భగవానుడి అన్నయ్యలు చనిపోవడానికి ఎవరు కారణం ?

54.174.225.82

భగవానుడి అన్నయ్యలు చనిపోవడానికి ఎవరు కారణం ?
లక్ష్మీ రమణ 

భగవానుడికి అన్నయ్యలుగా పుట్టిన ఆ ఆరుగురూ చనిపోవడానికి ఎవరు కారణమయ్యారు? కంసుడేనా ? ఒక్క కనిపించే కంసుడి కారణమా ? లేక బంధువులనూ , మిత్రులనూ , గురువులనూ చంపవలసి వస్తుందని కురుక్షేత్రంలో నాడు అర్జనుడు కంటికి నీరుపెట్టుకుంటే, అన్ని నేనే , చేసేవాడిని చేయిన్చేవాడినీ, కాలాన్ని, కర్మనూ నేనే నన్నట్టు ఆ భగవానుడే ఆ కార్యక్రమానికి కర్తయి వ్యవహరించారా ? అంటే, రామాయణం, భాగవతం, దేవీభాగవతాలు కలిసి కట్టుగా ఒకే ఉదంతాన్ని భాగాలు భాగాలుగా వివరిస్తున్నాయి . ఆ కతేమిటో తెలుసుకుందాం పదండి . 

దీనికంతటికీ సూత్రధారి ఆ కిరీటి అవునా కాదా నేటి పక్కనపెడితే, కథలో కర్తగా పైకి కనిపించేది మాత్రం కాలనేమి అనే రాక్షసుడు . రామాయణంలో , సీతారాముల ఎడబాటుకి కారణమైన మారీచుని కొడుకు ఈ కాలనేమి . మహా విజ్ఞానవంతులైన ఆ ఆరుగురూ ఈ రాక్షసుని కడుపున జన్మించాల్సిన అగత్యం కలిగింది. అందుకు వారి స్వయంకృతాపరాధమే కారణం .  

పూర్వం మరీచి, ఊర్ణాదేవి అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు బ్రహ్మగారు కూర్చుని ఉండగా నిష్కారణంగా ఒక నవ్వు నవ్వారు. అపుడు బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి, తదనంతరం హిరణ్యకశిపుని కడుపునా పుట్టారు. 

అప్పటికి వాళ్ళకి వున్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు తండ్రి అయిన హిరణ్యకశిపునకు చెప్పారు. అపుడు హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందనే లేదు. మీరు అప్పుడే పొందేశారా? కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. 

వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి, ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. వాళ్ళ శాపం ఈజన్మతో ఆఖరయిపోతుంది. వీళ్ళు యిప్పుడు గతజన్మలోని తండ్రి చేతిలో చచ్చిపోవాలి. గతజన్మలో వీరి తండ్రి కాలనేమి. కాలనేమి యిపుడు కంసుడిగా ఉన్నాడు. కాబట్టి వేరు కంసుడి చేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనం అయిపోయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి.

జ్ఞానమును ప్రదీపింప జేసేవాడు నారదుడు కాబట్టి , ఏడవ  గర్భందాకా ఆగి , అప్పుడు తన మారకుడైన వాడినొక్కడినే తన కత్తికి బలిచేయాలనుకున్న కంసుణ్ణి రెచ్చగొట్టి, బ్రతికున్న ఆరుగురిని చంపేలా చేశాడు నారదుడు . అలా  నారదుడు  వాళ్ళు శాప విమోచనం పొందేలా చేశాడు. ఇది దేవీ భాగవతం చెబుతున్న వృత్తాంతం. 

కాబట్టి స్వయంకృతాపరాధమే , భగవానుని అన్నయ్యలని బలితీసుకుంది. అయితేనేమి, ఆయనకీ అన్నయ్యలుగా జన్మించిన పుణ్యానికి వారు బ్రహ్మజ్ఞానులై , మోక్షాన్ని పొందగలిగారు . 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya