ఆ రెండూ లేకపోతె, క్షణమైనా నిలువలేడు

54.174.225.82

గోపికల విరహాన్నయినా తట్టుకుంటాడు  గానీ మాధవుడు, ఆ రెండూ లేకపోతె, క్షణమైనా నిలువలేడు. 
లక్ష్మీ రమణ 

కురిసే మబ్బులనీ ,ఎగిరే పిట్టల్నీ , విరిసిన పూవుల్నీ , రాలిన ఆకుల్నీ అడుగుతూ మాధవునికోసం వెదుకుతున్నారు గోపికలు. మాధవుని మోము అనే పూర్ణ చంద్రుని చూడనిదే , నిలువలేని నక్షత్రాలు వాళ్ళు . ఆయన కోసం తపించిపోయే మధువునిండిన తేనెపాత్రలు . కానీ మాధవుడో ,ఎంచక్కా గోవుల్ని వెంటేసుకొని , నెమలి పింఛం పెట్టుకొని ,  ఆ వెదురు గొట్టాన్ని చేతబూని మనోహరంగా గానం చేస్తూ , విలాసం గా వారిని ఊరిస్తున్నాడే గానీ , వారికోసం పరుగులు పెట్టడం లేదు . 

కాముకత్వం , స్త్రీలోలత్వం ఆ భగవానుని లక్షణాలు కాదుకదా ! కానీ గోపికలు మానవులు. ఆ మాధవుని క్షణమైనా విడువలేని మహిళా మూర్తులు . వారి దృష్టిలో మాధవుడే తమ ప్రియుడు , భర్త. భార్యలకు భర్తమీద సహజంగానే ఒకింత ‘ నావాడు’ అనే భావం అధికంగా ఉంటుంది. తనకన్నా ఎక్కువగా ఎవరిని  ప్రేమించినా, ఆఖరికి అది ఒక వస్తువైనా ఆమె మనసు కష్టపెట్టుకుంటుంది . ఈర్ష్య పడుతుంది. 

గోపికలు కూడా ఈర్ష్య పడ్డారు . తమని వదిలి, ఆ వేణువుని తన వెంటే ఉంచుకుంటున్న మాధవుణ్ణి చూసి కోపగించారు . ఆ నెమలి పించం ఆయన తలపైన యెంత అందంగా ఉంటె, మాత్రం తమకంటే ఎక్కువా అని చురుకైన చూపులు రువ్వారు . గోవిందుడు గోపికల మనసెరుగనివాడు కాదుకదా ! కానీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చాడు . ఆ తర్వాత తమ ఈర్ష్యని ఆపుకోలేని గోపికలు  మురళీలోలుని మురళిని ప్రశ్నించనే ప్రశ్నించారు . ‘ మాకంటే, నీవెలా ఎక్కువయ్యావామాధవునికి ? నిన్ను ముద్దాడి , నిన్నే పక్కన పెట్టుకొని నిద్రిస్తాడు! మేము ఆయనని వెతుకుతూ పిచ్చివాళ్ళమయిపోతుంటే, ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూ పరవశిస్తాడు ‘ అని . 

తనను నిలదీసిన గోపికలకు వేణువు చెప్పిన సమాధానంతో వారికి ఙ్ఞానోద‌యం అయ్యింది. ‘నన్ను నేను భగవానుడికి సమర్పించుకున్నాను. నా తనువుపై నాకు ఎలాంటి హక్కు లేదు. వెదురు చెట్టునుండి నన్ను తుంచి , తెచ్చి రంధ్రాలు చేసినప్పుడు నేను  ఎంతో బాధపడ్డాను . నన్ను ఆ మాధవుడు తనకి ప్రియమైన విధంగా మలచుకున్నారు. నేను ఆయనకు పూర్తిగా  దాసోహం అయ్యాను. అని చెప్పింది . ఆ వెంటనే నెమలీక అమలిన శృంగారంకన్నా , ఆ భావనలో ఉన్న భక్తి మధురమైనది . అది స్వామినే తమ దాసుగా మార్చివేయగలడు. అందుకే, శృగారమనే ప్రసక్తేలేకుండా , పునరుత్పత్తిని పొందే నా జాతిని తన ట్లపైన ధరించి ఆ విషయాన్ని వెల్లడి చేస్తారా పరంధాముడు అని పలికింది . 

అప్పుడు గోపికలకు అర్ధమయ్యింది  ‘భగవంతుడిపై పూర్తిగా విశ్వాసం ఉంచి, ఆయనకీ సర్వస్య శరణాగతి చేస్తే, మనం ఆయన కరుణకు అర్థించడం కాదు, మనవెంట ఆయన ఉండి , తండ్రిలా నిరంతరం కాపాడతాడు , భర్తలా కాచుకుంటాడు , అమ్మలా ఆదరిస్తాడు , ప్రియుడై ప్రేమని పంచుతాడు. సఖుడై సరైనదారిలో నడిపిస్తాడని .  ఇదే తత్త్వం మనకీ బోధపడింది కదా! 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya