వానరాకడని ముందుగానే చెప్పే ఆలయం

44.192.25.113

వానరాకడని ముందుగానే చెప్పే ఆలయం !
-లక్ష్మీరమణ  

వానరాకడ , ప్రాణం పోకడ తెలీదని ఒక నానుడి . కానీ ఈ గుడిలో మాత్రం వాన రాకడ ఖచ్చితంగా తెలుస్తుంది. వార్తాఛానెళ్ళ మాదిరి వాతావరణ వివరాలు కాకుండా  ,ఖచ్చితమైన వర్షాభావ పరిస్థితులని ఈ గుడి చెబుతుందని స్థానిక రైతన్నల విశ్వాసం. విశ్వాసం మాటెలాఉన్నా , ఈ కథా కమామిషు మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు మాత్రం, దీని మహాత్తుని విశ్లేషించలేక తలపట్టుకుంటున్న మాట మాత్రం వాస్తవం. అదేకదా జగన్నాధుని లీలావైచిత్రి ! ఇక ఆలస్యం చేయకుండా ,ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి . 

కొబ్బరి కాయలోకి నీళ్ళెట్లా వస్తాయా ? అని బుర్రబద్దలుకొట్టుకొని , ఆనక సమాధానం  దొరికీ  దొరకక దోబూచులాడుతుంటే, దేవుని మాయ ! అని సరిపెట్టుకున్నాడట ఓ పండితుడు . మన శాస్త్రవేత్తలు ఈ గుడిగురించి పడ్డ కష్టాలుకూడా ఇల్లాగే ఉన్నాయి . బోర్లించిన కొబ్బరిచిప్పలా ఉన్న ఆలయం . దానిలోపలికి వెళ్ళేద్వారం . లోపల చిద్విలాసంగా ఉన్న కృష్ణపరమాత్మ .  స్థూలంగా చూస్తే,  ఇదే వాన గుడి రూపం  .  వందల సంవత్సరాల కాలంనాటి దివ్యాలయం, శ్రీకృష్ణ నిలయం ఈ పురాతన ఆలయం. ఇది  ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా, ఘాతంపూర్ ప్రాంతంలో ఉన్న భితర్‌గావ్ బెహతా గ్రామంలో ఉంది.

వానగుడిగా ఇది స్థానికంగానే కాక , ప్రపంచవ్యాప్త గుర్తింపుని పొందింది . రుతుపవనాల రాకడ గురించి, వర్షాలు ఎప్పుడు పడతాయి, ఎంత వర్షం పడుతుంది అన్న విషయాలన్నీ ముందే  చెప్పేస్తుందట ఈ అపూర్వ ఆలయం .  ఈ వానగుడి చెప్పే సమాచారాన్ని ఆధారంగా  చేసుకునే వ్యవసాయ పనులు చేసుకుంటామని చెప్తారు ఇక్కడి స్థానికులు.  ప్రతి సంవత్సరం వర్షాల కోసం భారీ సంఖ్యలో రైతులు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు . 

అసలింతకీ ఆ గుడిలో ఏం జరుగుతోంది. వాన రాకడ, పోకడ ఎలా తెలుస్తుంది అంటే, 

ఇంకో వారం రోజుల్లో వర్షాలు పడతాయనగా ఆలయంలోని పైకప్పు నుంచి నీటి తుంపరలు పడుతుంటాయి. అలా ఆలయ పైకప్పునుంచి పడే నీటి బిందువుల బట్టి ఎంతకాలంలో వర్షాలు పడతాయో తెలుసుకుంటారు ప్రజలు. ఆ నీటిబిందువుల ప్రమాణం బట్టి కూడా వర్షాలు ఎక్కువగా కురుస్తాయా? తక్కువగా కురుస్తాయా అన్న విషయం వాళ్లకి తెలిసిపోతుందట. దీనిని ఆదారంగా తీసుకునే పొలం పనులు ప్రారంభిస్తారక్కడ.  ఇంకా విచిత్రమైన విషయమేమంటే వర్షాలు కురవడం ప్రారంభం అవగానే ఆలయ పైకప్పు నుంచి నీటి తుంపరలు పడటం ఆగిపోతాయట.

ఇదంతా ఎలా జరుగుతుంది. మండుటెండల్లో కూడా ఈ వర్ష సూచనలు కొనసాగుతూనే ఉంటాయి . పైకప్పు నుంచి నీటి తుంపరలు రాలుతూనే ఉంటాయి , వర్షం రాకడని సూచిస్తూ! కానీ ఎలా పడతాయి? చిత్రంగా వర్షారంభం కాగానే  ఎలా ఆగిపోతాయి... ఈ వానగుడి పైకప్పులో ఏముంది? ఈ విషయాలు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు చాలా పారిశోధనలు చేసారట. కానిఇంతవరకు ఇది మిస్టరీగానే మిగిలిపోయింది.

ప్రతి సంవత్సరం జూలైలో ఈ వానగుడిలో జగన్నాథ రథోత్సవాలు జరుగుతాయి. శ్రీ కృష్ణ జన్మాష్ఠమి సందర్భంగా బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. ఇదీ వానగుడి విచిత్రం .

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna