శాంతి పాఠం-వివరణ

3.235.176.80

శాంతి పాఠం-వివరణ

 

పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే |

పూర్ణాస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే ||

అదీ పూర్ణమే. ఇదీ పూర్ణమే. అది అంటే పరమాత్మ. ఇది అంటే జీవాత్మ. చైతన్య స్వరూపుడు పరమాత్మ. చైతన్యం గనుక నిరాకారమది. నిరాకారమైనదెప్పుడూ ఆకాశంలాగా వ్యాపిస్తుంది. 

దానికి విజాతీయమంటూ ఉండబోదు. ఉంటే అది దీని వ్యాప్తి కడ్డు తగులుతుంది. కనుక అద్వితీయమైనదది. అదే ప్రస్తుతం నేను అని భావించే ఈ జీవుడు కూడా. దానికీ దీనికీ తేడా లేదు. రెండూ చైతన్య స్వరూపమే. కాబట్టి రెండూ ఒకటే.

పూర్ణాత్పూర్ణముదచ్యతే. పూర్ణమైన పరమాత్మ నుంచే వచ్చిందిది. పూర్ణం నుంచి వచ్చింది అపూర్ణమెలా అవుతుంది. 

పూర్ణమే కావలసి ఉంది. సువర్ణం నుంచి వచ్చిన ఆభరణం సువర్ణానికి వేరవుతుందా. కారణానికి సజాతీయంగానే ఉండాలి దాని కార్యం. కారణమిక్కడ పరిపూర్ణ చైతన్యం. దాని కార్యమైన జీవుడుకూడా పరపూర్ణం కాక తప్పదు.

కాని అలా కనపడటం లేదు మనకిప్పుడు. అపూర్ణంగా భాసిస్తున్నాడు. ఒక నామమనీ రూపమనీ క్రియ అనీ వచ్చి పడ్డాయి. వీటి మూలంగా పూర్ణం అపూర్ణంగా భాసిస్తున్నది. భాసిస్తున్నదంటే అది అలా ఉండి కాదు భాసించటం. దానినలా దర్శించటం మూలాన. దృష్టి సిద్ధమే గాని ఇది వస్తు సిద్ధం కాదు. ఒక రజ్జువు సర్పంలాగా కనిపిస్తున్నదంటే ఆ సర్పమెక్కడ ఉంది. రజ్జువులోనా. మన దృష్టిలోనా. రజ్జువులో నని తెలివిగలవాడెవ్వడూ అనలేడు. రజ్జువు రజ్జువే. అది ఎప్పుడూ సర్పం కాలేదు. మరి ఆ సర్పమెక్కడిది.

మన దృష్టి తెచ్చిపెట్టిన సర్పమది. సర్పదృష్టితో చూచేసరికి రజ్జువు మరుగునపడి సర్పం కనిపించిందక్కడ. అలాగే చైతన్యమే నామరూపాత్మకమైన దృష్టితో చూచాము మనం. అందుకే స్వరూపం మరుగునపడి అది మనకు నామరూపాత్మకమైన సంసారంగా భాసిస్తున్నది, తన్మూలంగా సుఖ దుఃఖాది ద్వంద్వాలకు గురిచేసింది.

మరి దీనికేమిటిప్పుడు పరిష్కారం. మరలా దీన్ని వస్తుదృష్టితో చూడటమే పరిష్కారం.

నామరూపాత్మకంగా కనిపిస్తున్నా వస్తుతః రజ్జువులాగా ఇది శుద్ధ చైతన్యమే. చైతన్యాన్ని వదలకుండా దానితో పూర్ణమయ్యే ఉన్నదది. అంచేత పూర్ణస్య పూర్ణమాదాయ. కేవల చైతన్యదృష్టి పెట్టుకొని చుస్తే మరలా ఇది పూర్ణమేవావశిష్యతే. పూర్ణంగానే అనుభవానికి వస్తుంది. ఇప్పుడు కూడా అపరిపూర్ణంగాదది పూర్ణమే.

అపూర్ణమనేది కేవలం దృష్టిలోనే తప్ప వస్తువులో లేదు కనుక భయం లేదు మనకు. దృష్టివల్ల కలిగింది దృష్టి మార్చుకుంటే చాలు తొలగుతుంది. అపూర్ణమనే దృష్టివల్ల కలిగింది. పూర్ణమనే దృష్టివల్ల తొలగింది. ఆ దృష్టి అవిద్య అయితే ఈ దృష్టి విద్య. విద్య ఉదయిస్తే చాలు అవిద్య నశిస్తుంది. అవిద్య నశిస్తే అవిద్యాకృతమైన జీవభావమూ జగద్భావమూ రెండూ పోతాయి. అప్పుడంతా పరిపూర్ణమైన ఆత్మ స్వరూపమే.

కనుక మానవుడు చేయవలసిన సాధన ఏమిటో ఇప్పుడర్థమయింది. ఆత్మ స్వరూపాన్ని అందుకోవడానికి కాదు సాధన. స్వరూపమే అయినప్పుడందుకొనే ప్రశ్నేముంది. అందుకునే ఉన్నామీపాటికి. ఎటువచ్చీ అది మన దృష్టి దోషంవల్ల అన్యంగా భాసిస్తున్నది. నామరూపాత్మకంగా చూడటమే దృష్టి దోషం. 

దానికి స్వస్తి చెప్పి సచ్చిదాత్మకమైన ఆత్మదృష్టి నలవరచుకొని చూడాలి మరలా. చూస్తే అనాత్మగా కనిపించిందంతా మన దృష్టికాత్మగానే గోచరిస్తుంది. అపూర్ణంగా కనిపించింది పూర్ణంగానే భాసిస్తుంది. ఇలాటి పూర్ణదృష్టిని అలవరచుకోవటమే సాధన అంతా.

ఎలా అలవరచుకోవాలది. అనాత్మ జగత్తులో అంతటా ఆత్మ లక్షణాలను చూస్తూ పోవటమే. ఏమిటా లక్షణాలు. అస్తిత్వమూ, ప్రకాశమూ. 

ఇవి ప్రతి ఒక్క పదార్థంలో ఉన్నాయి. అయితే మరుగునపడి ఉన్నాయి. భావన చేస్తే బయట పడతాయి. ఎలాగా, ప్రతి ఒక్కటీ ఉందనీ ప్రకాశిస్తుందనీ భావించాలి. నిజానికి భావించనే అక్కరలేదు. భావించకుండానే ఉన్నాయవి. అస్తిత్వం ప్రకాశం లేకుంటే లోకంలో దేనికీ ఉనికీ లేదూ భావమూ లేదు. అవి ఉంటేనే ఈ నామరూపాలున్నాయనీ, కనిపిస్తున్నాయనీ చూస్తున్నాము. 

అలా చూచేసరికి వాటిని అణగద్రొక్కి తాము పైకి వచ్చాయి. మరలా ఇప్పుడా అణగిపోయిన వాటిని పెళ్ళగించి వాటిమీద నిఘా పెట్టి చూచామంటే ఇవి అణగిపోయి అవిపైకి తేలుతాయి. ఇదిగో ఈ నిఘా పెట్టి చూడటమే సాధన. దానిలో నిలిచి పోవటమే సిద్ధి.

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi