Online Puja Services

శ్రీ దేవీ ఖడ్గమాలని రోజూ చేసుకోవచ్చా ?

3.16.69.143

శ్రీ దేవీ ఖడ్గమాలని రోజూ చేసుకోవచ్చా ?
- లక్ష్మి రమణ 

స్త్రీ శక్తి ఆరాధనలో శౌచం అత్యంత ప్రాధమైనది . అందులోనూ మనం మాట్లాడుకుంటున్నది ఖడ్గమాల గురించి . ఇది పూర్తిగా శ్రీచక్ర వర్ణన.  ఈ ఒక్క స్తోత్రం నియమంగా చేసుకోగలిగితే చాలు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు అన్ని తొలగిపోతాయి . ఇహమూ , పరమూ కూడా అమ్మ అనుగ్రహంతో సిద్ధిస్తాయి . కానీ, శ్రద్ధ , భక్తి, నియమ పాలన అమ్మకి చేసే ఈ పూజకి చాలా అవసరం . ఇది తంత్రశాస్త్ర సంబంధమైనది. శ్రీ వామకేశ్వర తంత్రంలో ఉమా మహేశ్వరుల సంవాదంగా చెప్పబడింది. 

అపూర్వం ఖడ్గమాలా స్తోత్రం :  

మనని కన్నా అమ్మ కూడా అంతే కదా ! చెడు దారిలో వెళ్తానంటే, శిక్షించయినా దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుంది . మన ఉన్నతి కోసం ఎంతకైనా వెనకాడకుండా శ్రమిస్తుంది. అమ్మ చిటికెడు ప్రేమకే పొంగిపోయే అమృతమయి. ఆవిడ హృదయమే ఇంతటి నవనీతమైతే, మరి ఆ  అమ్మలగన్నయమ్మ మన కోసం ఇంకెంత వాత్సల్యంతో ఉంటుందో అర్థం చేసుకోవాలి .  అలాంటి అమ్మనే మనం ఖడ్గమాలతో అర్చిస్తాం . ఆవిడ కరుణాకటాక్ష వీక్షణం మనపైన పడినా చాలు ఇహమూ పరమూ రెండూ సౌఖ్యమే !

సకల పాపాలు తొలగించి, సకల దుఃఖాలు తొలగించి నిత్యం మనల్ని రక్షించే, అపూర్వ స్తోత్రం శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్రం. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వివిన్నా, పఠించినా , సకల దోషాలు తొలగుతాయి.  సంపదలు కలుగుతాయి. ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది.ఇలా చేయడం వల్ల సర్వ దుష్టశక్తులూ వదిలిపోతాయి . పీడలన్నీ తొలగిపోతాయి .  మన మనోభీష్టాలు కూడా నెరవేరుతాయి.

ఖడ్గమాలా స్తోత్రంలో ఏముంది ?

ఖడ్గమాలా స్తోత్రం పూర్తిగా శ్రీ చక్రం యొక్క వర్ణన. శ్రీ చక్రం లో మొత్తం తొమ్మిది ఆవరణలు ఉన్నాయి. ఆ తొమ్మిది ఆవరణలో ఉండే దేవతల స్తోత్రమే ఖడ్గమాల స్తోత్రం. ఖడ్గమాల స్తోత్రం చదివినట్లయితే శ్రీచక్రాన్ని ఉపాసించినటువంటి ఫలితం లభిస్తుంది . శ్రీవిద్యలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రధానమైనది. ఒక్క ఖడ్గమాల స్తోత్రం చదువుతూ, శ్రీ చక్రానికి కుంకుమార్చన చేసినా  పూర్ణ శ్రీవిద్యా పూజగా పరిగణింపబడుతుంది. 

ఖడ్గమాల ఎలా చేయాలి : 

తీవ్ర సమస్యలు వచ్చినప్పుడు, అమ్మపైన  పూర్ణ భక్తి తో ఈ స్తోత్ర పారాయణం చేస్తే, వెంటనే రక్షణ లభిస్తుంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు 11 సార్లు పారాయణం చేస్తూ, అలా 41 రోజుల పాటు కొనసాగించాలి .  నియమపాలన చేస్తూ, ఈ పారాయణం చేస్తే, సత్వర సహాయం లభిస్తుంది. స్పష్టంగా  చదవలేని వారు, ఈ స్తోత్రం ప్రతిరోజూ విన్నా మెరుగైన ఫలితాలు కలుగుతాయి. అంతటి మహిమోపేతం , విశిష్టం ఈ ఖడ్గమాలా స్తోత్రం . 

నియమాలు : 

అమ్మమీద పూర్ణమైన విశ్వాసం , అచంచలమైన భక్తి ఉండాలి .
అలా ఉన్నా స్త్రీ, పురుషులెవరైనా ఈ స్తోత్రం చదువుకోవచ్చు .  
అక్షర దోషాలూ , ఉచ్ఛారణా దోషాలూ  లేకుండా నేర్చుకొని చదువుకోవాలి . 
 స్నానం చేయకుండా, శౌచం లేకుండా  ఖడ్గమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ చదవకూడదు.
బయట ఉన్న ఆడవాళ్ళు నాలుగురోజులపాటు పారాయణ చేయకూడదు. మైల ఉన్న కాలంలో మాటవరసకి కూడా ఖడ్గమాల పారాయణ చేయకూడదు.
మాంసాహారం తీసుకోకుండా , సాత్వికులై , సాత్విక ఆహారాన్ని ఈ పారాయణా కాలంలో తీసుకోవడం మంచిది . 

ఖడ్గమాల స్తోత్రం చాలా శక్తివంతమైనది.  ఖడ్గమాల పారాయణ నియామంకితులై పాటించగలిగినవారు, చక్కగా నిత్యమూ చేసుకోవచ్చు . అమ్మ ఆరాధన విశేష ఫలం .  వీలయితే, శ్రీచక్ర కుంకుమార్చన యుక్తంగా దేవీ ఖడ్గమాలని చేసుకోవచ్చు . లేదంటే, పైన చెప్పినట్టు పరిమితమైన కాలనియమం తో  ఖడ్గమాల చేసుకొని అమ్మని శరణువేడవచ్చు.  ముందే చెప్పుకున్నట్టు , దీనివల్ల ఇహములోని కామ్యాలు అన్ని సిద్ధిస్తాయి అమ్మ అనుగ్రహంతో . ఆ తర్వాత ఆధ్యాత్మిక ఉన్నతి, అమ్మ ఆశీస్సులతో  పరలోక పుణ్యమూ దక్కుతాయి . 

శుభం . 

#devikhadgamala

Tags: Sri devi khadgamala, khadgamala

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi