Online Puja Services

నేటికీ రక్తాన్ని చిందే నారసింహుడు.

18.219.112.111

అది శాలివాహన శకం. మహారాజు దిలీపుని పాలనలో దేశం సుభిక్షంగా ఉంది. అది మహారాజు శయన మందిరం.దిలీప​ ​మహారాజు (దిలీపకర్ణి)శయనించి ఉన్నారు. నిదురలో హాయిగా కల కంటున్నారు. ఎప్పుడూ, తన పాలనలోని జనం బాగు కోసం తపించే రాజాయన. కలలోనైనా ఆ జనమే , వారి బాగోగులే.  కానీ ఆరోజు ఆయన కలలో జనం లేరు. పాలన గురించిన ఆలోచన లేదు. రాజకీయాలు అసలే లేవు. దిలీపుని కలలో ఆ రోజు వీటన్నింటికీ అతీతమైన దైవం కనిపించింది . తానున్న చోటుకి పిలిచింది.​ ​తాను గుహ లోపలి భాగంలో ఉన్నానని,​ ​తనని బయటకు తీయమని ఆదేశించింది.​ ​

వెంటనే ఆ మహారాజు​ ​76 వేల​ ​మంది​ ​సైనికులని వెంట తీసుకుని కదిలారు. కలలో తనకి కనిపించిన చోటుకి చేరుకున్నారు. గునపాలతో తవ్వించారు. కొంత సేపటి తరువాత గునపానికి నెత్తుటి మరకలంటాయి. ​ఏం జరిగిందో ఊహించలేని సైనికులు ​మరింత జాగరూకులై పని కొనసాగించారు. అక్కడ దాగిన దైవం​ బయటకి వచ్చింది. ​కలలో శిలగా కనికరించిన రూపం ఎదురుగా కనుల ముందు నిలిచింది. కానీ ఆ శిల పై గునపం చేసిన గాయం ​నెత్తురు  ​చిందింది. అది చూసి రాజు అవాక్కయ్యాడు. ​శిల నుండీ నెత్తుటి చెమ్మ   ఎలా వచ్చిందని అచ్చెరువుకు లోనయ్యాడు. దివి నుండి తానుగా దిగి వచ్చిన దైవమే​, తన ముందు నిలిచిందని తెలుసుకున్నాడు. చేతులు జోడించి మహారాజు మోకరిల్లాడు.  ధూప, దీప, నివేదనలతో ​దైవాన్ని ​పూజించి తరించాడు. ​ ఆరోజు ఆరాజును కనికరించిన ​ దైవమే , మన తెలంగాణాలోని​ ​మల్లూరులో కొలువైన​ హేమాచల​ నారసింహుడు​. ​

స్థల మహత్యం :

మల్లూరు .. వరంగల్ జిల్లాలోని​ మంగపేట మండలంలో ఉంది. నారసింహుడు కొలువైన చోటును​ ​హేమాచలం​ అని అంటారు. ​నిజానికి ఇది దట్టమైన అడవిలోని ​ఒక ఎత్తయిన కొండ. ఈ కొండ బంగారం పోతపోసినట్టుగా ​ఉండేదని, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.​ పురాతనమైన చరిత ఉన్న ఈ కొండపైన ​ఎందరో ఋషులు, మునులు తపస్సు చేశారని ​చెబుతారు.​ 

అంతే కాదు, ​​దేవాలయాలను నాశనం చేసిన గజనీ మహమ్మదు సేనలు హేమాచలం జోలికి రాలేదు​. ​​పైగా ​అతను ఈ ఆలయానికి బంగారాన్ని కానుకగా ఇచ్చాడట. ​ఇందుకు ​హేమాచలం ​నెలవంక ​ఆకారంలో ఉండడమే కారణం. నెలవంక ముసలమానులకు దైవ సమానం. ​
 
​హేమాచల నారసింహుని ​​ఆలయం చాలా పురాతనమైనది. దీనిని కట్టి సుమారు​ ​4,796​ ఏళ్ళకి పైగానే గడిచి​పోయి ​ఉండవచ్చని అంచనా.​ ​​​పేరొందిన నవనారసింహ (9 నారసింహ) ఆలయాలలో ఇ​దే మొదటిదని చెబుతారు.​ ​సాధారణంగా నరసింహుని ఆలయాలకు వెళితే​ మొండి రోగాలు సైతం నయమవుతాయని చెబుతుంటారు. కానీ మల్లూరు నరసింహుని వద్దకి వెళితే సంతానం కలుగుతుందని నమ్మకం.​ ​​​
 

మూలమూర్తి :

​ ​​'నరసింహుడు​'​ అంటేనే కంఠం వరకూ మానవ రూపంలో , ఆపైన సింహ ముఖంతో ఉంటారని తెలిసిందే. ​హేమాచల నారసింహుని​ ​మూల విరాట్టు 9 అడుగుల ఎత్తుంటుంది.​ ​అయితే​ ఈ నారసింహుడు​ రాతి రూపమే అయినా, మానవ లక్షణాలతో ఉండడం విశేషం. ఆయన మూల విరాట్టును ఎక్కడ  నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరంలా ఉంటుంది. ఛాతీపై రోమాలుంటాయి. ​ ఎక్కడా లేని విధంగా ఇక్కడి మూలవిరాట్టుకి రోజూ  తైలాభిషేకం జరుగుతుంటుంది. ఆయన పాదాల నుండీ నిరంతరం జలం ఉబుకుతూ ఉంటుంది.​ ​ 
 
ఆయనని వెలికి తీసే సమయంలో అయిన గాయం నాభి పక్కన ఇప్పటికీ ఉంటుంది. దాని నుండీ ఎరుపు రంగులో నీరు కారుతుంటుంది. దీన్ని ఆపేందుకు గాయం పైన చందనాన్ని ఉంచుతారు. దీన్నే నాభి చందనం అంటారు. దీన్ని నారసింహుని చూడవచ్చిన వారికి పంచి పెడుతుంటారు. ఈ నాభి చందనాన్ని సేవించడం వల్ల, నరసింహుని వరంగా  సంతానం కలుగుతుందని చెబుతారు. అందుకే సంతాన లేమి ఉన్నవారు​ దంపతులుగా ఇక్కడికి వచ్చి నారసింహుని పూజించుకుంటారు.

ఆలయంలోని ఇతర విశేషాలు:

నారసింహునితో పాటు ఆలయంలో ఆయన సతులు ఆది లక్ష్మి, చెంచు లక్ష్మి కూడా కొలువయ్యారు.  ​పతితో కలిసి ​కొలుపులు అందుకుంటున్నారు. శరణన్న వారికి కొంగు బంగారమై ఆదుకుంటున్నారు.

 నారసింహుడంటే హరే కదా. మరి ఆయన ఉన్నచోట ఆంజనేయుడు లేకపోతే ఎలా. ఇక్కడ పంచ ముఖాలతో (5 ముఖాలతో) కొలువైన ఆంజనేయుడు చూడ చక్కగా ఉంటాడు.  ఆయన శిలా రూపం చూసేందుకు చాలా చిన్నగా ఉంటుంది. నరసింహుని లాగానే ఈయన కూడా ముట్టుకుంటే మెత్తగా ఉంటారు. నొక్కితే సొట్టపడి పోతుంది. మనం చేతిని తీయగానే మళ్ళీ మామూలుగా అవుతుంది.
   

ఔషధ జలధి చింతామణి జలపాతం​:

ఆలయం చుట్టూ ఉన్న చెట్టు చేమలు ఎంతో అందంగా ఉంటాయి. ఈ కొండంతా కూడా ఎన్నో వనమూలికలకు ఆలవాలం. ఆ  ఔషధాల గుణాలను తనలో నింపుకుంటూ, వాటి నడుమ నుండీ పారు​తుంటుంది చింతామణి జలపాతం​. ​​ ​గంగాజలం ​కన్నా చింతామణి నీరే మిన్నని అంటారు ఇక్కడి వారు.​ దీనిలోని నీరు ఎప్పుడూ ఇంకిపోదు. పైగా ఈ జలపాతం కొండమీద జనం పెరిగే కొద్దీ మరింత వేగం పుంజుకుంటుందని పరిశీలకులు అంటారు. కొండమీద ఒత్తిడి ఎంతగా పెరిగితే ఈ జలాలు అంతగా భూమి నుండీ పైకి ఉబికి, ఉరుకుతాయట. ఈ నీటిని తాగినా, తలపైన పోసుకున్నా సకల రోగాలూ  నయమవుతాయని నమ్ముతారు.​ దీనికే అక్కథార - చెల్లెధార అని మరో పేరూ ఉంది.  దీనికి దగ్గరలోనే మరో చిన్న జలపాతం కూడా ఉంటుంది .

చారిత్రిక వైభవం :

ఈ జలపాతానికి నామకరణం చేసింది ​​కాకతీయ రాణి, రుద్రమదేవి​. ​చింతామణి అనే పేరును ఆమె ఈ జలపాతానికి సూచించారట. ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కాకతీయులు పాలన సాగించారు. ఆ రోజుల్లో ఆమె ఇక్కడికి వచ్చారని ఆనవాళ్ళు ఉన్నాయి. ​శతృ మూకలు దండెత్తి వచ్చినప్పుడు, ఆమె ఈ కొండపైన కోటలో విడిది చేసే వారు. ఆమెకు రక్షణగా సైనికాధి కారులు కూడా వచ్చేవారు. 

ఈ  ​ఆలయ శిఖరం గోదావరికి కేవలం కోసుపెట్టు దూరంలోఉం​ది. ​​దీంతో నదికి ఆవలి వైపు నుండీ వచ్చే విరోధులను ముందే పసిగట్టేందుకు ​కాకతీయులకు ​ఇది వీలుగా ఉండేది. దీంతో ఇక్కడ ఆ కాలంలో గోన గన్నారెడ్డి నాయకుడిగా సైనిక పటాలాలు​ కూడా విడిది చేసేవి. ఆ గురుతులు మనం ఇప్పటికీ చూడవచ్చు.

చింతామణి జలపాతానికి దగ్గరలోనే మహాలక్ష్మిదేవి పురాతనమైన మందిరం ఉంది. దీని చుట్టుపక్కలే మరెన్నో ఆలయాలూ ఉన్నాయి.  సీతారామ, వేణుగోపాల ఆలయాలు, శివాలయము ఉన్నాయి .​వీటిలో పాటు మరెన్నో విశేషాలకూ​, చరితకు, వింతలకూ  నెలవైన ఆలయం హేమాచలం.
 

 చేరుకోవడం ఎలా :

​​ఇది మల్లూరు నుండీ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. అడవి నడుమ​ కొలువైన​ప్పటికీ,​​ నారసింహుని దరికి చేరేందుకు వసతులన్నీ చేసింది తెలంగాణా రాష్ట్ర సర్కారు.​ వరంగల్ నుండీ, భద్రాచలం నుండీ ఈ ఆలయానికి రోడ్డు మార్గం ద్వారా  చేరుకోవచ్చు. 

- లక్ష్మి రమణ 

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya