Online Puja Services

గంగమ్మ నామాలు ఒక్కసారి మనసారా తలచుకుందాం !

3.144.33.41

గంగమ్మ నామాలు ఒక్కసారి మనసారా తలచుకుందాం !
- లక్ష్మి రమణ 

గంగ అంటే జలము అనే సామాన్యమైన అర్థం ఉంది. పావని అంటే గంగానది. గంగమ్మకి ఇటువంటి పేర్లు ఎన్నో ఉన్నాయి.  ఆ నామాల గురించి తెలుసుకుంటే గంగమ్మ గురించి ఎన్నో విశేషాలు తెలుస్తాయి.  పరమ పావనమైన గంగానదికి విశేష నామాలు వాటిలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఇతిహాసము కూడా ఉన్నాయి. పావని గంగమ్మకి పుష్కరాలు జరుగుతున్న వేళ, అందులో వైశాఖ మాసములో ఆ అమ్మని మనసారా తలచుకున్నా జన్మ జన్మల పాపాలూ నశించి పోతాయి . గంగమ్మ కృపతో ప్రక్షాళనమవుతాయి. ఆ నామాలని ఒక్కసారి మనసారా తలచుకుందాం .   

 నందిని, నళిని, దక్షపుత్రి, విహగ, విశ్వకాయ, అమృత, శివ, విద్యాదరి, సుప్రశాస్త, విశ్వ ప్రసాదిని, క్షేమ, జాహ్నవి, శాంతి ప్రదాయిని అనే పేర్లు గంగమ్మకి  ఉన్నట్లు మత్స్య పురాణం చెబుతుంది. ఇలాగే  ఇంకా అనేక నామాలు ఉన్నట్లు వివిధ పురాణ ఇతిహాసాదుల వల్ల తెలుస్తోంది. వాటిల్లో ప్రసిద్ధమయిన కొన్ని నామాలని గురించిన ఇతిహాసాలని ఇక్కడ చెప్పుకుందాం . 

భాగీరథీ:

తమ పితృదేవతలకు ఉత్తమ గతులు కల్పించడానికి భాగీరథుడు గొప్ప ప్రయత్నం చేశారు.  బ్రహ్మదేవుని చేత ప్రేరితుడై, శివుని గురించి తపస్సు చేసి, శివ జటాజూటంలో ఉన్న  గంగను వరంగా పొందారు. ఆ విధంగా బిరబిరా తరలివచ్చిన గంగమ్మని  తన వెంట తీసుకువెళ్లి, తమ పితృదేవతల భస్మరాసిపై ప్రవహింప చేశాడు.  అలా భగీరధుని ద్వారా గంగానది భూమిపైకి తీసుకు రాబడడం చేత గంగకు భాగీరథీ అనే పేరు కలిగింది. 

 జాహ్నవి:

భగీరథుని వెంట వెళ్లే గంగానది ఉరకలు వేస్తూ, అమితమైన వేగంతో ప్రవహించి  జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తింది.  దాంతో కోపించారు జహ్నుమహర్షి.  ఆయన కోపం ఒక రకంగా భాగీరథుని ప్రయత్నాన్ని గంగపాలు చేసింది .  జాహ్న మహర్షి తనకు తపోభంగాన్ని కలిగించి తన ఆశ్రమాన్ని ముంచెత్తిన గంగమ్మని ఆసాంతం పానం చేసేశారు.  భగీరథుడు తిరిగి జహ్ను మహర్షిని ప్రార్థించగా, ఆ మహర్షి తన కుడి చెవి నుంచి గంగను బయటకు పంపించాడు.  అలా జహ్ను మహర్షి  చెవి నుండీ విడవబడింది కాబట్టి గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది.

 భీష్మసు:

శంతనమహారాజుని పతిగా పొందిన గంగానది కడుపున శాపగ్రస్తులైన అష్ట వసువులు జన్మించారు.  వారిలో చివరివాడు భీష్ముడు.  ఆయనని కని,పెంచడం వల్ల గంగకు భీష్మసు అనే పేరు ఏర్పడింది. 

 విష్ణుపది:

వామన పురాణం ప్రకారం, వామనవతార సమయంలో శ్రీమహావిష్ణువు తన రెండవ అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించినప్పుడు, ఆయన పాద తాకిడికి బ్రహ్మాండ కహటానికి రంధ్రమై, దాని నుండి బయటకు వచ్చిన జలధార విష్ణుపాదంపై నుంచి జాలువారి సురనదిగా, సురగంగగా మారింది.  ఆ విధంగా  విష్ణు పాదం నుంచి ఉద్భవించడం చేత విష్ణు పది అనే పేరు గంగకు కలిగింది. 

 త్రిపధగా:

 స్వర్గ, మత్స్య, పాతాళ మార్గాలలో ప్రవహిస్తుంది  గంగా నది.  స్వర్గలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుండి పాతాళలోకానికి చేరడం వల్ల త్రిపథగా  అనే పేరువచ్చింది. దేవలోకంలో ఉండడం వల్ల సుర నది, ఆకాశంలో ప్రవహించడం వల్ల వియత్గంగా/ఆకాశగంగా అని, కశ్యప మహర్షి తపస్సు వల్ల భూమి మీదకు రావడం వల్ల కాశ్యపియని, దేవలోకం  నుంచి పర్వతం పైన పడి, భూమిని చేరే గంగా ప్రవాహం అలకనందా అని  కీర్తించబడుతోంది.  

ఈ విధంగా గంగమ్మకి అనేకమైన నామాలు . ఒక్కోనామానిదీ ఒక్కో చరిత . గంగోత్రిలో జన్మించిన గంగ అనేక నదులని తనలో విలీనం చేసుకుంటూ ఈ దేశాన్ని పవిత్రం చేస్తోంది . ఇంతటి పావని అయిన గంగ ప్రవహించే నేలమీద ఉన్నామనే భావనే, శరీరం జలదరించి ఆత్మా సంతృప్తిని కలుగజేస్తుంది .  ఈ పావన వాహినికి  అనేక ఉపనదులు ఊతమిస్తున్నాయి.  వాటి వల్ల మరింత విస్తారంగా గంగానది ప్రవాహం ఉంటుంది.  పురాణాలలో గంగానది శాఖలుగా అలకనంద, సింధు, సీత, నళిని, పావని, భద్ర మొదలైనవి చెప్పబడుతున్నాయి.  అలాగే ఉపనదులను కూడా పేర్కొంటున్నాయి . వాయు పరాణం మత్స్య పురాణం కూర్మపురాణం బ్రహ్మాండ పురాణం తదితరాలు ఈ ఉపనదుల గురించి వివరిస్తున్నాయి.  

గంగమ్మలో మునకేయగలిగిన వారి పుణ్యము అనంతమే.  అలా అమ్మని చేరి ఆ అదృష్టానికి నోచుకోలేని వారు, మనసారా గంగమ్మని తలుచుకొని, గురునామ స్మరణ చేసుకొని ఈ పవిత్ర వైశాఖంలో సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేయండి . గంగ అంటే జలము అని చెప్పుకున్నాం కదా ! అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది . 

శుభం !! 

Quote of the day

We should not fret for what is past, nor should we be anxious about the future; men of discernment deal only with the present moment.…

__________Chanakya