Online Puja Services

పుష్కరుడు ఎవరు ? ఆయన గంగమ్మని చేరడం ఏమిటి ?

18.119.139.104

పుష్కరుడు ఎవరు ? ఆయన గంగమ్మని చేరడం ఏమిటి ? 
- లక్ష్మి రమణ 

భూమి, ఆకాశము, నిప్పు, నీరు, గాలి అనేవి పంచభూతాలు. వీటిల్లో నీరు అత్యంత ప్రధాన మైనదని వేద వాక్యం. నీరే జీవుల ఆవిర్భావానికి కారణం. జీవులలోని ప్రాణ శక్తి నీరే . అటువంటి నీటిలో భగీరధుడు తన అనితర సాధ్యమైన కృషితో నేలకు దింపిన గంగమ్మపరమ పావని. పుష్కర సహితమైన గంగలో స్నానం చేస్తే, బ్రహ్మ హత్యా పాతకం తో సహా  మహా పాపాలన్నీ  కూడా హరించుకు పోతాయని శ్రుతులు పేర్కొంటున్నాయి. గంగమ్మే పరమపావని కదా ! మరి ఈ పుష్కరుడు ఎవరు ? ఆయన గంగమ్మని చేరడం ఏమిటి ? గంగాపుష్కరాలు 

నదీ స్నానం అత్యంత శ్రేష్టమైనది. పుష్కరకాలం లో నదీ స్నానం మరింత ఫల ప్రదం. ఏప్రియల్ 22 నుండీ మే 3 వరకూ గంగానదిలో పుష్కరుడు కోలువైతాడు. ఈ 12 రోజుల కాలం లో గంగమ్మలో  స్నానం చేసి , నదీ తీరంలో పితృకార్యాలు నిర్వహించడం, తర్పణాలు వదలడం వలన  పితృ దేవతలకు ఉత్తమలోకాలు ప్రాప్తిస్థాయి. వంశాభివృద్ధి కలుగుతుంది. దేశం సస్యశ్యామలమై సుభిక్షంగా ఉంటుంది. సమాజం శాంతి సౌభాగ్యాలతో ఆనందంగా ఉంటుంది. ఆయా నదీతీరాల్లో విలసిల్లే క్షేత్రాలనూ, అక్కడ నెలకొన్న దేవతామూర్తులను ఈ పుష్కరకాలంలొ ఆరాధించడం,  శాంతి సౌభాగ్యాలకై ప్రార్థించడం  మన కర్తవ్యం. 

పుష్కరనదులలలో చేసే ఏ పవిత్రకార్యమైనా వెంటనే  సత్ఫలితాన్ని అనుగ్రహిస్తుంది. పుష్కరస్నానం తాపాలనూ, పాపాలనూ పోగొడుతుంది. సమస్త  శుభాలు ప్రసాదిస్తుంది. వెయ్యి గోదానాలు చేసిన పుణ్యం లభిస్తుంది. గంగానదిలో పుష్కరుడు ఉండే ఈ 12 రోజుల కాలం లో స్నానమాచరించడం వల్ల కామితార్ధాలు నెరవేరుతాయి. అనారోగ్యంతో బాధపడే వారు పూర్ణ ఆరోగ్య వంతులవుతారు. నిస్సంతులు సంతానవంతులవుతారు. గంగా పరివాహక ప్రాంతంలో పితృకర్మలు ఆచరించడం వల్ల వారికి ఉత్తమ గతులు సంప్రాప్తమవుతాయి. పుష్కరునితో కూడిన గంగమ్మ సకల ఐశ్వర్య, సౌభాగ్య, ఆరోగ్య ప్రదాయనిగా వర్ధిల్లుతుంటుంది .   

పోషించే శక్తినే  సంస్కృతంలో పుష్కరం అంటారు.  పూర్వం తుందిలుడనే ధర్మాత్ముడు ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఈశ్వరుని గురించి ఘోరమైన తపమాచరించాడు. ఈశ్వరుని అనుగ్రహం పొందాడు. తందిలుడు ఈశ్వరునితో తనకు శాశ్వతంగా ఈశ్వరునిలో స్థానంకావాలని కోరుకున్నాడు. ఈశ్వరుడు సంతోషించి తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో అతనికి శాశ్వతంగా స్థానం ఇచ్చాడు. ఆతర్వాత సృష్టి కర్త బ్రహ్మ తన కర్తవ్య నిర్వహణకు ఆ పవిత్ర జలాలను అర్థించాడు. అప్పుడు శివుని వద్దనున్న పుష్కరుడు బ్రహ్మ దేవుని కమండలం లోకి చేరాడు. అందుకే సృష్టి జలం నుండే ఆవిర్భావ మయ్యింది. నాగరికత నదీ తీరం వెంటే ప్రాణం పోసుకోంది.

ఆ తర్వాత నదీనదాలు పాపులు తమలో మునగడం వల్ల  సంప్రాప్తమైన పాప భారాన్ని మోయలేకపోయాయి. అప్పుడు బ్రహ్మ దేవుని ఆనతి పై బృహస్పతి తాను పన్నెండు రాసులనూ సంక్రమించే క్రమంలో ఒక్కో రాశిలో చేరినప్పుడు ఒక్కొక్క పుణ్య నదిలో ఉండేందుకు సమ్మతించాడు.  బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం  బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలంనుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నం ,అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది .ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం,వాటితో  స్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు.పుష్కరము అంటే 12 సంవత్సరాలు అని అర్థం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మన నదులకు పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో సమస్త పుణ్య నదీ తీర్థాలు ఆయా నదీ జలాల్లో ఉంటాయి. అంతటి పవిత్రమైన జలాలలో  స్నానమాచరించేందుకు  దేవతలు, ఋషులు, గురువు బృహస్పతి మొదలైన వారంతా కూడా తరలి వస్తారని ప్రతీతి. బృహస్పతి మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి.

ఈ దివ్యమైన సమయంలో వీలున్నవారు గంగమ్మలో స్నానం చేసే ప్రయత్నం చేయండి . నదీ తీరాలలో ఉన్న దివ్యమైన ఆలయాలని సందర్శించండి .

Quote of the day

Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.…

__________Rabindranath Tagore