Online Puja Services

కృష్ణ విగ్రహము ఇస్తున్న సందేశం

3.17.184.90

జై శ్రీ కృష్ణ.!!

కృష్ణం వందే జగద్గురుమ్.!!

కృష్ణ విగ్రహము ఇస్తున్న సందేశం.

దేవతా విగ్రహాలు పరిశీలించినట్లయితే అందులో సహజయోగాతత్వము అర్ధమౌతుంది. కృష్ణుని విగ్రహం పరిశీలిస్తే 

1. కృష్ణుడు నిల్చున్నతీరు గమనిస్తే, ఒక కాలు భూమిమీద, మరొక కాలు భూమిమీద ఆనీ అననట్లు ఉంటుంది. దీని ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే - అన్నింటా ఉంటూ అంటీముట్టనట్లు ఉండమని. తామరాకుపై నీటిబిందువులాగా దేనికీ అంటకుండా సమతుల్యతాభావంతో జీవించమన్నదే కృష్ణబోధ. 

2. కృష్ణుని చేతిలో మురళి వెదురుతో చేయబడింది. లోపలంతా ఖాళీ (శూన్యం). ఇది స్వచ్ఛతను సూచిస్తుంది. అంతరంగములోపల అహం లేకుండా భావాతీతస్థితిలో ఉండమని సూచిస్తుంది. అలానే మురళిలోని ఏడురంద్రాలు మనలోని ఏడు చక్రాలకు సూచన. కృష్ణుడు అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడు. ఏ అహంలేని స్వచ్ఛమైన అంతరంగం మురళి (వేణువు). ఆ వేణువులో తిరిగాడే గాలి ప్రాణవాయువు.

కృష్ణుడు ఎక్కువగా మురళివాయిస్తూ, నాట్యం చేస్తూ, ఆటలాడుతూ జీవితాన్ని అలవోకగా ఆహ్లాదంగా గడుపుతున్నట్లు కన్పించడంలో మానవులు కూడా ఎప్పుడూ పరమానందంలోనే ఉండాలన్న సూచన ఉంది. కృష్ణుడు అంటేనే అపరిమితమైన ఆనందం. అత్యున్నత ఆనందం. 

ప్రాణాయామం అనే సాధనద్వారా మూలాధారం నుంచి సహస్రారం వరకు శ్వాస (వాయువు) క్రిందకు పైకీ సాగిస్తే తదేకదృష్టి కల్గి మనస్సు ప్రాణంలో, ప్రాణం ఆత్మలో, ఆత్మ పరమాత్మలో లయమైనటువంటి సమాధిస్థితి కల్గుతుంది. ఈ స్థితే సహజయోగ పరమానందకరస్థితి. ఈ స్థితిలో మానవులుండాలన్నదే కృష్ణసందేశం. 

3. కృష్ణుడి వర్ణం నీలం. అంతులేకుండా అంతటా వ్యాపించిన ఆకాశం ప్రకృతిలో భాగం. శూన్యమైన ఆకాశం నీలివర్ణం. కృష్ణుడుని నీలంరంగులో చూపించడానికి కారణం నిరంతరం ప్రకృతిలోనే ఉన్నాడని, అనంతమై ఉన్నాడని  అర్ధం. ఎప్పుడూ ప్రకృతిలోనే ఉండాలన్న విషయాన్ని నీలంరంగు సూచిస్తుంది. ప్రకృతిలో ఉండడంవలన భూతదయ, సంయమనం, మానసిక ప్రశాంతత పెరుగుతుంది.

4. దేవాదిదేవుడు, చతుర్దశ భువన భాండాగారుడు, చరాచర సృష్టికి అధిపతి అయినను నెమలిఫించంనే ధరించడంలో సందేశమేమిటంటే ఏ స్థితియందున్న ఏదీ మోయకూడదని, ఆడంబ అహంకారములు లేకుండా నిర్మలంగా నిరాడంబరంగా జీవించాలని.

5. గోవు జ్ఞానానికి గుర్తు. గోవు చెంతనే ఉండడం ద్వారా జ్ఞానం చెంతనే మానవులు ఉండాలని, జ్ఞానం ద్వారానే తరిస్తారన్న సందేశముంది.

సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః / 
పార్ధో వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహాత్ // 

యుద్ధభూమిలో ఉపనిషత్తులనే గోవులనుండి, అర్జునుడనే దూడను నిమిత్తంగా చేసుకొని గీత అనే అమృతాన్ని పితికి అందర్నీ ముక్తులను చేసే కృష్ణభగవానుడికి నమస్కరించడం తప్ప ఏమివ్వగలం? అది చాలు అంటాడు బీష్మపితామహుడు -

ఏకోపి కృష్ణస్య కృత ప్రణమో
దశాశ్వమేదావభ్రుదే: నతుల్యః
దశాశ్వమేధీ పునరితి జన్మ 
కృష్ణప్రణామీ న పునర్భవాయ

శ్రీకృష్ణునికి చేసిన ఒక నమస్కారం పది అశ్వమేధాలకు సమానం. పదిసార్లు అశ్వమేధం చేసినవారికైన పునర్జన్మ ఉన్నది. కానీ, కృష్ణునికి ప్రణామం చేసినవానికి మరల జన్మ ఉండదని బీష్ముడు చెప్తాడు.

శత్రుచ్చేదైకమన్త్రం సకలముపనిషద్వాక్యసమ్పూజ్యమన్త్రం  
సంసారోచ్చేదమన్త్రం సముచితతమసః సంఘనిర్యాణమన్త్రమ్ 
సర్వైశ్వర్యైకమన్త్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమన్త్రం 
జిహ్వే శ్రీకృష్ణమన్త్రం జప జప సతతం జన్మసాఫల్యమన్త్రం (ముకుందమాలా)

సర్వ శత్రువులను నశింపజేయునది, ఉపనిషద్వాక్యములచే పూజింపబడునది, సంసారమునుండి విడిపించునది, అజ్ఞానాంధకారమును తొలగించునది, సమస్త ఐశ్వర్యములను చేకూర్చునది, ప్రాపంచిక దుఃఖమనెడి విషసర్పకాటుకు గురియైనవారిని రక్షించునది, ఈ జగత్తులో జన్మసాఫల్యమును చేకూర్చునది కృష్ణ మంత్రమే. కాబట్టి 

"ఓ జిహ్వా! దయచేసి శ్రీకృష్ణ మంత్రమునే సతతం జపించుము".

- వెంకటరమణ బత్తుల 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore