Online Puja Services

శ్రీ దేవీ భాగవతం మహత్యం

18.218.169.50

శ్రీ దేవీ భాగవతం మహత్యం 

పూర్వకాలంలో ఒకప్పుడు అగస్త్యుడు లోపాముద్రతో కలిసి కైలాసానికి వెళ్ళి కుమారస్వామిని అభ్యర్థించి కథలూ గాథలూ అనేకం తెలుసుకున్నాడు. తీర్థ - దాన - వ్రతమాహాత్మ్యాలు ఎన్నో షణ్ముఖుడు చెప్పగా విని ఆ వృద్ధదంపతులు ఎంతగానో ఆనందించారు. అయినా తృప్తి కలగలేదు. లోకహితం కోరి దేవీ భాగవతం గురించీ దాని మహిమగురించి చెప్పమని అడిగారు. త్రిలోకజనని ఆ పురాణంలో కీర్తింపబడిందిటగదా, మాకు తెలియజెప్పవా అని అభ్యర్థించారు. స్కందుడు ఆరంభించాడు. 

-కుంభసంభవా ! భాగవతమాహాత్మ్యాన్ని విస్తరించి చెప్పాలంటే ఎవరివల్లా అయ్యేపనికాదు. నువ్వు అడిగావు కనక క్లుప్తంగా చెబుతాను. సచ్చిదానందరూపిణి జగదంబిక భుక్తిముక్తి ప్రదాయినిగా సాక్షాత్కరించేది దేవీ భాగవతంలోనే. అంచేత దేవీ భాగవతం అంటే దేవీ వాజ్మయరూపం. దీని పఠనశ్రవణాలకు దుర్లభమైనది ఏదీ ఈ సృష్టిలో లేదు. 

-వెనకటికి వివస్వంతుని కొడుకు శ్రాద్ధదేవుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి ఎంతకాలానికీ పిల్లలు కలగలేదు. మగబిడ్డ కలగాలని ఆకాంక్షించి వసిష్ఠులవారి అనుమతితో ఒక ఇష్టిని (పుత్రకామేష్టి) నిర్వహించాడు. అతడి భార్య శ్రద్ధాదేవి, తనకు ఆడపిల్ల కావాలనీ ఆ విధంగా హోమం నిర్వహించమనీఅభ్యర్థించింది. హోత అలాగే హోమం చేశాడు. ఇష్టి పూర్తి అయ్యింది - కొంతకాలానికి శ్రద్ధాదేవి గర్భం ధరించింది. ఆడపిల్లను ప్రసవించింది. ఇలాదేవి అని పేరు పెట్టారు. కానీ మహారాజు మనస్సు కలుక్కుమంది. మగపిల్లవాడు కావాలని సంకల్పించి ఇష్టిని నిర్వహిస్తే ఆడపిల్ల పుట్టిందేమిటి ? గురూత్తమా ! ఈ సంకల్పవైషమ్యం ఎలా జరిగింది ? అని వసిష్ఠులవారిని అడిగాడు. వ్యతిక్రమం ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో చెప్పి, ఇలాదేవి మగవాడుగా మారాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థించమని సలహా చెప్పాడు వసిష్ఠుడు. శ్రాద్ధదేవుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివానుగ్రహమూ గురువు అనుగ్రహమూ కలిసి ఇలాదేవి పురుషుడుగా మారిపోయింది. సుద్యుమ్నుడు అని అప్పుడు మళ్ళీ నామకరణం చేశారు. ఆ రాకుమారుడు సకలవిద్యలకూ సముద్రుడయ్యాడు. యౌవనంలోకి అడుగు పెట్టాడు. ఒకనాడు వేటకోసం ఒక మహావనంలోకి అడుగు పెట్టాడు. పరివారంతో కలిసి రథారూఢుడై అడవినుంచి అడవికి పయనిస్తున్నాడు. మేరుపర్వతానికి చేరువలో ఉన్న ఒక వనం చేరుకున్నాడు.

ఆ వనానికి ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు శివపార్వతులు అక్కడ క్రీడిస్తూండగా శివదర్శనలాలసులైన మునులు తెలియక హఠాత్తుగా ప్రవేశించారు. పార్వతి సిగ్గుపడింది. అది గ్రహించిన మునులు వెంటనే వెళ్ళిపోయి శ్రీహరిని శరణు వేడుకున్నారు. కానీ పార్వతిని సముదాయించడం కోసం శివుడు ఆ వనానికి ఒక శాపం ఇచ్చాడు. ఈ రోజునుంచీ ఈ వనంలోకి ప్రవేశించిన పురుషులెవరైనాసరే స్త్రీలుగా మారిపోతారు అని కట్టడి చేశాడు. ఈ వృత్తాంతం తెలిసిన పురుషులెవరూ ఆ వనం దరిదాపులకైనా వెళ్ళరు.

మన సుద్యుమ్నుడికి ఈ విషయం తెలియక ప్రవేశించాడు. ప్రవేశించడమేమిటి తానూ తన తోటివారూ అందరూ స్త్రీలుగా మారిపోయారు. మగ గుర్రాలు కూడా ఆడ గుర్రాలైపోయాయి. కారణం తెలియక నివ్వెరపోయారు. చేసేదిలేక అలాగే ఆ అరణ్యాల్లో సంచరించారు. సంచరిస్తూ సంచరిస్తూ బుధుడి ఆశ్రమం చేరుకున్నారు. ఈ సుందరాంగిని చూసి బుధుడు మరులుకొన్నాడు. ఎవరీ అందగతె ? ఉన్నత పయోధరాలు. దొండపండుల్లాంటి పెదవులు. మల్లెమొగ్గల్లాంటి పలువరుస. చంద్రబింబంలాంటి వదనం. పద్మాల్లాంటి కన్నులు. బుధుడికి మనసయ్యింది. ఆ సుందరాంగి కూడా బుధుణ్ణి చూసి అలాగే మన్మథభావాలకు లోనయ్యింది. చంద్రుడిలా ఉన్నాడు ఎవరబ్బా ఈ అందగాడు అనుకొంది. చూపులు కలిశాయి. మనసులు కలిశాయి. తనువులూ కలిశాయి. ఆ సోమనందనుడి ఆశ్రమంలో కామసుఖాలు అనుభవిస్తూ చాలాకాలం ఉండిపోయింది. గర్భవతి అయ్యింది. పురూరవసుడికి జన్మనిచ్చింది. కొంతకాలం గడిచింది. ఒకనాడు తన పూర్వరూపం, తన రాజ్యం తల్లిదండ్రులు అన్నీ జ్ఞాపకం వచ్చి దుఃఖించి దుఃఖించి, ఇంక ఆ ఆశ్రమంలో ఉండలేక వెళ్ళిపోయింది. వెతుక్కుంటూ వెళ్ళి వసిష్ఠుడి ఆశ్రమం చేరుకుంది. తమ కులగురువును చూడటంతోనే దుఃఖం పొంగి వచ్చింది. కాళ్ళమీద పడి వలవలా విలపించింది. మళ్ళీ పురుషత్వం వచ్చేట్టు అనుగ్రహించమని ప్రార్థించింది.

వసిష్ఠుడు మంత్రశక్తితో జరిగిన వృత్తాంతమంతా తెలుసుకున్నాడు. కైలాసానికి వెళ్ళాడు. శివుణ్ణి అర్చించి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఉబ్బులింగడుగదా అని భక్తిభావంతో స్తుతించాడు.

నమో నమః శివాయాస్తు శంకరాయ కపర్దినే | గిరిజారాంగదేహాయ నమస్తే చంద్రమౌళయే || 

మృడా ! కైలాసవాసీ ! నీలకంరా ! భుక్తి ముక్తి ప్రదాయకా ! శివరూపా ! శివా ! ప్రపన్నభయహారీ ! వృషభవాహనా ! శరణ్యా ! పరమాత్మా ! త్రిమూర్తి స్వరూపా ! దేవాధిదేవా ! వరదా ! పురారీ! యజ్ఞరూపా! యజ్ఞఫలదా ! గంగాధరా ! సూర్యేందువహ్నిలోచనా ! నమో నమః. నమో నమః.

బోళాశంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వృషభవాహనం మీద పార్వతీసమేతుడై దర్శనం అనుగ్రహించాడు. వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా జన్మించి మగపిల్లవాడుగా మారి, ఇప్పుడు మళ్ళీ స్త్రీత్వం పొందిన ఇలాదేవికి (సుద్యుమ్నుడు) తిరిగి పురుషత్వం ప్రసాదించమని వసిష్ఠుడు అభ్యర్థించాడు. శివుడు ఆమోదించాడు. ఒకనెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉంటుందని అభ్యనుజ్ఞ ఇచ్చి శివుడు అంతర్జానం చెందాడు. వసిష్ఠుడు అంతటితో సంతృప్తి చెందక జగదీశ్వరిని స్తుతించాడు.

జయ దేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి | జయ సర్వసురారాధ్యే జయానంతగుణాలయే || 

శరణాగతవత్సలా ! దుర్గా ! దేవేశీ ! దుఃఖహంత్రీ ! దుష్టదైత్యనిషూదినీ ! భక్తిగమ్యా ! మహామాయా! జగదంబికా ! సంసారసాగరోతారపోతీభూతపదాంబుజా ! త్రిమూర్తి సంసేవితా ! చతుర్వర్గ ప్రదాయినీ ! నిన్ను స్తుతించాలంటే సమర్థుడెవడు ? కేవలం భక్తితో నమస్కరించడం తప్ప.

వసిష్ఠుడి స్తోత్రానికి జగదీశ్వరి ప్రసన్నురాలయ్యింది. సుద్యుమ్నుడి మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను అర్చించు. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన దేవీ భాగవతాన్ని నవాహోనియమంతో అతడికి వినిపించు. అది ముగిసేసరికి తిరిగి పుంస్త్వం పొందుతాడు - అని ఆజ్ఞాపించింది.

వసిష్ఠుడు సంబరపడ్డాడు. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. దేవి ఆజ్ఞను వివరించాడు. ఆశ్వయుజ శుక్ల పక్షంలో దేవిని ఆరాధింపజేసి భాగవతం తానే పురాణ శ్రవణం చేయించాడు. సుద్యుమ్నుడు భక్తిగా విన్నాడు. వినిపించిన వసిష్ఠుడిని అర్చించాడు. వెంటనే పురుషత్వం పొందాడు. రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజారంజకంగా పరిపాలన సాగించాడు. భూరి దక్షిణలతో దేవీ యజ్ఞాలు అనేకం నిర్వహించాడు. పుత్రుల్ని పొందాడు. వారికి రాజ్యం అప్పగించి తాను తపస్సులు చేసుకుని దేవీసాలోక్యం చెందాడు.

అగస్త్యా ! దేవీ భాగవతమహిమ అంతటిది. చదివినవారికీ విన్నవారికీ సకలవాంఛాప్రదం. ఇహపరాలకు సాధకం - అని చెప్పి కుమారస్వామి ఇతిహాసాన్ని ముగించాడు.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore