శ్రీ కృష్ణాష్టమి పూజా విధానం

3.239.129.91

శ్రీ కృష్ణాష్టమి పూజా విధానం 

శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడు . కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

 శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుని  చెరసాలలో జన్మించాడు.

చాంద్రమాన పంచాగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని పిలుస్తారు. భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకే ) లేచి, తలస్నానము చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు,కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరములో ముగ్గులు వేయాలి. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ గంధము,తులసి మాల, శ్రీ కృష్ణుడి  చిత్రపటం  లేదా విగ్రహం , పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో గల ఫోటోను గానీ, ప్రతిమను ఉంచాలి.

పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. తదనంతరం పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. నుదుటన సింధూరం ధరించి, తూర్పు దిక్కునకు తిరిగి ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇంకా పూజా సమయంలో బాలకృష్ణ స్తోత్రమ్, శ్రీకృష్ణ సహస్ర నామాలు, శ్రీమద్భాగవత పఠనం తో,  శ్రీకృష్ణున్ని స్తుతిస్తే మంచిది. ఆ తరువాత శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించి, దీపారాధన గావించి పూజను ముగించాలి.

కృష్ణాష్టమి రోజున ఒంటి పూట భోజనం చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు, పవిత్ర  మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయని పురోహితులు చెబుతుంటారు. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది.  

కృష్ణాష్టమి రోజున బంగారంతో గానీ, వెండితో గానీ చంద్రబింబాన్ని తయారు చేసి, వెండి లేక బంగారు పాత్రలలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతేగాక ఈ పుణ్యదినాన భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలిగిపోతాయని మహర్షులు చెప్పినట్లుగా ఉంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.


శ్రీ కృష్ణాష్టోత్తర శత నామావళి

ఓం కృష్ణాయ నమః
ఓం కమలానాథాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సనాతనాయ నమః
ఓం వసుదేవాత్మజాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం లీలామానుష విగ్రహాయ నమః
ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
ఓం యశోదావత్సలాయ నమః
ఓం హరయే నమః ॥ 10 ॥

ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా శంఖాంద్యుదాయుధాయ నమః
ఓం దేవకీనందనాయ నమః 
ఓం శ్రీశాయ నమః
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః
ఓం యమునా వేగసంహారిణే నమః
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః
ఓం పూతనా జీవితహరాయ నమః
ఓం శకటాసుర భంజనాయ నమః
ఓం నందవ్రజ జనానందినే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః ॥ 20 ॥

ఓం నవనీత విలిప్తాంగాయ నమః
ఓం నవనీత నటాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం నవనీత నవాహారాయ నమః
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః
ఓం షోడశస్త్రీ సహస్రేశాయ నమః
ఓం త్రిభంగి మధురాకృతయే నమః
ఓం శుకవాగ మృతాబ్ధీందవే నమః
ఓం గోవిందాయ నమః
ఓం యోగినాం పతయే నమః ॥ 30 ॥

ఓం వత్సవాటచరాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం దేనుకాసుర భంజనాయ నమః
ఓం తృణీకృత తృణావర్తాయ నమః
ఓం యమళార్జున భంజనాయ నమః
ఓం ఉత్తాలతాలభేత్రే నమః
ఓం తమాల శ్యామలాకృతయే నమః
ఓం గోపగోపీశ్వరాయ నమః
ఓం యోగినే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః ॥ 40 ॥

ఓం ఇలాపతయే నమః
ఓం పరస్మై జ్యోతిషే నమః
ఓం యాదవేంద్రాయ నమః
ఓం యదూద్వహాయ నమః
ఓం వనమాలినే నమః
ఓం పీతవాససే నమః
ఓం పారిజాతాపహారకాయ నమః
ఓం గోవర్ధనాచలోద్ధర్త్రే నమః
ఓం గోపాలాయ నమః
ఓం సర్వపాలకాయ నమః ॥ 50 ॥

ఓం అజాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం కామజనకాయ నమః
ఓం కంజలోచనాయ నమః
ఓం మధుఘ్నే నమః
ఓం మధురానాథాయ నమః
ఓం ద్వారకానాయకాయ నమః
ఓం బలినే నమః
ఓం వృందావనాంత సంచారిణే నమః
ఓం తులసీదామ భూషణాయ నమః ॥ 60 ॥

ఓం శ్యమంతక మణేర్హర్త్రే నమః
ఓం నరనారాయణాత్మకాయ నమః
ఓం కుబ్జాకృష్ణాంబరధరాయ నమః
ఓం మాయినే నమః
ఓం పరమపూరుషాయ నమః
ఓం ముష్టికాసుర చాణూర మల్లయుద్ధ విశారదాయ నమః
ఓం సంసారవైరిణే నమః
ఓం కంసారయే నమః
ఓం మురారయే నమః 
ఓం నరకాంతకాయ నమః ॥ 70 ॥

ఓం అనాది బ్రహ్మచారిణే నమః
ఓం కృష్ణావ్యసన కర్శకాయ నమః
ఓం శిశుపాల శిరశ్ఛేత్రే నమః
ఓం దుర్యోధన కులాంతకాయ నమః
ఓం విదురాక్రూర వరదాయ నమః
ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః
ఓం సత్యవాచే నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సత్యభామారతాయ నమః
ఓం జయినే నమః ॥ 80 ॥

ఓం సుభద్రా పూర్వజాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం భీష్మముక్తి ప్రదాయకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగన్నాథాయ నమః
ఓం వేణునాద విశారదాయ నమః
ఓం వృషభాసుర విధ్వంసినే నమః
ఓం బాణాసుర కరాంతకాయ నమః
ఓం యుధిష్ఠిర ప్రతిష్ఠాత్రే నమః
ఓం బర్హిబర్హావతంసకాయ నమః ॥ 90 ॥

ఓం పార్థసారథయే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గీతామృత మహోదధయే నమః
ఓం కాళీయ ఫణిమాణిక్య రంజిత శ్రీపదాంబుజాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం యజ్ఞ్నభోక్ర్తే నమః
ఓం దానవేంద్ర వినాశకాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం పరస్మై బ్రహ్మణే నమః
ఓం పన్నగాశన వాహనాయ నమః ॥ 100 ॥

ఓం జలక్రీడాసమాసక్త గోపీవస్త్రాపహారకాయ నమః
ఓం పుణ్యశ్లోకాయ నమః
ఓం తీర్థపాదాయ నమః
ఓం వేదవేద్యాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం సర్వతీర్థాత్మకాయ నమః
ఓం సర్వగ్రహరూపిణే నమః
ఓం పరాత్పరాయ నమః ॥ 108 ॥

ఇతి శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళీ స్సమాప్తా ॥

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi