Online Puja Services

వాగ్దేవిని వసంత పంచమికి పూజించే విధానం ఇదీ !

3.15.219.217

పిల్లలకి విద్యనిచ్చే వాగ్దేవిని వసంత పంచమికి పూజించే విధానం ఇదీ !
- లక్ష్మి రమణ 

జ్ఞానప్రదాయని సరస్వతి. ఆమె లేకపోతే అసలు లోకంలో శబ్దమే లేదు. శబ్ద బ్రహ్మగా, ధ్వనికర్తగా, వాక్కుకు అధిష్ఠాన దేవతగా, విద్యను, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించే ఆ సరస్వతీదేవిని వసంత పంచమి నాడు శ్రద్ధాభక్తులతో పూజించాలి. పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి ఈ పర్వం ప్రశస్తమైనది. వసంత పంచమి  నాడు పిల్లలు సరస్వతీ దేవిని పూజించే విధానం తెలుసుకుందాం .  

పిల్లలకి పాఠశాలల్లో

 “సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణీ౹
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||”

 అనే సరస్వతీ ధ్యాన శ్లోకాన్ని ప్రార్థనగా చెప్పిస్తారు . దీనివల్ల అమ్మవారి కృప వారికి లభించి, వారు మంచి విజ్ఞాన వంతులవుతారని, చదువుల్లో ఉన్నతిని సాధిస్తారనే నమ్మిక . 

సరస్వతీ దేవి ఆవిర్భవించిన రోజునే వసంత పంచమిగా చెబుతారు . ఈ రోజు, చక్కగా కుటుంబం అంతా  కలిసి వినాయక చతుర్థిని చేసుకున్నట్టు వసంత పంచమి పూజ చేసుకోండి . పెద్దలు దగ్గరుండి పిల్లల చేత అమ్మవారిని అర్చింప జేయండి . దీని వాళ్ళ పిల్లల్లో తెలివి తేటలు పెరుగుతాయి. స్వభావంలో సౌమ్యత అలవడుతుంది . విద్యా, విజ్ఞాన విషయాలలో రాణింపు ఉంటుంది . 

పూజావిధానం ఇదీ :  

 ‘మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేఽపిచ౹
పూర్వేఽహ్ణి సంయమం కృత్వా తత్రాహ్నే సంయతః శుచిః౹౹’

అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతుంది.

మాఘ శుద్ధ పంచమి నాడు ఈ దేవిని అర్చించాలి.  ప్రాతఃకాలమే నిద్రలేచి, నిత్యకృత్యాలు పూర్తి చేసుకోవాలి. స్నానానంతరం పూజని ఆరంభించాలి .  పూజా స్థానంలో సరస్వతీదేవి చిత్రపటం లేదా ప్రతిమను ఉంచి, అలంకరించి  అమ్మని అర్చించాలి .  “శ్రీ సరస్వత్యై నమః” అంటూ ధ్యాన ఆవాహనాది షోడశోపచారాలతో ఆరాధించాలి . శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి చేసుకోవచ్చు . ఇంకా లఘువుగా అమ్మవారి ద్వాదశనామావళి చేసుకోవచ్చు . వీలయితే పిల్లలు రోజూ ఈ ద్వాదశనామావళి చదువుకునేలా వారిని ప్రోత్సహించండి .   
 
తెల్లటి పుష్పాలు, అక్షతలు, శ్వేత వస్త్రం సమర్పించి పూజించాలి. సరస్వతీదేవి స్వరూపంగా గ్రంథాలు, విద్యార్థుల పాఠ్య పుస్తకాలు, ఇతర పుస్తక సామగ్రి, కలాలను పూజించాలి.

దేవికి నివేదనగా పాలు, పెరుగు, వెన్న, తెల్లని నువ్వులతో చేసిన లడ్డూలు, చెరకు రసం, తేనె సమర్పించవచ్చు.

అమ్మపైని పూర్తి భక్తితో, చక్కగా ఈ వసంత పంచమి జరుపుకోండి. పూర్ణమైన భక్తి, అచంచలమైన విశ్వాసం ఉన్న చోట అమ్మ కరుణ కూడా అచంచలంగా , అనంతంగా ఉంటుంది .  శుభం . 

#vasantapanchami

Tags: saraswati, vagdevi, vasanta panchami, 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda