Online Puja Services

పెద్దలు నేర్పిన సంస్కారాలు, గ్రహాల అనుగ్రహాన్ని అందిస్తాయని తెలుసా !

3.146.35.203

మన పెద్దలు నేర్పిన సంస్కారాలు , గ్రహాల అనుగ్రహాన్ని అందిస్తాయని మీకు తెలుసా ! 
- లక్ష్మి రమణ 

నవగ్రహాలు మనుషుల జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయంటుంది జ్యోతిష్య శాస్త్రం. నవగ్రహాలైన సూర్యుడు, చంద్రుడు, మంగళుడు (కుజుడు),బుధుడు, గురువు, శుక్రుడు, శని ప్రభావాల వలన  జీవితంలో పలు శుభాశుభాలు కలుగుతూ ఉంటాయి . ఆ విధంగా వారాన్ని అనుసరించి నేరుగా ఆ గ్రహ దేవతని అర్చించడమో , లేదా ఆయా గ్రహాధిదేవతలని ఆరాధించడమో చేస్తూ ఉంటాము . అలాగే, ఆయా రోజుల్లో చేయకూడని పనులు కూడా ఉన్నాయి  అంటున్నారు పండితులు .  ఆ విశేషాలు ఇక్కడ చెప్పుకుందాం . కొన్ని చాలా సిల్లీ అనిపించినా , కొన్ని విశేషాలు తెలుసుకున్నప్పుడు , ఇందులో ఇంతటి ప్రభావం ఉందా అనిపిస్తాయి . వాటిని సేకరించి హితోక్తి మీకోసం అందిస్తోంది . 

1.సూర్యుడు

పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన, దంతావధానం చేయకూడదట.

2.చంద్రుడు

అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే ఆయన అంత అందంగా ఉంటారేమో ! మన మనసు కూడా అద్దమే కదా! ఆయన మనస్సు కారకుడు అయ్యాడు అందుకే ! కాబట్టి  అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

3.కుజుడు

‘మంగళో భూమి పుత్రశ్చ రుణాహర్తా ధనప్రదః’ అని కదా ఆయన స్తోత్రము . ధనాన్ని ప్రసాదించేవాడు , రుణాలనుండీ విముక్తినిచ్చేవాడు అయిన భూమి పుత్రుడు కుజుడు.  అందువల్ల ఆయనకీ అప్పు ఎగ్గొడితే కోపము. 

వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు. తల్లికి అన్యాయం చేసే వారిని క్షమించడు. 

4.బుధుడు

చంద్రుని పుత్రుడు , విద్వాంసుడు , సూర్యునికి ఇష్టమైనవాడూ బుధుడు. 

వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా , నాకే జ్ఞానం ఉంది అని గర్వంతో విర్రవీగినా  కోపము. బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము. అందునా బుధవారం అస్సలు చేయకూడదు. శృతము పాడవడం ఆయనకి నచ్చదు మరి . 

5.గురువు

సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి. దేవ గురువు.  ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.

6.శుక్రుడు

శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

7.శని

సూర్య పుత్రుడు, ధర్మ పరిపాలకుడు, శివునికి ఇష్టమైనవాడు శనీశ్వరుడు. ఆయనకీ  పెద్దల్ని కించపరచడం చేసినా , మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లితండ్రిని చులకన చేస్తే అస్సలు సహించడు.

సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

8.రాహువు

సగం దేహంతో ఉండే రాహువు మాయకి , బ్రమకి కారకుడు.  వైద్య వృత్తి పేరుతో ఎవర్నైనా మోసగించినా, సర్పములని ఏమైనా చేసినా  ఆయనకి కోపము కలుగుతుంది. 

9.కేతువు

జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడే వాళ్ళని క్షమించడు కేతువు. ఈయన మోక్ష కారకుడు .  పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు. ఈయన గనక జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

చూడండి, ఎన్ని ధర్మ సూక్ష్మాలని గ్రహించి మన పెద్దలు మన సంప్రదాయాన్ని, ఆచారాలనీ రూపొందించారో ! పెద్దలని గౌరవించమని, గురువులని గౌరవించమని, ఇంట్లో కీచులాడుకోవద్దని, జ్ఞానాన్ని ఎల్లప్పుడూ పంచుకోమని మన పెద్దలు ఎప్పుడూ చెప్పే మాటలే ! అవి మనకి పెద్దలు సంస్కారంగా అనుగ్రహించినవి. ఇవి గ్రహాల అనుగ్రహాన్ని కూడా అందిస్తాయంటే ఇప్పటికైనా వాటిని ఖచ్చితంగా పాటిద్దాం .  

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda