Online Puja Services

బిల్వమంగళుడు

18.216.186.164

దేహబుధ్యాతు…!

             బిల్వమంగళుడు (ఈ పేరు వినగానే పాత తరం వారికి ఒకప్పటి చింతామణి నాటకం లోని పాత్ర గుర్తుకు వస్తుంది. నిజమే అతడి కథే ఇది) 

        పూర్వజన్మలో  ఇతడు గొప్ప సన్యాసి. శ్రీకృష్ణుడికి అమితభక్తుడు. శ్రీకృష్ణునితో భావైక్యము పొందినవాడు.  సన్యాసిగా వుంటూ అయన అనేక భాగవత సప్తాహాలు చేస్తుండేవాడు. ఆ సమయంలో వచ్చిన భక్తులకు కష్టం కలుగకుండా, శ్రీకృష్ణ ప్రసాదాన్ని తయారు చేయించి పంచిపెడుతూ వుండేవాడు.

            అలాంటి ఒకానొక సమయంలో, సప్తాహం జరుగుతుండగా, మధ్యలో అతడి వద్ద వున్న ధనం అంతా ఖర్చు అయిపొయింది. ఇంకా ధనం కావలసి వచ్చింది. భక్తులను సేవించ డానికి ఎక్కడ తనకు సంపద లభిస్తుందా ! ఎవరు తనకు ధన సహాయం చేస్తారా ! అని దాతల కోసం వెదుకసాగాడు.   

            అలా వెదుకుతూ వెళుతుండగా కొద్దిదూరంలో,  యవ్వనంలో 18 వ యేట చనిపోయిన ఒక రాకుమార్తె శరీరాన్ని దహనం చేయడం కనిపించింది.  ఆమె తల్లి దండ్రులు, బంధువులు దుఃఖంతో కార్యక్రమం పూర్తి కాకుండానే వెళ్లిపోయారు.  ఆమె దేహం మీద ఎంతో విలువైన వజ్రాలతో కూడిన బంగారు నగలు అతడికి కనిపించాయి.

            అది చూసి అతడిలా అనుకున్నాడు.  ‘ఈబాలిక శరీరంతో పాటు ఈ ఆభరణాలు దగ్ధమైతే  ఏం ప్రయోజనం? నేను తీసుకుని వీటిని అమ్మగా వచ్చిన ధనంతో కృష్ణ భక్తులను సంతృప్తి పరుస్తాను'  అని భావించి ఆమె పార్థివశరీరంపై చేయి వేయబోయాడా సన్యాసి.  

             అంతలో సన్యాసి నివ్వెర పోయేటట్లుగా…

            “అగు మహానుభావా ! ఇవి నీవు తీసుకోకూడదు.  నీకు సంపద కావలసివస్తే,  నాతండ్రి ఈ రాజ్యానికి రాజు కాబట్టి, ఆయన వద్దకు వెళ్లి నేను పంపానని చెప్పి ధనం అడుగు. ఆయనకు నమ్మకం కలగడం కోసం, నా శయన మందిరంలో తలగడ వద్ద వున్న పెట్టెలో, అఖండ సంపద వున్నదని చెప్పు. ఆ ధనాన్ని శ్రీకృష్ణుడి భక్తుల కోసం ఉపయోగించు” అని చెప్పింది.

             ఆ విధంగానే సన్యాసి మహారాజును కలిసి జరిగినదంతా చెప్పాడు.  అది విని ఆశ్చర్యపోయిన రాజు చనిపోయిన రాకుమార్తె శయన మందిరం వెతికించాడు. ఆమె చెప్పినట్లుగానే, ఆమె శయనా గారంలో వున్న పెట్టెలో సంపద వుండడం చూసి,  సన్యాసి మాటలు నమ్మి,  మన: స్ఫూర్తిగా ఆ సంపదనంతా సన్యాసికి యిచ్చివేశాడు.

             సన్యాసి ఆ సొమ్మునంతా భాగవత సప్తాహంలో ఖర్చుచేసాడు.   అయినా యింకా ధనం కావలసి వచ్చింది.  అప్పుడు మళ్ళీ రాకుమార్తె శవం వద్దకు వెళ్లి,  ఆమె వంటిమీద వున్న వజ్రాల కంఠహారాన్ని తీసుకున్నాడు.   

             సన్యాసి అక్కడనుండి లేస్తుండగానే,   రాకుమార్తె ఆత్మ సన్యాసితో….

             “ఓ సన్యాసీ ! నీవు చాలా పెద్ద తప్పు చేసావు.  నీవు చేసినది శ్రీకృష్ణ భక్తుల కోసమే అయినా, నీ తప్పును నేను క్షమించలేక పోతున్నాను. నీవు చేసిన యీపాపానికి మళ్ళీ మానవజన్మ ధరించి,  కాముకుడవై, నీతిమాలిన జీవితం అనుభవిస్తావు. ఇదే నాశాపం” అని కోపంగా శపించింది.

             తరువాతి జన్మలో ఆ సన్యాసి *బిల్వమంగళుడిగా* జన్మించి, స్త్రీలోలుడు అయ్యాడు.  ఆ రాకుమారి *చింతామణి* అనే వేశ్యగా జన్మించింది. ఆమెయే ఆయన గురువుగా చివరకు మోక్షమార్గం చూపించింది.  

             అలా ఆ సన్యాసి  ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి,  చింతామణి అనే వేశ్య యొక్క గాఢమైన ప్రేమలో పడ్డాడు.  ఆమెతో తన దేహవాంఛలు తీర్చుకుంటూ,  ఆమెలేనిదే బ్రతకలేననే స్థితికి వచ్చాడు. భార్యాబిడ్డలను తృణీకరించాడు. యావదాస్తిని పోగొట్టుకున్నాడు.

             ఆ సమయంలో,  బిల్వమంగళుడు యెంతగా చింతామణి వ్యామోహంలో కొట్టుకు పోయాడంటే, ఒకనాడు అతి పెద్ద తుఫాను వాతావరణంలో,  తన తండ్రిగారి శ్రార్ధ కర్మలు ఆచరించీ ఆచరించగానే,  చింతామణి పొందుకోరి, విరహం తట్టుకోలేక, రాత్రి వేళ ఆమె యింటికి చేరడానికి బయలు దేరాడు.

            ఒక నదిని దాటవలసి వచ్చింది. ఆ తుఫానులో కొట్టుకువస్తున్న ఒకశవాన్ని, అది శవమని కూడా ఆలోచింపకుండా, దానినే ఆలంబనగా చేసుకుని ఆవలి ఒడ్డుకువెళ్లి,  అక్కడ చింతామణి యింటిద్వారాలు మూసి వుండడంతో,  గోడ ప్రక్కనుండి, ఇంకొక ఆధారంతో అది తాడు అనుకుని,  దానితో ఆమె వుండే పై అంతస్తుకు చేరుకున్నాడు. అయన గోడ ఎక్కడానికి చేసుకున్న ఆధారం అది ఒక నల్లత్రాచు.  అదికూడా గమనించే స్థితిలో లేడు బిల్వమంగళుడు.

            ఆసమయంలో, అంత భయంకర పరిస్తితులలో కూడా కామంతో రగిలిపోతున్న బిల్వమంగళుడిని చూసి చింతామణి 

            “నీవు నా రక్త మాంసాలతో కూడిన యీదేహం మీద యింత వ్యామోహం పెంచుకున్నావు.  నీ ప్రాణాలను లెక్క చేయకుండా, తుఫానులో ఇంత సాహసం చేసి నా పొందు కోసం వచ్చావు.  నా మీద చూపిస్తున్న యీ వ్యామోహంలో సహస్రపాలు అయినా, ఆ గోవిందుని మీద చూపించితే,  నీకు జన్మ సార్ధకం అవుతుంది.  నీవు వెంటనే బృందావనం వెళ్లి ఆ శ్రీకృష్ణుని దర్శించి, అలౌకిక ఆనందం అనుభవించు” అని దిశా నిర్దేశం చేసింది చింతామణి.

             అ విధంగా బయలుదేరిన బిల్వమంగళుడిలో ఇంకా కామపు పాలు నశించలేదు. దారిలో,  తాను బయలుదేరిన లక్ష్యం మర్చిపోయి, ఒక  స్త్రీతో తన కామం తీర్చుకున్నాడు.  తాను చేసినపనికి తానే సిగ్గుపడి,  యే స్త్రీతో అయితే, ఆయన ఆనందించాడో,  ఆమె  జడకు పెట్టుకునే పదునైన పరికరంతోనే, తన కళ్ళు ఊడబెరుక్కున్నాడు బిల్వమంగళుడు.   

            ఆ విధంగా, ఇక తన జీవితంలో,  మళ్ళీ బాహ్య ఆనందాలపై మనసు మరలకుండా,  మాంస నేత్రాలు విసర్జించి,  కనులముందు శ్రీకృష్ణుడే కదలాడేటట్లు కఠోర నిర్ణయం తీసుకుని అంధత్వాన్ని తనకు తానుగా ఆహ్వానించాడు.

            బిల్వమంగళుడు బృందావనం చేరిన తరువాత, కృష్ణ కర్ణామృతం ఆసువుగా గానం చేసాడు. రాధాకృష్ణుల బృందావన లీలలను కడు రమ్యంగా వర్ణించాడు. కాలాంతరమున, సోమగిరి అనే మహాస్వామి వద్ద దీక్ష పుచ్చుకుని, *లీలాశుకునిగా* నామాంతరం చెంది, రాధాకృష్ణుల సేవలో తపించి తరించాడు. 

             రాధాకృష్ణుల  లీలలు వర్ణిస్తూ వీణావాదనలో మైమరుస్తుంటే, ఇతర యేవాద్యాలు అవసరం లేకుండా పోయేవి.

             *బృందావనంలో బిల్వమంగళుడికి (లీలాశుకునికి) కృష్ణ పరమాత్మ స్వయంగా, ప్రతిరోజూ, ప్రసాదం తినిపించి,  సురక్షితమైన ప్రదేశంలోకి తీసుకువెళ్లి వదిలేవాడు.* 

             అయితే, ఒకరోజు తనను నడిపిస్తున్న వ్యక్తి మధుర మనోహరంగా వేణువు వాయిస్తుంటే, సర్వం మరచిపోయి వినసాగాడు లీలాశుకుడు.  

             వెంటనే, ఆనందం పట్టలేక, కృష్ణుడి చేయి పట్టుకున్నాడు లీలాశుకుడు ఆప్యాయంగా, ఇక వదలను అన్నట్లు, నీవెవరో నాకు తెలిసిపోయింది అనే భావనతో.

             లీలామానుష విగ్రహుడైన గోవిందుడు కూడా, ఒక్కసారి లీలాశుకుని హస్తాన్ని స్పృజించి, మధురంగా నవ్వుతూ, అక్కడనుండి పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు. 

             బిల్వమంగళుడు (లీలాశుకుడు) ఎంతో ఆనందంగా,  

            “గోవిందా ! నీవెవరో నాకు తెలిసిపోయిందిలే !  నాచేతిని వదిలి నీవు పరుగెత్తినా, నా గుండెలలో నుండి నిన్ను వెళ్లనీయనుగా  !“ అంటూ ఆయన కీర్తనలు పాడుకుంటూ మురిసిపోసాగాడు.

            కాలక్రమేణా  లీలాశుకుడు ఎన్నో కీర్తనలు స్పుృజించాడు.  అన్నింటిలో రాధాకృష్ణుల ప్రేమను ఆవిష్కరించాడు.

             *“చింతయామి హరిరేవ సంతతం*
               *మందహాసముదితాననాంబుజం*
               *నందగోపతనయం పరాత్పరం*
               *నారదాదిమునిబృందవందితం”*

   - కిరణ్ కుమార్ నిడుమోలు 

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore