సప్తమాతృకలు

54.174.225.82

విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహాశక్తులు- సప్తమాతృకలు . 
లక్ష్మీ రమణ  

సృష్టి చాలకుడు పరమాత్మ అయితే, అయన చాలన శక్తి ఆ పరమేశ్వరి . పురుష రూపంలో ఆమె బ్రహ్మ , విష్ణు , మహేశ్వర , ఇంద్రాది రూపాలను పొందితే, వారి శక్తి స్వరూపమైన దేవి సప్తమాతృకలుగా ఆవిర్భవించింది . నిజానికి  సర్వదేవతలూ ఈ శక్తి స్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.శుంభునిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో, భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణించింది.

బ్రహ్మలోని శక్తి 'బ్రాహ్మి', 2. విష్ణుశక్తి 'వైష్ణవి', 3. మహేశ్వరుని శక్తి 'మహేశ్వరి', 4. స్కందుని శక్తి 'కౌమారి', 5. యజ్ఞ వరాహస్వామి శక్తి 'వారాహి', 6. ఇంద్రుని శక్తి (ఐంద్రి), 7. అమ్మవారి భ్రూమధ్యం (కనుబొమల ముడి) నుంచి ఆవిర్భవించిన కాలశక్తి 'కాళి' (చాముణ్డా). -వీరినే  'సప్త మాతృకలు' అంటారు. ఈ శక్తులు విశ్వాన్ని నిర్వహించే ఏడు రకాల మహా శక్తులు.

ఆధ్యాత్మిక సాధనలోని పురోగతి క్రమంలో మనలో జాగృతమయ్యే శివ శక్తులు వీరు.  నిజానికి ఒకే శక్తి అయినా పరమేశ్వరి తాలూకు వివిధ వ్యక్తీకరణలే ఈ సప్తమాతృకలు అని చెప్పొచ్చు .

1. బ్రాహ్మణి: ఈ మాతృమూర్తి  బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి. అనంతాకాశంలో, హృదయాకాశంలో అవ్యక్తనాదంగా ఉన్న శక్తి బ్రాహ్మి. కంఠాది ఉపాధులతో ఈ నాదమే స్వర, అక్షరాలుగా శబ్దరూపంగా వ్యక్తమవుతుంది. సర్వ శాస్త్ర జ్ఞానాలకు మూలమైన ఈ శబ్ద స్వరూపిణిని ఉపాసించడం జ్ఞానదాయకం.

2. వైష్ణవి: విష్ణుశక్తి. శ్రీ మాహావిష్ణువు లాగానే ఈవిడ గరుడవాహనాన్ని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.విశ్వమందంతటా తేజస్తరంగాలుగా వ్యాపించి అన్ని వస్తువులను ప్రకాశింపజేసే అద్భుత శక్తి, స్థితికారక శక్తి ఈ తల్లి.

3. మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత. ప్రతివారి హృదయంలో 'అహం' (నేను) అనే స్ఫురణ వ్యక్తమయ్యే అంతర్యామి చైతన్యమే మహేశ్వరి. 'సర్వ భూత హృదయాల్లో ఈశ్వరుడే, శరీరాది ఉపాధులను కదిలిస్తున్నాడు' అని భగవద్గీత 18వ అధ్యాయం 61వ శ్లోకం ఈ భావాన్నే చెబుతున్నది.

4. కౌమారి: కుమారస్వామి శక్తి. శక్తి (బల్లెం) ని ఆయుధంగా ధరించిన దేవి . మయూర వాహనారూఢ. సాధన ద్వారా శుద్ధమైన అంతఃకరణంలో శుద్ధ సత్యాన్ని ప్రకాశింపజేసే జ్ఞానశక్తి కౌమారి.

5. వారాహి: హరి అవరారమైన యజ్ఞవరహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.ఈ యజ్ఞ వరాహశక్తి అన్న ప్రదాయిని. చేతిలో ధరించిన నాగలి, రోకలి ఆయుధాలు అన్నోత్పత్తినీ, అన్నపరిణామాన్నీ (మార్పునీ) తెలియజేసే సంకేతాలు. దేవతలకు హవ్యాన్నీ, మానవాది జీవులకు యోగ్యమైన అన్నాలను అందించే ఆహార శక్తి.

6.ఐంద్రీ: ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ. జగద్రక్షణకు కావలసిన వీరత్వం, దుష్టులను సంహరించే ప్రతాపం ఈ శక్తి. బలానికి సంకేతంగా వజ్రాయుధాన్ని ధరించే శక్తి.

 7. చాముండి : మహాకాళీ స్వరూపం ఈ దేవి . కథ ప్రకారం- రక్తబీజుడనే రాక్షసుని దేవి సంహరించేటప్పుడు, స్రవించే ప్రతి రక్తకణం నుంచి ఎందరో రాక్షసులు ఉత్పన్నమవుతుంటే, 'చాముణ్డా' దేవి తన నాలికతో ఈ రక్తాన్ని పానం చేసింది. అప్పుడు ఆ అసురుడు హతమారిపోయాడు.

విషయ లంపటానికి సంకేతం రక్తబీజుడు. రకరకాల కామసంకల్పాలే రక్తకణాలు. వీటి నుంచి ఉత్పన్నమయ్యే బాధాకర, అజ్ఞానశక్తులే అసురులు. వాటిని నిర్మూలించే సమాధిస్థితిలోని దివ్య చైతన్యం 'చాముణ్డా దేవి '.

ఏకం పరబ్రహ్మ తత్వం. అనేకం ప్రపంచ స్వరూపం. ఈ అనేకమే 'చమూ' (సేనలు). ఈ అనేకత్వం నుంచి ఏకత్వ స్థితిని చేరుకోవడమే సమాధి. దీనినే 'చాముణ్డా' అని సంకేతించారు. చండ, ముండ- అనే దనుజుల్ని సంహరించినందుకు 'చాముణ్డా'- అన్నారని మరో కథనం. యోగపరంగా చూస్తే- మూలాధారం నుంచి గ్రంథిని భేదించడం చండాసుర సంహారం. సహస్రార కమలంలో ప్రవేశించేటప్పుడు జరిగే భేదనం ముండాసుర సంహారం.

- ఈ విధమైన తాత్విక, యోగదర్శనాన్ని కావ్యకంఠ గణపతి ముని సంభావించారు (ఉమా సహస్రం).
మొత్తంగా పరిశీలిస్తే- 1.విశ్వాన్ని నడిపే శక్తులు, 2.యోగసాధనవల్ల మనలో మేల్కొనే దివ్యశక్తులు- వీటినే విభిన్న శక్తిరూపాలుగా పురాణాదులు ఆవిష్కరించాయని ఈ సప్తమాతృకల రూప గుణ విశేషాలు మనకి స్పష్టం చేస్తాయి . 
 
ఇలా ‘సర్వం శక్తిమయం’ అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya