గుర్రం తలతో గిరిజనుల పూజలందుకునే లక్ష్మీదేవి

54.165.57.161

గుర్రం తలతో  గిరిజనుల పూజలందుకునే లక్ష్మీదేవి 
నమస్తే తెలంగాణా సౌజన్యంతో . 

గిరిజన జీవనం- వైవిధ్యభరితం. ప్రత్యేకమైన భాష, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు- వీరి సొంతం. ప్రకృతిని ప్రేమించడం, ఆరాధించడం అడవి బిడ్డల సంస్కృతిలో భాగం. తమ మూల సంస్కృతిని అనుసరిస్తూ నాయక్‌పోడ్‌ తెగలు జరిపే ‘లక్ష్మీదేవర’ జాతర.. ఎంతో ప్రత్యేకం.

తెలంగాణలోని గిరిజన తెగల్లో నాయక్‌పోడ్‌ ఒకటి. వారి ఇలవేల్పు ‘లక్ష్మీ దేవర’. ఈ దేవత రూపం ‘గుర్రం తల’ ఆకారంలో ఉంటుంది. ఏటా ఉగాది తర్వాత ‘లక్ష్మీదేవర జాతర’ కన్నుల పండువగా సాగుతుంది.

శ్రీ కృష్ణుడి వరం

పాండవులు మగధ రాజ్యంపైకి దండెత్తి యుద్ధం చేస్తుండగా.. రుక్మిణీదేవి తన అన్నను రక్షించుకోవాలని అనుకొంటుంది. ఆ తపనతో మారువేషం ధరించి యుద్ధానికి బయలుదేరుతుంది. యుద్ధ రంగంలో మారువేషంలో ఉన్న రుక్మిణిని చూసి, నందిగాముని తమ్ముడు అనుకొని అర్జునుడు బాణం ప్రయోగిస్తాడు. దీంతో ఆమె తల తెగి, అడవిలో ఉన్న మద్దిచెట్టు సమీపంలోని పుట్ట దగ్గర పడుతుంది. యుద్ధంలో నందిగాముని జయించి తిరిగివచ్చిన పాండవులకు, కృష్ణుడికి రుక్మిణి కనిపించదు. యుద్ధరంగంలో వెతకగా ఆమె మొండెం మాత్రమే కనిపిస్తుంది. కృష్ణుడు బాధతో, సైనికులను పిలిపించి, ఆడగుర్రం తల తీసుకురమ్మంటాడు. అదే సమయంలో అడవిలోకి వెళ్లిన నాయక్‌పోడ్‌ పెద్దలకు రుక్మిణి తల లభిస్తుంది. వారికి జరిగిన విషయం చెప్పి, తన తలను కృష్ణుడికి అప్పగించమని కోరుతుందామె. మరోవైపు సైనికులు తీసుకొచ్చిన గుర్రం తలను రుక్మిణి మొండానికి పెట్టి సంజీవని మంత్రం చదవడానికి పూనుకొంటుండగా, నాయక్‌పోడ్‌ వాళ్లు రుక్మిణి తలను తీసుకొస్తారు. దీంతో సంతోషించిన కృష్ణుడు గుర్రం తలను పక్కనపెట్టి, రుక్మిణి తలను మొండానికి పెట్టి సంజీవని మంత్రం చదువుతాడు. దీంతో రుక్మిణితోపాటు గుర్రం తలకూ ప్రాణం వస్తుంది. రుక్మిణి ప్రాణం కాపాడిన నాయక్‌పోడ్‌ పెద్దలకు ప్రాణం ఉన్న గుర్రం తలను కానుకగా ఇస్తాడు కృష్ణుడు. ‘మీ ఇంటికి ఇలవేల్పుగా, మీ జాతికి రక్షణగా ఉంటుంది’ అని దీవించాడు. అప్పటినుండి నాయక్‌పోడ్‌లు గుర్రం తలను లక్ష్మీదేవరగా పూజిస్తూ వస్తున్నారని ఐతిహ్యం.

పెద్ద పండుగ

ఏటా ఉగాది తర్వాత మూడు రోజులపాటు లక్ష్మీదేవర పండుగ జరుపుతారు. పదకొండు మంది లేదా ఇరవై ఒక్కమంది పూజారులు నిష్ఠగా ఉంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పండుగలో భాగంగా మొదటిరోజు గుడిలోని లక్ష్మీదేవరతోపాటు మిగతా ప్రతిమలను శుద్ధి చేయడానికి గంగ స్నానానికి వెళ్తారు. గంగ దగ్గర ఏడు చెలిమెలు తీసి, ఆ నీటితోపాటు పాలతోనూ ప్రతిమలను శుద్ధి చేస్తారు. తిరిగి గూడేనికి బయల్దేరుతారు. దారిలో భక్తులు దేవర కాళ్లు కడిగి, నీళ్లు ఆరగింపు చేస్తారు. ఆ తర్వాత దేవర ప్రతిమలను గుడిలో ప్రతిష్ఠించి, మొక్కులు చెల్లించుకుంటారు. రెండో రోజు గుడిలో పూజాది కార్యక్రమాల తర్వాత, అమ్మవారి ప్రతిమను గూడెంలో ఊరేగిస్తారు. మూడోరోజున ప్రతి ఇంటి నుంచీ ఒక బోనం చొప్పున వండుకొని, గుడి దగ్గరికి శోభాయాత్రగా వస్తారు. లక్ష్మీదేవరకు బోనం సమర్పించుకొని, పిల్లా పాపలను చల్లగ చూడమని మొక్కుకుంటారు.

మేడారంలో..

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలోనూ లక్ష్మీదేవర మొక్కులు సందడిగా ఉంటాయి. మేడారంలో అందరికన్నా ముందు చేరుకునే దేవత లక్ష్మీదేవరే. నాయక్‌పోడ్‌ పూజారి లక్ష్మీదేవరను ధరించి, దారిపొడవునా నృత్యాలు చేస్తూ గద్దెలకు తరలివస్తాడు. అనంతరం తమ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరిపిస్తారు.

దేవర ఆలయం

ఆలయంలో లక్ష్మీదేవర ప్రతిమతోపాటు మాస్కుల రూపంలోని పోతురాజు, కృష్ణ స్వామి, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ధర్మరాజు.. ఇలా వివిధ ప్రతిమలను వెదురు బుట్టలో ఉంచి, గుడిలోని పీఠం మీద నిలుపుతారు. ఈ ప్రతీకలకు ప్రాణం ఉంటుందని నాయక్‌పోడ్‌లు విశ్వసిస్తారు. అందుకే, జాతర సందర్భంగా దేవరను ఎత్తుకున్నవారిని అమ్మవారు ఆవహిస్తారని భావిస్తారు.

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda