Online Puja Services

మహాస్వామి గారిచే శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం.

3.17.68.14

శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం


దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. దీన్ని మనకు అందించినది పరమాచార్య స్వామి వారు. ఆ స్తోత్రం ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథను చూద్దాం. అది తేనంబాక్కంలో మహాస్వామి వారు మకాం చేస్తున్న కాలం. అప్పుడు మధ్యాహ్నం 2 గంటల సమయం. మహాస్వామి వారు ఒక కాలును నీటిలో ఉంచి చెరువు గట్టు పైన కూర్చుని ఉన్నారు. మహాస్వామి వారు చప్పట్లు చరచి నన్ను రమ్మని ఆజ్ఞాపించారు. ఒక కాగితం కలం తీసుకుని తన ప్రక్కన కూర్చో అని సైగ చేసి చెప్పారు. నేను వాటిని తీసుకుని వచ్చి వారి వద్ద కూర్చున్నాను. మహాస్వామి వారు ఒక్కొక్కటిగా సంస్కృత పదాలను చెప్పడం ప్రారంభించారు. ఒక్కొక్క సందర్భంలో ఒక భావాన్ని చెప్పి దానికి సరియగు సంస్కృత పదం చెప్పమనేవారు. 

అలా అన్ని పదములు జతకూడిన తరువాత ఒక మహత్తరమైన స్తోత్రం వచ్చింది. 

అదే *శ్రీదుర్గా పంచరత్నం* 

(శ్వేతాశ్వర ఉపనిషత్ సారము). ప్రతి శ్లోకము యొక్క చివరి పాదము “మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి ” అనే మకుటంతో ముగుస్తుంది. (ఈ శ్లోకాన్ని మనం కామాక్షి ఆలయ ముఖద్వారానికి ఎడమ ప్రక్కన ఉన్న గోడపై పాలరాతి శిలపైన చెక్కి ఉండటం గమనించవచ్చు)

మహాస్వామి వారు ఈ స్తోత్రం చేస్తూ మధ్యలో “నీవే భగవద్గీతను బోధించిన దానివి” అని వచ్చింది. ఒక్క క్షణం ఇటుతిరిగి అలోచిస్తున్న శిష్యులు వైపు చూసి, మహాస్వామి వారు “కామాక్షి గీతోపదేశం చేసింది అనునది నీకు ఎందుకు తప్పు అని అనిపిస్తోంది” అని అడిగారు. నేను చిన్నగా నవ్వి మౌనం వహించాను. 

వెంటనే వారు గీతాభాష్యం పుస్తకం తీసుకురమ్మని చేతులతో సైగ చేసి ఆదేశించారు. వెనువెంటనే 8 సంపుటముల గీతాభాష్యం స్వామి వారి వద్దకు వచ్చి చేరింది. వారు ఒక పుస్తకమును తీసుకుని దాన్ని తెరిచి అక్కడ తెరవబడి ఉన్న పుటములో ఒక శ్లోకమును దాని భాష్యమును చదవమన్నారు. 

ఆ శ్లోకం ఇదే *“బ్రహ్మణోహి ప్రతిష్ఠాహమ్”*

*“మార్పులేని శాశ్వతమైన బ్రహ్మానికి, శక్తి రూపమైన మాయ ప్రతిష్ఠ. అది నేను. నేను బ్రహ్మాన్ని మరియు దాని ప్రతిష్ఠను అనునది సరియగును. ఎందుకంటే దానికి భాష్యం “శక్తి శక్తిమతోః అభేదత్” అని ఉంది. శక్తి మరియు ఆ శక్తి కలిగిన వారు వేరు వేరు తత్వము కాదు. శక్తికి ఆ శక్తి ఉన్నవాడికి అభేదము.”*

ఈ సంఘటన ఆ స్తోత్రం యొక్క విశిష్టతని తెలియజేస్తుంది.

*||శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం ||*

*1.తే ధ్యాన యోగానుగా తాపస్యన్*
*త్వామేవ దేవీం* *స్వగుణైర్నిగూడాం*  
*త్వమేవ శక్తిహి పరమేశ్వరస్య* 
*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*

ఓ సర్వాధిష్ఠానేశ్వరీ! ఓ మోక్షప్రదాత్రీ! నిరంతరము ధ్యానయోగమునందు మునులు యోగులు మున్నగువారు సత్వరజస్తమో గుణములచే వ్యక్తముకాకుండ గానున్న సకలదేవతాస్వరూపిణియగు నిన్నే చూచుచున్నారు. ఆ పరమేశ్వరునియొక్క శక్తివి కూడా నీవే. నన్ను రక్షించు.

*2.దేవాత్మ శక్తీహీ శ్రుతివాక్య గీత*
*మహర్షిలోకస్య పుర:* 
*ప్రసన్న*
*గుహపరం వ్యోమ సద ప్రతిష్ఠ*
*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*

ఓ సర్వేశ్వరీ! మోక్షధాత్రి ! నీవు దివ్యమగు ఆత్మశక్తిని, వేదవాక్యములచే గానముచేయబడితివి. మహర్షిలోకమును ముందుగా అనుగ్రహించితివి. అత్యంతనిగూఢమగు నివాసము నీది. సత్పదార్థమునకు అధిష్ఠానము నీవు. నన్ను రక్షించు.

*3.పరాస్యశక్తిహీ వివిధైవ శ్రూవ్యసే*
*శ్వేతాశ్వ వాక్యోదిత* *దేవీ దుర్గే*
*స్వాభావికీ జ్ఞాన బలక్రియార్తే*
*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*

ఓ దుర్గా! శ్వేతాశ్వతరోపనిషద్వాక్యములచే చెప్పబడిన దివ్యరూపిణీ, నీవు పరాశక్తివి. అయినను అనేకులచే అనేకవిధములుగా చెప్పబడగా వివిధరూపములుగా వినబడుచునావు. నీయొక్క జ్ఞాన, బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు. 

*4.దేవాత్మ శబ్దేన శివాత్మ భూత*
*యత్కూర్మ వాయవ్య వచో వివృత్య*
*త్వంపాశ విఛ్చేద కరి ప్రసిద్ద్హ*
*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*

దేవాత్మశబ్దముచే చెప్పబడు నీవు, కూర్మ వాయుపురాణముల వాక్యవివరణచే శివాత్మురాలివైతివి. నీవు ఈ భవపాశములను ఛేదింపగలిగినదానిగా ప్రసిధ్ధురాలవు. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.

*5.త్వం బ్రహ్మ పుచ్చా వివిధా మయూరీ* 
*బ్రహ్మ ప్రతిష్ఠాసి ఉపతిష్ట గీత* 
*జ్ఞాన స్వరుపాత్మ* *దయఖిలానాం
*మాం పాహి సర్వేశ్వరీ మోక్షధాత్రి !!*

అమ్మా, నీవు బ్రహ్మమే పుచ్చముగాగల వివిధరూపములనుండు మయూరివి బ్రహ్మమునకు అధిష్టానమైనదానివి. అనేక గీతలను ఉపదేశించిన దానవు. అందరిలోనుండు జ్ఞాన స్వరూపము నీవే. అందరిలోని దయాస్వరూపము నీవే. ఓ సర్వేశ్వరీ! మోక్షప్రధాత్రి ! నన్ను రక్షించు.

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.
(సేకరణ)

శ్రీ రాధా లక్ష్మి

 

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi