గోపికల అందెల రవళి, మాధవుని మురళి వినిపిస్తుంటుంది.

54.173.214.227

ఇప్పటికీ ఇక్కడ నుండి గోపికల అందెల రవళి, మాధవుని మురళి వినిపిస్తుంటుంది. -నిధివన్
-లక్ష్మీ రమణ 

రాధామాధవుల ప్రేమ, ప్రణయం సామాన్యులకి ఎప్పుడూ ఒక అంతుచిక్కని రహస్యమే ! మధువనిలో ఆయన పిల్లనగ్రోవిని ఊడితే , ప్రకృతే గోపికలై ఆడి పరవశిస్తుంది. ఇది అక్షరాలా నిజమని నమ్మాలంటే మనం మధురలోని నిధివన్ కి వెళ్ళాలి. ఇక్కడ ఇప్పటికీ ఆ మోహన మురళి వినపడుతుంది. దానికి గోపికల అందెల రవళి జతకలుస్తుంది. ఈ వింత ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ ఒక అంతచిక్కని రహస్యంగానే ఉండిపోయింది. రండి మధువనికి పోయొద్దాం . 

‘కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలం
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో!’ 

అని తేట తెలుగులో కవి పోతన భాగవతంలో గజేంద్రుని నోట పలికిస్తారు . ఒక పక్కన సంసారమనే మొసలి పట్టి లాగుతోంది. ఈదలేని ఇహలోకం బాధిస్తోంది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని తెలుస్తోంది . అయినా నమ్మకం స్థిరంగా నిలబడదే ! ఆ పరంధాముడు కలడు కలడు అనే వారేగానీ , కలడా లేడా ? సంశయం సమసిపోనిదే, నివురు ఎగిరిపోనిదే, జ్ఞానం ప్రకాశించేదెలా ? ఆ చక్రి ఉన్నాడో, లేదో తెలిసేదెలా ? మనందరం ఆ గజేంద్రునికి అచ్చంగా అప్ప , చెల్లెళ్లమేగా !! మనకీ  సమాధానం కావాల్సిందే ! అందుకే పదండి ఆ మధువనికి పోదాం .  

రాధ అంటే మాధవునికి ఎంతో ప్రీతి. అది యవ్వన మధువని కాదు , ఆధ్యాత్మిక రసధ్వని అని చెబుతారు యోగులు . ఏదేమైనా భక్తునికి ఆ రాధామాధవుల కథలు అమితాశక్తి దాయకాలు. మధుర భక్తి నిండిన ఆ గాథల అంతరార్థాన్ని అర్థంచేసుకొని, ఆలోచించగలిగితే, మోక్షప్రదాయకాలు కూడా!

ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని మధుర జిల్లాలోని బృందావనలో ఉంది ఈ నిధివన్. ఈ ప్రాంతం నిజంగా బృందావనమే.ఇక్కడి కిట్టయ్యని స్థానికులు 'ఠాకూర్జీ' అని పిలుస్తారు. ఇప్పటికీ ఇక్కడికి  శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాధను కలుసుకోవడానికి వస్తుంటారని నమ్మకం.అదృశ్య రూపంలో రాధకృష్ణలు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం కూడా చేస్తుంటారని చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు రాత్రి పూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపాలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థానిక విశ్వాసం. విశ్వచోదకుడికి , ఆమాత్రం పరివారజనం ఉండొద్దూ !! 

భగవంతుడిది లీలావిలాసమే ! అయితే ఏంటి ?  మనం సంశయాత్ములం కదా ! మనకి ప్రతి విషయానికీ రుజువు కావాలి మరి. ఎక్కడయ్య నువ్వూ, నీగోపికలు అని మనలాంటి వారే ఆ మోహనమురళిని అడిగినట్టే ఉన్నారు . ఇదిగో ఇక్కడ అని ఆయన చెప్పిన సమాధానం మనకి ఈ నిధివన్ లో కనిపిస్తుంది . 
 

నిధివన్ లీలా విశేషం : 

వచ్చే ప్రమాదాన్నయినా , ప్రమోదాన్నయినా ముందుగా పసికట్టేవి పశుపక్ష్యాదులే ! వానొస్తుందంటే , తుమ్మెదలు ఎగురుతుంటాయి. పిట్టలు వర్తులాకారంలో ఎగురుతాయి . ఇవి ఆ విషయాన్ని నిరూపించే ఆధారాలు కదూ ! ఈ ఆలయంలో కూడా పరమాత్మ ఏకాంతానికి భాగం వాటిల్లకుండా ఇవి సద్దు చేస్తాయి . 

నిధివన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్ కు ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడకు మనుషులే కాదు, కనీసం పక్షులు కూడా వెళ్లవు. ఇందుకు నిదర్శనంగా ఒక్క దృష్టాంతారాన్ని ఇక్కడ చెబుతాను. స్వామీ ఉన్నచోట బంటుకూడా ఉంటాడుగా ! అందునా రామభక్తి మెండయినా హనుమ సంగతి వేరే చెప్పాలా ? ఈ ప్రాంతంలో ఉదయం పూట రామ దండైన కోతులు వందల సంఖ్యలో సంచరిస్తుంటాయి. చీకటి పడగానే, అవి ఎక్కడ మాయమవుతాయో అంతుపట్టదు. ఒక్క కోతి కూడా కనిపించదు.ఇక బృందావనములోని చెట్లపైన సందడిచేసే పక్షులు కూడా మౌనందాల్చి , మాయమవుతాయి . 

రాత్రి సమయంలో బృందావనం ద్వాపరకాలంనాటి బృందావనిగా మారిపోతుంది. అక్కడినుండి కాలి అందెల రవళి , మాధవుని మురళి వినిపిస్తుంటుంది. ఇది వందల , వేల ఏళ్లుగా ఇలాగే జరుగుతోందని చెబుతారు ఇక్కడి స్థానికులు . అది ఖచ్చితంగా కృష్ణుడి వేణుగానమీ అని,ఆ గానానికి పరవశించి గోపికలు నృత్యం చేయడం వల్ల ఆ శబ్దాలు వస్తుంటాయని వీరి నమ్మకం.

ఇక్కడ ఉన్న మరో విశేషం ఏమిటంటే నిధివన్ లో ఉన్న మొక్కల కాండాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. వేళ్ళు బయటికి వచ్చి , కొమ్మలు భూమికి వాలి పరమాత్మకు ప్రణామం  చేస్తున్నట్టు ఉంటాయి . తులసీ వనాన్ని చూసి తీరాలి. రాధా కృష్ణుల్లా ఇవి జంటగా ఉంటాయి. ఒక్క చుక్క నీరు లేకపోయినా ఇక్కడి చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ తులసి చెట్లే రాత్రి పూట గోపికలుగా మారినాట్యం చేస్తుంటారని చెబుతారు. అందుకే ఇక్కడ తులసిని కోయరు . తులసిని తెంపడం నిషిద్ధం అన్నమాట . 

ఎవరైనా ఇక్కడి కట్టుబాటులను ధిక్కరించి ఈ నాట్యాన్ని చూస్తే, ఇక వారు ఈ లోకాన్ని చూడడం జరగదని , ఒకవేళ ప్రాణం నిలిచినా మతిస్థిమితం కోల్పోతారని విశ్వాసం. భగవంతుని దర్శించాక ఇక ఐహికమైన లోకంతో పనిలేని మాట వాస్తవమే కదా ! ఆ మనోహరుని చూశాక మనసు ఇక ఈ లోకాన్ని చూసేందుకు అంగీకరిస్తుందా ? 

ఇక్కడి ప్రజలు ఈ బృందావనానికి వనానికి ఎదురుగా వాకిళ్లు వచ్చేలా ఇంటి నిర్మాణం కూడా చేపట్టరు. ఇక రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గరగా ఉన్న ఇళ్లలోని వారు వనం వైపు ఉన్న కిటికీలను కూడా మూసివేస్తారు.

అద్భుతం ఈ ఏకాంతవాసం : 

ఇక రాధా,మాధవుల ఏకాంతవాసానికి నోచుకున్న కట్టడం, వనం మధ్యలో ఉన్న రంగమహల్. ఈ మందిరంలోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని ఇక్కడి ఆచార్యులు చెబుతున్నారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, కొన్ని మధుర పదార్థాలు, తాంబూలం, పళ్లు తోముకోవడానికి రెండు వేపపుల్లలు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తులు అక్కడ ఉంచుతారు.

ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూళం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచం పై ఉన్నదుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక మధుర పదార్థాలు , పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న తంతు.

రాధా మాధవ దర్శనం : 

ప్రశాంత వదనంతో సౌందర్యం మూర్తీభవించినట్టుండే శ్రీకృష్ణుడు, రాధా దేవతలని ఇక్కడ దర్శించుకోవచ్చు . 
నిధివన్ లో వాన్సీ చోర్ రాధా రాణి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ స్థానికుల కధనం ప్రకారం, శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తూ రాధా రాణిపై శ్రద్ధ చూపే వాడు కాదట. అందుకే ఆమె కృష్ణుడి వేణువును దొంగిలించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో రాధా మాట విగ్రహంతో పాటు గోపీ లలిత విగ్రహం కూడా ఉంటుంది.

నిధివన్ లో ప్రసిద్ధ సంగీతకారుడు హరిదాస్ ఆధ్యాత్మిక కీర్తనలు చేసేవాడని చెబుతారు. ఆయన సంగీతానికి ముగ్ధుడైన బంకే బిహారీ జీ (శ్రీకృష్ణుడిని ఈ పేరుతోనూ పిలుస్తారు) ఆయన కలలో కనిపించి ఈ ప్రదేశంలోనే తాను నివసించి ఉంటానని చెప్పినట్లు కధనం

వనంలో ఉన్న కొలనును:

ఈ బృందావనంలో ఉన్న కొలనును విశాఖ కుండ్ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగ్రోవితో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. నిధివన్ కు వెళ్లినవారు ప్రధాన ఆలయమైన రంగమహల్ లోని రాధకృష్ణుడి విగ్రహాలతో పాటు విశాఖ కుండ్ ను దర్శించుకుని వస్తారు.

పరీక్షించిన ఛానల్ :

 ఇటీవల ఓ ఛానల్ వారు ఈ రహస్యం కనుగొనాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆలయ తాళాలు వేసి ఉన్నవి వేసినట్లే ఉన్నాయి.  ఉదయానికి రంగమహల్ లో మంచం పై దుప్పట్లు చెదిరి పోయి ఉండగా వెండి గ్లాసులో పాలు సంగం ఖాళీ అయ్యి కనిపించాయి. దీంతో కేళీలోలుని సత్యాన్ని ఒప్పుకొని వెనుతిరగడం పరీక్షించిన వారి వంతయ్యింది. 
  

ప్రేయసీ ప్రియుల అనుబంధానికి, ప్రకృతీ పరమాత్మల స్వరూపానికి , ఆప్యాయతా అనురాగాలు ప్రతీకలు రాధా కృష్ణులు. స్వయంగా వారు వచ్చివెళ్ళే ఈ ప్రదేశం యెంత పవిత్రమైనదో కదా ! భగవంతుడే స్వయంగా విచ్చేసే ఈ మధురలోని రంగమహాల్లో రాధ కృష్ణులను దర్శించుకొని మీరు కూడా ఆధ్యాత్మికమైన మధురానుభూతిని ఆస్వాదించండి.

ఎలా చేరుకోవాలి :

వాయు మార్గం:
బృందావన్ లో విమానాశ్రయం లేదు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉన్న ఖెరియా ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇది బృందావన్ కు 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బృందావన్ కు 128 కిలోమీటర్ల దూరం. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీ ద్వారా విమానాశ్రయం నుంచి బృందావన్ కు చేరుకోవచ్చు.

రైలు మార్గం:
బృందావన్ కు నేరుగా రైలు మార్గం లేదు. ఇక్కడికి సమీపంలోని మథుర కంటోన్మెంట్, మథుర జంక్షన్ వరకూ ప్రతి రోజూ రైళ్లు నడుస్తుంటాయి. మథుర నుంచి బృందావన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రోడ్డు మార్గం:
ప్రధాన నగరాల నుంచి బృందావన్ కు నేరుగా బస్సులు నడవవు. ఇక్కడికి సమీప బస్టాండ్ మథురలో దిగి అక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బృందావన్ కు ఆటో, ట్యాక్సీ, క్యాబ్ ద్వారా చేరుకోవాలి. కారులో, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారు వృందావన్ కు సులభంగా చేరుకోవచ్చు.

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda