Online Puja Services

ఆపదలు తొలగించే చిన్ని కన్నయ్య

18.118.29.224

ఆపదలు తొలగించే  చిన్ని కన్నయ్య !!
-లక్ష్మీరమణ 

బాలకృష్ణుణ్ణి చూసి కేవలం యశోదమ్మే కాదు, రేపల్లె మొత్తం మురిసిపోయింది . ఆరూపానికి , ఆ చిలిపి చేష్టలకు , ముగ్దమనోహరమైన ఆ చిన్నారి పెదవులమీద విబూసిన నవ్వుకూ నోచుకుంది రేపల్లె. ఆ రూపంలోనే, పూతన, శకటాసురుడు, తదితర రాక్షసులని ఒక పట్టుపట్టాడు కదూ మన కన్నయ్య ! ఆ వయసులోని  పసివాడి సాహససోపేతమైన చర్యలని చూసి ఆశ్చర్యపోయింది రేపల్లె . అటువంటి చిన్నారి రూపంలోని కేశవుణ్ణి స్వయంగా శివుడు, బ్రహ్మదేవునికి ప్రసాదిస్తే, అనంతరకాలంలో అది కృష్ణపరమాత్మని చేరి, మన అదృష్ట వశాన ఈ భువిమీద నిలిచి పూజలందుకొంటోంది . ఆ మహిమోపేత  క్షేత్రానికి పోదామా !

 దేవాలయాలు ఎక్కడుంటాయో , అక్కడ సమానం మొక్కలు నాటక్కర్లేదు. ప్రక్రుతి స్వయంగా పుష్పించి , పరిమళిస్తుంది. శరీరములోని నాడులవలె , భూమి నుండీ ప్రవహిస్తూ, గంగమ్మ జలపాతమై జగన్నాథుని పాదాలు ముద్దాడుతుంది . అటువంటి పరవశం కేరళలో మనకి తప్పకుండా కలుగుతుంది. వేదం , ఆయుష్షుని పెంచుతూ ఆయుష్మాన్ భవ అని దీవిస్తుంది . అటువంటి దివ్యప్రదేశమే  శ్రీకృష్ణుని ఆలయాల్లో ప్రముఖమైన సుందర నిలయం గురువాయూర్. కేరళ రాష్ట్రంలో ఉన్న  ప్రముఖ కృష్ణ దేవాలయం. ఆ ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు.  ఆయుర్వేద చికిత్సలకు నెలవు, అపురూపమైన ఆలయాలకు నిలయం. దేవభూమిగా పిలుచుకునే సుందర ప్రదేశంలో  భూలోక వైకుంఠంలా అలరారే క్షేత్రం గురువాయూర్. 

ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుడే కుటుంబ సమేతంగా విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారట . శివకేశవులకి ఒకరినొకరు ఆశ్రయించడం కొత్తకాదుగా ! సర్పయాగంచేసి, శాపగ్రస్తుడై, కుష్ఠువ్యాధితో బాధపడిన జనమేజయ మహారాజు విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి, శాపవిమోచనం పొందిన ప్రదేశం. ఇలా ఎన్నో అద్భుతాలకు మరెన్నో పౌరాణిక కథనాలకు వేదిక గురువాయూర్. ఐదువేల ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం గురువాయూర్ అయితే,  యుగాల చరిత్ర కలిగిన మూలవిరాట్టు ఇక్కడి గురువాయూరప్ప . 

'గురువాయూరప్పన్'నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరిస్తుంటారు .  కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. అప్ప - అంటే తండ్రి . ఆ విధంగా తండ్రి స్వరూపము (మన పిల్లల్ని కూడా చిన్ని తండ్రీ ! అని పిలుస్తుంటాం . ఆ విధంగా బాలుడు ) ఈ అప్ప గురువాయూరప్ప . 
పిల్లలు లేనివారిని బాలకృష్ణుని పూజించమని, సంతానగోపాల హోమము చేయమనీ చెబుతుంటారు జ్యోతిష్యపండితులు . గురువాయూర్ ఆలయంలోని మూలవిరాట్టును  విగ్రహాన్ని మొట్టవెుదట స్వయంగా పరమేశ్వరుడు,  బ్రహ్మదేవుడికి ప్రసాదించారట.  ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడట .  ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతికి ఈ విగ్రహం చేరింది . ఆ తర్వాత  కశ్యప ప్రజాపతి  దాన్ని వసుదేవుడికి అనుగ్రహించారు . వసుదేవుడినుంచి ఆయన కొడుకైన శ్రీకృష్ణుడికి చేరింది ఆ విగ్రహం.  దాన్ని శ్రీకృష్ణుడు ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. తనని తానే ఆ విధంగా అర్చించుకున్నారు భగవానుడు . 

 శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించబోయే ముందు కృష్ణుడు తన స్నేహితుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారకానగరం  సముద్రంలో మునిగిపోతుందనీ, అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ, దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ కోరారు .   అలా  ఉద్ధవుని సందేశం ప్రకారం దేవగురువైన బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో ఇప్పుడు ఉన్న ప్రదేశానికి, అంటే  కేరళ తీరానికి చేర్చారు . అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు కుటుంబ సమేతంగా  తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడికి వచ్చిన దేవగురువు బృహస్పతిని వాయు దేవుడ్ని చూసి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట పరమేశ్వరుడు. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం.ఆ రుద్రతీర్థంలోని నీటితోనే నేటికి కూడా స్వామికి అభిషేకం చేస్తారు.  తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడట . అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. వెుదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

నిర్మల దర్శనం :
ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. పిల్లలకి తియ్యని పదార్థామేకదా ఇష్టంగా ఉంటాయి . అందులోనూ ఆ చిన్నారి కేశవుడుకి పాలు, వెన్న, నెయ్యి అత్యంత ప్రీతిపాత్రం కదా ! అందుకే  ఆయనకీ అర్పించే నైవేద్యాలు కూడా అలాగే, ఉంటాయి . బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు.

సంతానం కోసం :
సంతానం కోరేవారు, సంతానం యొక్క యోగక్షేమాలను అర్థించేవారూ ఈ ఆలయాన్ని అధికంగా సందర్శిస్తూంటారు. ఇక్కడ పిల్లలకి అన్నప్రాసనలు చేస్తారు . ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.

నారాయణీయం:
గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ, అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.

గజరాజులసేవలు :
గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్‌, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్‌ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్‌. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్‌ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు. 

ఎలా వెళ్ళాలి : 

రహదారి ద్వారా గురువాయరప్పన్ ఆలయం
గురువాయూర్ త్రిశూర్ నుండి 27 కి. ప్రధాన బస్ స్టాండ్ ఆలయం నుండి 650 మీటర్ల దూరం నడవగలదు. బస్సులు, ఆటో-రిక్షాలు మరియు టాక్సీలు ఆలయానికి చేరుకోవడానికి దాదాపు అన్ని సమయాలలో అందుబాటులో ఉన్నాయి.

రైలు ద్వారా గురువాయరప్పన్ ఆలయం
ఆలయం నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురువాయూర్ రైల్వే స్టేషన్ సమీప రైలు హెడ్.

గురువాయురప్పన్ ఆలయం విమానాశ్రయం ద్వారా
ఆలయం నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీప విమానాశ్రయం.

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi