి శ్రీ కృష్ణుని భర్తగా వరించి, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. మనకి తిరుప్పావై అనే ముప్ఫై పాశురాల దివ్య ప్రబంధాన్ని ప్రసాదించింది. ఆమెకు ఈ ఆలయం లో నిత్య పూజలు జరుగుతున్నాయి. గోదాదేవి శ్రీవారిని చేరుకొన్న ఘట్టం అత్యంత రమణీయం. భక్తికి భగవంతుడు ఎంతలా తాదాత్మం చెందుతాడో వివరించే అమృతరసరమ్యం.
 
 వైఖానస ఆగమ శాస్త్రానుగుణంగా కొన్ని వైష్ణవాలయాలలో నిత్యార్చనలు జరుగుతుంటాయి. ఆ వైఖానస ఆగమ శాస్త్ర కారుడైన విఖనసాచార్య సన్నిధి కూడా ఈ స్వామి ప్రాంగణంలో ఉంది. ఇక్కడ విఖనసాచార్యుడు స్వామికి జరిగే నిత్య సేవలను పర్యవేక్షిస్తుంటాడు.

అనేక మణుగుల బరువైన, అంతం లేని కోర్కెల చిట్టాలు విని అలసిన స్వామి సేద తీరే అద్దాల మండపం ఇది. తూగుటుయ్యాల పై దేవేరులతో కూడి సుఖాసీనుడైన స్వామి చిద్విలాస రూపాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. జగములేలే స్వామికి పాడే జోల పాటలో పాలుపంచుకోవచ్చు.

 ప్రతి నిత్యం మట్టపల్లి క్షేత్రం లో, స్వామి సన్నిధి లో గోపూజ జరుగుతుంది. కామధేను స్వరూపంగా, సకల దేవతా రూపం గా గోమాతను అర్చించడం మన సంప్రదాయం, సకల వాంఛాపరిపూకం. ఇక్కడ విశాలమైన గోశాల కుడా ఉంది. ఈ గోశాల నుండే శ్రీ యోగానంద నృసింహుని అభిషేకానికి క్షీర సంపత్తి తరలి వెళుతుంది.

మట్టపల్లి క్షేత్రాన్ని దర్శించు కోవడానికి తమిళనాడు నుండి కూడా అశేషంగా భక్తులు తరలి వస్తారు. దీనికి శ్రీమాన్ ముక్కూర్ లక్ష్మీ నరసింహాచార్యుల వారు ఇక్కడ వసించడమే కారణం. నరసింహాచార్యుల వారు స్వయంగా స్వామి దర్శనం పొందారు. ఆయనతో జరిగిన సంభాషణను తమిళంలో రచించారు. మహా యజ్ఞాలను ఈ క్షేత్రంలో నిర్వహించారు.

 యోగానంద నృసింహుడు భక్త సులభుడు. 32 ప్రదక్షణలు చేస్తే చాలు ముగ్దుడై కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు. ముడుపు కట్టి 32 రూపాయలు సమర్పిస్తే ... సర్వ కార్య జయం అనుగ్రహించే కొంగు బంగారం. గుప్పెడన్నం పెట్టి పక్కవాడి ఆకలి తీరిస్తే ఆనందపడే అన్నాలయ్య.  ప్రసిద్ధి చెందిన మట్టపల్లి క్షేత్రం లో ఎన్నో ఉచితాన్నదాన సత్రాలున్నాయి. వేలాది మంది నిత్యం ఇక్కడ ఈ సదుపాయాన్ని వినియోగించుకొంటున్నారు. 

 మట్టపల్లి క్షేత్రం లో చక్కటి వసతి సదుపాయాలూ ఉన్నాయి. ఇక్కడ 11 రోజులుండి, త్రిసంధ్యలా కృష్ణా నదిలో స్నానమాచరించి, స్వామి మంగళాస్టకాన్ని11 సార్లు పఠిస్తూవుంటే ... ఎటువంటి శారీరక, మానసిక రుగ్మతలున్నా నయమవుతాయని విశ్వాసం.

 ఇదీ శ్రీ మట్టపల్లి యోగానంద లక్ష్మీ నృసింహ స్వామి వారి క్షేత్రదర్శనం. కనులారా దర్శించి, మనసారా మ్రొక్కి, స్వామిని ప్రార్ధిస్తే ... ఆయన ఇవ్వని వరం లేదు. తీరని కోరిక లేదు. "జయ జయ నరసింహ" అనే భవతారక మంత్రాన్ని నిత్యమూ స్మరిస్తే ... ఆ స్మరణకి ఋణపడి పోయి , మోక్షాన్ని కూడా ప్రసాదించే కరుణాళువు శ్రీ లక్ష్మీ నృసింహుడు. ఆయన కరుణాకటాక్షాలు చదువరులకు నిండుగా కలగాలని ఆశిస్తూ , శలవు

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna