Online Puja Services

నవ దుర్గల అవతారాలు - పూజా విశేషాలు

3.141.8.247

నవ దుర్గల అవతారాలు - పూజా విశేషాలు 

నవరాత్రి పదంలో నవ శబ్దం తొమ్మిది సంఖ్యను సూచిస్తుంది. నవరాత్రులను నవ అహోరాత్రాలు అని ధార్మిక గ్రంధాలు వివరిస్తున్నాయి. అంటే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్రులు నిర్వర్తించే దేవి పూజకు ఒక ప్రత్యక విధానం ఉంది. ఆశ్వయుజ శుక్ల పక్ష పాడ్యమి తిథి నుండి తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు అమ్మవారిని పూజించడం ప్రశస్తంగా చెప్పబడింది. దీనినే 'శరన్నవరాత్రులు' లేదా 'దేవి నవరాత్రులు అంటారు

మహిషాసురుణ్ణి వధించేందుకు ఆ దేవి నవరూపాలు ధరించిందని , చివరికి దశమి రోజున మహిషాసురుణ్ణి మర్దించి విజయాన్ని వారంచిందని ఐతిహ్యం . దీనికి చిహ్నంగానే , శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది . 
ఇలా అమ్మవారికి అలంకరించే రూపాలు ప్రాంతాన్ని బట్టి , సంప్రదాయాన్ని బట్టి రకరకాలుగా ఉంటాయి . తెలుగు రాష్ట్రాలలో అయితే విజయవాడ ఇంద్రకీలాద్రి పైనున్న దుర్గమ్మకి ఏరోజు ఏఅవతారాన్ని వేస్తే దానినే ప్రామాణికంగా ఇతర దేవాలయాలు , ప్రజలు అనుసరించడం కద్దు . మొదటిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గామాతగా లేదంటే కొన్ని ప్రాంతాలలో శైలపుత్రిగా దర్శనమిచ్చే దుర్గమ్మ ఆతర్వాత వరుసగా బాలా త్రిపుర సుందరి ,గాయత్రి , సరస్వతి ,  అన్నపూర్ణ, మహా లక్ష్మి, దుర్గ , మహిషాసురమర్దని , రాజరాజేశ్వరి  అవతారాలలో అలరిస్తారు . కొన్ని ప్రాంతాలలో తొలి మూడు రోజులు పార్వతిగా, తర్వాతి మూడు రోజులు లక్ష్మీగా, చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు. 

నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రుల్లో నవదుర్గల అలంకారంలో దర్శనమిచ్చే పరాశక్తి ని ధ్యానించి పూజిస్తే , సర్వకార్య విజయం సంప్రాప్తిస్తుందనేది శృతి వాక్యం . 

తొలిరోజు- శైలపుత్రి

శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్థకృతశేఖరామ్‌!, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశ స్వినీమ్‌!!..

నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారు త్రిశూల ధారిణి అయిన హిమవంతుని కుమార్తెగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రీదేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తిశ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలనూ, యశస్సునూ అందిస్తుంది.

----------------------------------------------------------------------------------

(శైలపుత్రి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి . )

-----------------------------------------------------------------------------------

రెండో రోజు- బాలాత్రిపుర సుందరీ

శ్లోకం: హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం సౌవర్ణాంబర ధారిణీం వసుధాదౌతాం; త్రినేత్రోజ్జ్వలామ్‌ వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్‌!!

రెండో రోజు పరాశక్తి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి.

--------------------------------------------------------------------------------------------------

(బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి )

---------------------------------------------------------------------------------------------------

మూడో రోజు- గాయత్రీదేవి

శ్లోకం:ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైుర్ముఖై స్త్రీ‌క్షణైః యుక్తామిందుని బద్ధరత్న మకుటాం తత్త్వార్థ వర్ణాత్మికామ్‌, గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీ భజే.

వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ మంత్రం. మూడో రోజు ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో.. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రీ ఉపాసానతో మంత్రసిద్ధి, బ్రహ్మ జ్ఞానం కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.

-----------------------------------------------------------------------------------------

(గాయత్రీ దేవి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి

------------------------------------------------------------------------------------------

నాలుగో రోజు - శ్రీ లలితా త్రిపురసందరీదేవి 

ధ్యానం :
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ | అణిమాదిభిరావృతాం మయూఖై- రహమిత్యేవ విభావయే భవానీమ్ ||
ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ || 
ఏహ్యేహి దేవదేవేశి త్రిపురే దేవపూజితే పరామృతప్రియే శీఘ్రం సాన్నిధ్యం కురు సిద్ధిదే | ఇతి బిందుపీఠగత నిర్విశేష బ్రహ్మాత్మక శ్రీమత్కామేశ్వరాంకే శ్రీలలితాంబికాం ఆవాహయేత్ | ఓం శ్రీ లలితా పరమేశ్వరీ దేవ్యై నమః ధ్యాయామి |

దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు . శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారి రూపం అమృతోపమానంగా  ఉంటుంది . 

--------------------------------------------------------------------------------------------------------------

(శ్రీ లలితా త్రిపురసుందరీ  దేవి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

---------------------------------------------------------------------------------------------------

లలితాసహస్రాన్ని పారాయణ చేయడం శుభకరం .  

ఐదో రోజు- సరస్వతీదేవి

శ్లోకం: యా కుందేందు తుషార హార ధవళా యాశుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైస్సదా పూజితా, సామాంపాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా.

శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.

-----------------------------------------------------------------------------------------

(సరస్వతీ  దేవి అష్టోత్తరశతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి )

------------------------------------------------------------------------------------------

ఆరో రోజు- అన్నపూర్ణాదేవి

శ్లోకం: ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతాకృపాసాగరీ, నారీనీలసమానకుంతలధరీ నిత్యాన్న దానేశ్వరీ; సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ.. భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ.

ఐదో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్యవృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 

---------------------------------------------------------------------------------------------

(అన్నపూర్ణా  దేవి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి )

----------------------------------------------------------------------------------------------

ఏడో రోజు- మహాలక్ష్మీ

శ్లోకం: లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమహాలక్ష్మిీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.

-------------------------------------------------------------------------------------------

(మహాలక్ష్మీ దేవి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి )

-------------------------------------------------------------------------------------------

ఎనిమిదో రోజు- దుర్గాదేవి

శ్లోకం:సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే, శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.

దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.

-------------------------------------------------------------------------------------

(దుర్గాదేవి  అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి )

--------------------------------------------------------------------------------------

తొమ్మిదో రోజు- మహిషాసురమర్దినీదేవి

శ్లోకం: మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ

నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.

-------------------------------------------------------------------------------------------------------

(మహిషాసురమర్దినీ  దేవి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి )

--------------------------------------------------------------------------------------------------------

పదో రోజు- రాజరాజేశ్వరీదేవి

శ్లోకం: అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ, బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా, చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ.

శరన్నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. ‘అపరాజితాదేవి’గా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి.

---------------------------------------------------------------------------------------------------

(శ్రీ రాజరాజేశ్వరీ  దేవి అష్టోత్తర శతనామావళి  కోసం ఇక్కడ క్లిక్ చేయండి )

----------------------------------------------------------------------------------------------------

ఈ శరన్నవరాత్రి శుభతిథుల్లో ఆ అపరాజితాదేవి అనుగ్రహం ఎల్లరకూ సిద్ధించుగాక !! శుభం భూయాత్ సర్వాణి , సమస్తాణి . సర్వేజనా సుఖినోభవంతు !!

- లక్ష్మి రమణ

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore