Online Puja Services

శ్రీ కనక దుర్గా మహత్యము

18.216.34.146

శ్రీ కనక దుర్గా మహత్యము 

క్రీ|| శ|| 5, 6వ శతాబ్ద ప్రాంతంలో విజయవాటికను మాధవవర్మ పాలించేవాడు. ఆ కాలంలో చిన్న చిన్న సంస్థానాలు ఎన్నో వుండేవి అప్పటికింకా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడలేదు.

 మాధవవర్మ ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తూ ధర్మబద్ధంగా పరిపాలన సాగించేవాడు. ఆయన దుర్గమ్మని తమ కులదేవతగా ఆరాధించేవాడు. ఆయన తరుచుగా అరణ్యమార్గం ద్వారా ఇంద్రకీలాద్రిని చేరుకుని అమ్మవారికి పూజాదికాలు జరిపిస్తుండేవాడు.

ఆనాటి ప్రజలు అమ్మవారిని గ్రామదేవతగా భావించి ఆరాధిస్తుండేవారు. అయితే అమ్మవారు రాత్రివేళల్లో తన మందిరాన్ని వదిలి, కొండదిగి వచ్చి గ్రామసంచారం చేస్తూ అర్ధరాత్రి దాటాక తిరిగి కొండకి తిరిగి వెళ్తుందని ప్రజలూ, ప్రభువూ నమ్మేవారు. అప్పట్లో వారి నమ్మకాలకి అనేక నిదర్శనాలు కూడా జరిగాయి. ఈ మన అందుచేత స్థానిక ప్రజలు పగటిపూట మాత్రమే కొండెక్కి అమ్మవారిని దర్శించుకునేవారు. పూజారికూడా చీకటి పడకముందే అర్చనలు ముగించుకుని కొండదిగి ఊళ్లోకి వచ్చేసేవాడు. ఆటవిక జాతులవారు ఎక్కువగా అమ్మని దర్శించుకుంటుండేవారు. .
మాధవవర్మకి చాలాకాలం వరకూ సంతానం కలగలేదు. ఆయన నిత్యం తన భవనంలో అమ్మవారిని పూజిస్తూ తనకి సంతానం ప్రసాదించమని ప్రార్థించేవాడు. ఆయన ప్రార్థనలు ఫలించి ఒక రాత్రి అమ్మవారు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చింది.

“నాయనా.... నేను వశిస్తున్న ఇంద్రకీలాద్రి దుర్భేద్యమైనది. పవిత్రమైనది. అయినా నా భక్తులు నన్ను దర్శించుకోడానికి కనీస వసతి సౌకర్యాలు కూడా లేవు. ఈ సంస్థానాన్ని పాలిస్తున్న ప్రభువుగా ఆ ఏర్పాట్లు చేయించు. నీకు వంశాంకురాన్ని ప్రసాదిస్తాను” అని స్వప్నంలో రాజుకి తెలియజేసింది దుర్గమ్మ.

మాధవవర్మ చాలా ఆనందించాడు. తనకున్నపాటి వనరులతో కొండకి మెట్ల మార్గాన్ని నిర్మించాడు. అమ్మవారి విగ్రహం పైన చిన్న ఆలయాన్ని, దాని ముందొక మంటపాన్ని కట్టించాడు. అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యానికి గాను ఈనాములు ఏర్పాటు చేయించాడు. సామాన్య ప్రజానీకం అమ్మవారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు. అమ్మవారు కనికరించింది. మాధవవర్మకి సలక్షణమైన కుమారుడు జన్మించాడు. ప్రజలూ, ప్రభువు ఎంతో ఆనందించి అమ్మవారికి ప్రత్యేకపూజలూ, అర్చనలూ చేశారు.

యువరాజు క్రమక్రమంగా యుక్తవయస్కుడయ్యాడు. అతడూ అమ్మవారి భక్తుడే. అలా తండ్రీ కొడుకూ నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఉండేవారు మాధవవర్మ న్యాయమూ, ధర్మమూ తన రెండు కళ్లుగా భావిస్తే, యువరాజు న్యాయధర్మ పరిరక్షణలో తండ్రిని మించిన తనయుడిలా కనిచాడు. యువరాజు రాజ్యాధికారం చేపడితే అలనాటి శ్రీరామచంద్రుడిలా రామరాజ్యం వస్తుందని ప్రజలు చెప్పుకునేవారు. తన మీద ప్రజలకి వున్న నమ్మకం, ప్రేమా చూసి మాధవవర్మ మిక్కిలి సంతోషించేవాడు. అలాంటి సుపుత్రుడిని తమకి ప్రసాదించిన అమ్మవారికి నిత్యం కృతజ్ఞతలు చెప్పుకునేవాడు రాజు. ఇలా కాలం ఆనందంగా సాగుతుండగా విధి బలవత్తరమై ప్రజల్ని విషాదంలో ముంచే సంఘటన ఒకటి ఊహించని విధంగా జరిగిపోయింది.

ఒకరోజు ఒక పేదరాలు తన ఏడేళ్ల కొడుకుని వెంటబెట్టుకుని దుర్గమ్మకొండ సమీపంలో చింతచిగురు కోసుకోడానికి వెళ్లింది. ఆమె తన పనిలో నిమగ్నమై వుండగా కొడుకు ఆ ప్రక్కనే ఆడుకోసాగాడు. అంతలో సాయం సమయం కావచ్చింది. చీకటి పడితే అమ్మవారు కొండదిగి సంచారానికి వస్తుందనీ, ఆ సమయంలో ఆమెకంట పడ్డవాళ్లు నెత్తురు కక్కుకుని చస్తారని జనం చెప్పుకునేవారు. అందుచేత పేదరాలు గబగబా తన పని ముగించుకుని చీకటి పడకుండా తన ఇంటికి చేరుకోవాలన్న ఆరాటంలో కొడుకుని వెంటబెట్టుకుని వడివడిగా నడవసాగింది. తల్లికంటే ఆమె చెయ్యి వదిలించుకుని పరిగెత్తసాగాడు ఆ పసివాడు. "ఆగరా” అంటూ అరుస్తూ కొడుకుని మందలిస్తూ వెనుక ఉవసాగిందా పేదరాలు. అయితే ఆ పసివాడు తల్లి మాటలు వినిపించుకోకుండా దూకుడుగా ముందుకు పరిగెత్తి ఓ మలుపు తిరిగాడు.

సరిగ్గా అదే సమయంలో అదే మార్గాన వెనకనించి తన రథం అది వేగంగా దూసుకు వస్తున్నాడు యువరాజు.  ఆ బాలుడు ఆ రధం క్రింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.  ఆ తల్లి కొడుకు శవాన్ని చూసి గుండెలు అవిసేలా రోదిస్తూ , ఆ పిల్లవాడి శవాన్ని తీసుకొని రాజు వద్దకు వెళ్ళింది, న్యాయం చేయమని అడగటానికి .

 మాధవవర్మ ఆ బాలుడి శవాన్ని చూస్తూనే తీవ్రంగా కలతచెంది వివరమ్మా నువ్వు ? ఆ బాలుడెవరు ? ఏం జరిగింది ?” అనడిగాడు అనునయంగా.

ఘోరం జరిగింది మహారాజా... ఒకడు నా ఒక్కగానొక్క కన్నబిడ్డని దారుణంగా పొట్టన పెట్టుకున్నాడు.  నా కొడుకుని చంపి నన్ను అనాధని  చేశాడు ప్రభూ...” అంటూ దుఖంతో బావురుమంది ఆ తల్లి. సభకి చేరిన ఊరిజనం “బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లికి న్యాయం చెయ్యాలి.” అని అన్నారు.

మాధవవర్మ వాళ్లని ఉద్దేశిస్తూ “మా పాలనలో అధర్మానికి, అన్యాయానికి తావులేదు. ఈ బాధితురాలికి తప్పక న్యాయం జరిపిస్తాం.” అని సభకి హామీ యిచ్చి “ధైర్యంగా చెప్పమ్మా... నీ కుమారుడి మృతికి కారకుడెవరు ?” అని అడిగాడు.
"ఈ దారుణానికి ఒడిగట్టింది. ఎవరో నాకు తెలియదు ప్రభూ. ఎవరో రథం తోలుతు రాజప్రాసాదంవైపు వెళ్లారు” అని విన్నవించుకుంది.

మాధవవర్మ ఆమె చెప్పిన వివరాల ప్రకారము ఆ శిశువును చంపిన వారిని ఎక్కడ వున్నా బంధించి వెంటనే మరణదండన విధించమని ఆదేశించాడు.

ఆ తరువాత వేగుల ద్వారా ఆ శిశువుకి ప్రమాదం జరిగింది తన కొడుకు వల్లనేనని తెలిసికొని, ప్రజలకొక న్యాయం, ప్రభువులకొక న్యాయం లేదని వెంటనే శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు.

మంత్రులు, సామంతులు, ప్రజలు "ప్రభూ! మాకు అన్యాయం జరుగుతుంది. మీకు లేక లేక కలిగిన ఏకైక సంతానము. మా తరువాత భారం వహించేవారు ఎవ్వరూ లేరు. యువరాజుని క్షమించమని” అందరూ విన్నవించుకున్నారు.

కానీ మాధవవర్మ “అలా వీలులేదు. వెంటనే శిక్షను అమలు చేయమని” ఆజ్ఞాపించాడు. 

ఆ మర్నాడు సూర్యోదయ సమయంలో అశేష జనసమక్షంలో యువరాజుకి బహిరంగంగా మరణదండన అమలు జరిపించాడు మాదవవర్మ. అనంతరం అప్పుడు... ఒక్కసారిగా ఆకాశమంతటా తళతళ మెరుపులు తెరిశాయి. ఆ మెరుపుల మధ్యనించి కనకవర్షం కురవసాగింది. రాజూ, ' ప్రజలూ నిశ్చేష్టులై చూస్తుండగా నాలుగు ఘడియలపాటు కనకవర్షం కురిసింది.

ఆ బంగారం వర్షంలా కురవడానికి దుర్గమ్మే కారణమని గ్రహించిన మాధవవర్మ "తల్లీ..... దుర్గమ్మా... నీ లీలలు తెల్సుకోవడం మా వంటి సామాన్యులకు ఎలా సాధ్యం ? నువ్వు ప్రసాదించిన నా కుమారుడిని నువ్వే తీసుకున్నావు. ఇప్పుడేమో అపార కరుణా దృష్టి కురిపించావు. ఏమిటమ్మా నీ లీలలు ?” అని ప్రార్థించాడు.

అప్పుడు అంతరిక్షం నుండి “రాజా... నీ ధర్మనిరతికి మెచ్చి కనకవర్షం కురిపించాను. నీ భక్తికి మెచ్చి నీ కుమారుడికీ, ఆ పేదరాలి కుమారుడికీ ప్రాణదానం చేస్తున్నాను. మీరూ నా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లండి” అని దేవ వాక్కు వినిపించింది. యువరాజూ, ఆ బాలుడూ నిద్రలోంచి లేచిన వాళ్లలా మేలుకున్నారు.

 "తల్లీ... దుర్గ .... కనకవర్షం కురిపించి మా పాలిట కనకదుర్గ అయ్యావు.  నీ  కరుణా కటాకంతో విజయవాటికను కనకవాడగా సూర్చావు. జేజేలు తల్లీ.. జేజేలు...” అని ప్రార్థించారు. రాజు, ప్రజలు. "

ఆ విధంగా, దుర్గాదేవి, ఆనాటినించీ 'కనకదుర్గ' అయింది. అయితే ములవిరాట్ స్వరూపం మాత్రం 'మహిషాసుర మర్ధిని' అవతారంగా వుండి ఉగ్రరూపంతో భీతి గొలుపుతూ వుండేది. కాలక్రమంలో జగద్గురు ఆది శంకరాచార్యులవారు దేశాటన చేస్తూ 'విజయవాటిక'కి వచ్చారు. పవిత్ర నదిలో స్నానమాచరించి ఇంద్రకీలాద్రిని చేరి కనకదురమని దర్శించుకున్నారు.

శివుని వరప్రసాది అయిన శంకరులవారు ఉగ్రరూపిణి అయిన 'మహిషాసుర మర్ధిని' మూర్తిని గాంచి విస్మయం చెందారు. 'లోకాలను చల్లని చూపులతో కాపాడి కటాక్షించవల్సిన తల్లి తన బిడ్డలని భయపెట్టేలా' ఉగ్రరూపంతో వెలసివుండటంలోని ఆంతర్యం ఏమిటోనని వారు తమ దివ్యదృష్టితో చూసి మహిషాసుర సంహారం అనంతర వృత్తాంతం గ్రహించారు. ఆ శ్రీ శంకరాచార్యులవారు, పవిత్ర కృష్ణవేణీ జలాలతో శ్రీ సూక్త విధానంగా దేవిని అభిషేకించి, ఇంద్రకీలాద్రి పైనున్న వృక్షాల నుండి శ్రీ గంధ చందనాలతో ఆ అమ్మవారికిమయి పూతనాలుపూసి, పలు పుష్పాలతో అర్చించి, నారికేళ, కదళీ ఫలాలను నివేదనగా సమర్పించి....

అరణ్యేరణే దారుణే శతృమధ్యే నలే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేవా గతిర్దేవి నిస్తార నౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ||

అని అమ్మని కీర్తించారు. మహిషాసుర మర్దనిగా ఉగ్రమూర్తిగా వున్న మూలవిరాట్ స్వరూపాన్ని శాంతింపచెయ్యడానికి, శాంతియంత్రాన్ని ప్రతిష్టించారు. ఇలా శంకరులవారిచే శ్రీ చక్రం ప్రతిష్ట జరిగినందునే అమ్మవారు నేటి రాజరాజేశ్వరీ రూపంలో కనకదుర్గగా ఆనాటినించి దర్శనమిస్తుంది. శంకరులవారే పసుపుచందనాలతో అమ్మ ముఖరూపాన్ని తీర్చిదిద్ది, సమయాచార పూజావిధాన పద్ధతి ఆరంభించారు.

అదేవిధంగా..

శంకరాచార్యులవారు తమ దివ్యదృష్టి చేత ఇంద్రకీలాద్రి పై అదృశ్యంగా వున్న 'బ్రహ్మ ప్రతిష్టిత శివలింగాన్ని గుర్తించి ప్రార్థించి, ఆ లింగమును వెలికితీసి పునఃప్రతిష్ట చేసి మల్లికా పుష్పాలతో శివుని పూజించారు. మల్లెపూలతో పూజలందుకొనడంచేత శివునికి 'మల్లేశ్వరుడు' అన్న పేరు వచ్చింది. అమ్మవారికీ, అయ్యవారికి కళ్యాణం జరపడంచేత వారిని శ్రీ కనకదుర్గా మల్లేశ్వరులు అని కీర్తించడం సాంప్రదాయమైంది.

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya