నరసింహ అవతారం విశిష్టత

3.236.253.192

శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి
శ్రీధర మనోహర పటాపటల కాన్త
పాలయ కృపాయ భవాంబునిధి మగ్నం
దైత్యపరకాల నరసింహ! నరసింహ!

****************************

భక్త రక్షణకు, దుష్ట శిక్షణకు భగవంతుడు ఎక్కడి నుంచైనా, ఏ రూపంలో అయినా ఉద్భవిస్తాడనే దానికి ఈ నరసింహ అవతారం ప్రత్యేక ఉదాహరణ. 

శ్రీమన్నారాయణుని 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వాటిలో అతి ముఖ్యమైన 10 అవతారాలను  దశావతారాలు అంటారు. ఈ విభవాతారములలో 4 వ అవతారమే నరసింహస్వామి. 

శ్రీ నరసింహ జయంతి, ‌స్వాతి నక్షత్రం యుక్త వైశాఖ శుక్ల చతుర్ధతి నాడు జరుపుకొంటారు. ఈ అవతారానికి చాలా విశిష్టతలే ఉన్నాయి. ఆ స్వామి యొక్క, మత్స్య, కూర్మ, వరాహ అవతారాల తర్వాత ఈ నారసింహ అవతారం సంభవించింది. 

1) భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి.
2) సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది.
3) హిరణ్యకశిపుని సంహారానికి, ఇలా కుదరదు, అలా కుదరదు అని ఎన్నో నిబంధనలు మరియు నియంత్రణలు  ఉన్నా, అన్నింటినీ మించిన ఉపాయం ఉన్నదని నిరూపించి పరిసమాప్తం చేసిన విశేష అవతారం.

వైకుంఠంలోని ద్వారపాలకులైన జయ విజయులు విష్ణుసేవా తత్పరులు. ఒకమారు సనక సనందనాది మునులు శ్రీమన్నారాయణుని దర్శనార్ధమై వైకుంఠము నకు రాగా, అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణు లోకానికి దూరమయ్యెదరని శపించారు. అప్పుడు వారు శ్రీ మహా విష్ణువును శరణు వేడగా, మహర్షుల శాపమునకు తిరుగులేదు. కానీ మీరు నా భక్తులైనందు వలన మీకు కొంత శాప విమోచన కలిగిస్తాను. మీరు నా భక్తులుగా 7 జన్మలు గానీ, విరోధులుగా 3 జన్మలు గానీ భూలోకమున జన్మించిన పిమ్మట మరల వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు. అప్పుడు వారు మీకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని పలికెను.

ఆ జయవిజయులే  కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గాను, 
త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు గాను, 
ద్వాపరయుగంలో శిశుపాల దంతవక్తృలు గాను జన్మించారు. వారి ప్రతి జన్మలోను విష్ణువును ద్వేషించి, శత్రువుగా భావించడం చేత శ్రీహరిచే వధులై అనంతరం శాపవిముక్తి పొందారు.

నరసింహావతార వివరణ:

జయ విజయుల మొదటి జన్మయే హిరణ్యాక్ష , హిరణ్యకశిపుల వృత్తాంతం..

కశ్యపుడనే ఒక మహర్షికి దితి అని ఒకానొక భార్య. వీరిద్దరి సంతానమే ఇద్దరు కుమారులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అని ఉండేవారు. విష్ణు భగవానుడు వరాహావతారమెత్తి లోక కళ్యాణార్ధం రాక్షసుడైన హిరణ్యాక్షుడుని సంహరించాడు. ఇది భరించలేని, అతని సోదరుడైన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తితో వైరం పెంచుకున్నాడు. కోపోద్రిక్తుడైన హిరణ్యకశిపుడు తీవ్ర తపమొనర్చి నరులతో కానీ, మృగాలతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇంట గానీ, బయట గానీ, ప్రాణమున్న వాటితో కానీ, ప్రాణం లేని వాటితో కానీ, ఆకాశంలో కానీ, నేల మీద కానీ, ఆయుధాలతో కాని, ఇలా ఎన్నో షరతుల జాబితా చెప్పి వాటితో వేటితో తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మను కోరతాడు. 

వర గర్వం వలన, హిరణ్యకశిపుడు అన్ని లోకాలను శాసించసాగాడు. దేవతలను, మునులను, ఋషులను బాధించసాగాడు. చివరకు దేవలోకంలో ఇంద్రునితో సహా అందరు నిస్సహాయ స్థితిలో రాక్షసుల ఆగడాలను భరించసాగారు.

ఆ సమయంలో హిరణ్యకశిపుని భార్య లీలావతి, మగశిశువైన ప్రహ్లాదుడికి జన్మనిచ్చింది. గర్భంలో వున్నపుడు నారదుని ఉపదేశాలు వలన ఆ పిల్లవాడికి ఈ రాక్షస ప్రవృత్తులు ఏమి అంటలేదు. అతడు పూర్తిగా విష్ణుమూర్తి భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణుభక్తి నుండి మరల్చుదామని శాతం విధాలా  ప్రయత్నించాడు. ఎన్నిమార్లు ప్రయత్నించిన విఫలమౌతూనే ఉన్నాడు. తండ్రి ప్రయత్నిస్తున్నకొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి, ఈ ప్రహ్లాదుని రక్షిస్తూ ఉండేవాడు.

ప్రహ్లాదుని నారాయణ మంత్రం విన్నమాత్రం చేతనే, హిరణ్యకశిపుడు, క్రోధుడై తన కుమారుని పరిపరివిధాల మృత్యు సమీపానికి దండించే నిమిత్తం శిక్షలు వేయసాగాడు. ఏమి చేసినా ఫలితం శూన్యం. ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమంటాడు. 

ఇందు కలడందు లేడని సందేహం వలదు.... ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి అని శలవిస్తాడు ప్రహ్లాదుడు. దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనయి ఉన్న హిరణ్యకశిపుడు ఐతే ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పడగొడతాడు.

అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో గర్జిస్తూ ఒక్క ఉదుటున, హిరణ్యకశిపుడు వరములో అడిగిన అన్ని షరతులన్నీ దాటుకుని విష్ణుమూర్తి స్తంభాన్ని బద్దలుకొట్టుకుని నరసింహుని రూపులో వచ్చి పగలూ రాత్రీ కాని సంధ్యా సమయంలో, ఇంటాబయటా కానీ గడప మీద, ప్రాణమున్నా లేనట్లుగా తోచే గోళ్లతో, ఆకాశమూ నేల మీదా కాకుండా తన ఒడిలో ఉంచుకుని హిరణ్యకశిపుని అంతం చేస్తాడు.

హిరణ్యకశిపుని సంహారం జరిగిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహుని శాంతింపచేయడం దేవతల వల్ల కాలేదు. చివరికి ప్రహ్లాదుని ప్రార్థనను మన్నించి, శాంతించి లక్ష్మీనరసింహునిగా దర్శనమిస్తాడు. ప్రహ్లాదుని ఆదుకున్న విధంగానే, తనని కొలిచిన ప్రతి భక్తునీ అదుకుంటానని అభయమిస్తాడు.

నృసింహస్వామికి ఎరుపు రంగంటే ఇష్టం. అని అంటారు. తులసి మాలలతో ఆయనను అలంకరించి, వడపప్పు, పానకాలను నివేదిస్తే ఆ స్వామి ఆశీస్సులు దక్కి తీరుతాయి. 

నృసింహ జయంతి రోజున స్వామివారిని కొలుచుకునే అవకాశం లేకపోయినా 
‘ఓం_నమో_నారసింహాయ’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామి వారి కటాక్షం దక్కుతుందంటారు పెద్దలు. 

ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌!
నృసింహం భీషణం భద్రం మృత్యోర్‌ మృత్యుం నమామ్యహం!!
అనే మంత్రాన్ని పఠించినా మృత్యువు సైతం ఆమడదూరంలో నిలిచిపోతుందని నమ్మకం.

****************************

శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే 
శ్రీమతే నారాయణాయ నమః!!

పాత మహేష్

Quote of the day

Buddhas don't practice nonsense.…

__________Bodhidharma