అన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికి

3.236.221.156

అన్నపూర్ణాదేవి తిరిగి వారణాశికి చేరడానికి 108 ఏళ్ళు పట్టింది . 
లక్ష్మీరమణ 
 
నవంబరు 15- 2021, సోమవారంతో అన్నపూర్ణ మాత సుదీర్ఘ  ప్రయాణం ముగిసింది. కాశీ నుంచి కెనడాకు తీసుకెళ్లిన విగ్రహాన్ని 108 ఏళ్ల తర్వాత మళ్లీ కాశీకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ విదేశీ యాత్రలో అమ్మ , విశ్వనాధుని వీడి 108 ఏళ్ళు ఎందుకు గడిపిందో, ఆ విశ్వైకచక్రవర్తికి తెలియాలి. కానీ ఇందులో భారతీయుల స్వయంకృతాపరాధం కూడా ఉందన్నది అంగీకరించాల్సిన సత్యం . 
 
కాశీ క్షేతం మహా పుణ్యమైన భూమి. ఈ భూమిమీదే, వారణాశిని మించిన పుణ్యస్థలి మరొకటిలేదు .  ఆ విశ్వేశ్వరుడు స్వయంగా కొలువైన క్షేత్రమే ఈ  కాశీ క్షేత్రం. ఒకప్పుడు కరువు ఈ ప్రపంచాన్ని పట్టి పీడించింది. ఆ సమయంలో విశ్వేశ్వరుడే భిక్షకుడై , భిక్షని యాచిస్తే, శక్తిమాత అన్నపూర్ణగా మారి భిక్షవేసిందట. అందుకే  ఈ క్షేత్రంలో అన్నానికి లోటుండదు . స్వయంగా అన్నపూర్ణ కొలువైన క్షేత్రం కదా మరి . 

ఇక విగ్రహ విషయానికొస్తే, 1913లో వారణాసికి మెకెంజీ అనే కెనడా చరిత్ర కారుడు పర్యాటకుడిగా వచ్చాడు . గంగానది ఒడ్డున ఉన్న ఆలయంలో ఈ అన్నపూర్ణ తల్లి విగ్రహాన్ని చూశాడు. మెకంజీ ఈ విగ్రహాన్ని ఇష్టపడ్డాడు. విగ్రహం కావాలని మెకంజీ తన గైడ్‌ను కోరినట్లు సమాచారం. అప్పుడు గైడ్ తల్లి అన్నపూర్ణ విగ్రహాన్ని దొంగిలించి, మెకంజీకి విక్రియంచాడు. అతడు ఈ విగ్రహాన్ని కెనడాకు తీసుకువెళ్లాడు.  1936లో ఇది మెకెంజీ ఆర్ట్ గ్యాలరీలో చేర్చారు. రెండేళ్ల క్రితం ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. 1913లో ఈ విగ్రహం కాశీ నుంచి అదృశ్యమైందని భారత ప్రభుత్వ కృషితో తిరిగి తీసుకురావచ్చని పరిశోధనలో తేలింది. 

కెనడాకు చెందిన రెజీనా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ తప్పును సరిదిద్దుతూ గత ఏడాది ఒట్టావాలోని భారత హైకమిషనర్ అజయ్ బిసారియాకు విగ్రహాన్ని అందజేశారు. ఈ విగ్రహం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASI కెనడా నుంచి తిరిగి తీసుకొచ్చారు. అక్టోబర్ 15 న ఈ విగ్రహం ఢిల్లీకి చేరుకుంది. 2014 నుంచి 2020 వరకు 41 వారసత్వ వస్తువులు, శిల్పాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. ఇది 75 శాతం కంటే ఎక్కువ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకారం కెనడాతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ నుంచి కూడా అనేక శిల్పాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి.
 
అయితే, చునార్ ఇసుకరాయితో చేసిన ఈ అన్నపూర్ణాదేవి శిల్పం చాలా ప్రత్యేకమైనది. ఇది18వ శతాబ్దానికి చెందినదని శిల్ప  నిపుణులు తెలిపారు. అంటే ఇది దాదాపు మూడు శతాబ్దాల నాటి విగ్రహం. దీని పొడవు 17 సెం.మీ, వెడల్పు 9 సెం.మీ.గా ఉంది . 

నవంబరు 10న ఢిల్లీ నుండీ  ఈ విగ్రహాన్ని శోభాయాత్ర చేయిస్తూ వారణాసికి తీసుకురావడం విశేషం .  ఉత్తరప్రదేశ్లోని 19 జిల్లలగుండా ఈ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. 
 
తప్పు తెలుసుకొని , స్వార్ధంతో చేసిన పనికి లెంపలేసుకొని అమ్మని తిరిగి  ఆహ్వానించిన భారతీయ బిడ్డలని , ఆ తల్లి చల్లగా కాచి రక్షించాలని , సస్యాలు మెండుగా, గాదెలు నిండగా పండేలా అనుగ్రహించాలని కోరుకుందాం . 

Quote of the day

Bondage is of the mind; freedom too is of the mind. If you say 'I am a free soul. I am a son of God who can bind me' free you shall be.…

__________Ramakrishna