Online Puja Services

కాలభైరవుడు అంటే, రక్షించేవాడని అర్థం

3.135.219.166

కాలభైరవుడు అంటే, రక్షించేవాడని అర్థం.
-సేకరణ: లక్ష్మి రమణ  

కాలుడు అనే మాటకి విధి , లేదా మృత్యువు అనే అర్థాలున్నాయి . ఆ కాలాన్ని శాశించగల చండప్రచండ రూపమే కాలభైరవుడు. దుర్గామాత, అసురసంహారం చేసి , కాశీ క్షేత్రాన్ని రక్షించాలని తలంపుతో కాలభైరవుని కాశీలోని ఎనిమిదిచోట్ల ప్రతిష్ఠ చేసినట్టు కాశీఖండం లోని 72వ అధ్యాయం చెబుతుంది . వీళ్ళనే అష్టభైరవులు అంటారు . వీరుకాక, దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో ప్రఖ్యాతి చెందిన భైరవ స్వరూపాలని భక్తులు అర్చిస్తుంటారు . వీరిని గురించి తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం . 

కాలభైరవుడు అంటే, రక్షించేవాడని అర్థం. సర్వకాల సర్వావస్థల్లోనూ కాలభైరవ స్మరణం సర్వశత్రువినాశనం . సర్వసంపదకారకం . శ్రీ కాలభైరవస్వామి పూజలందుకొని కొన్ని ప్రధాన క్షేత్రాలు: 

1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :
కాలుడై ఉద్భవించి, పరమేశ్వరుని అంతర్యామిత్వాన్నే హేళన చేసిన బ్రహ్మ ఐదవ శిరస్సును కొనగోటితో ఉత్తరించిన కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలం వారణాసి క్షేత్రం. శివుని ఆజ్ఞ పొంది ఇక్కడ క్షేత్రపాలకుడయ్యాడు  కాలభైరవుడు.

2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లోని ఇండోర్) :

గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.ఇక్కడి భైరవుడు స్వయంగా మద్యాన్ని సేవిస్తారు . విగ్రహం నోటిదగ్గర మద్యం పెడితే చక్కగా సేవిస్తారు.  సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము ఇక్కడి ఆలయ విశేషము .

3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ ,జగదల్ పూర్) :

ప్రఖ్యాత శక్తిపీఠం దంతేశ్వరీ దేవాలయానికి సమీపంలోనే ఉంది దంతెవాడ గ్రామం . ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలతో నవీన నిర్మాణంగా కన్పిస్తుంది. ఈ మందిరంలో నాలుగు రూపాల్లో భైరవుడు దర్శినమిస్తాడు .

1. వనభైరవుడు
2. జటాభైరవుడు
3. గధాభైరవుడు
4. తాండవభైరవుడు.

4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :

ఈ ప్రాచీనాలయంలోని స్వామి పేరు 'మహాభైరవుడు'. ఇక్కడ భైరవుడు లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం. పూర్వం నాగులు ఈ లింగాన్ని పూజించేవారని స్థలైతిహ్యం . ఇప్పటికీ ఈ ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి.

5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణ లోని  కామారెడ్డి జిల్లా) :

ఇక్కడ సుమారు 11 వ శతాబ్దం లో స్వామి వారి ఆలయం నిర్మించబడింది.
దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది.

6. రామగిరి (ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా) :

9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం ఇది .  శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కనే ఒకే ప్రాకారంలో ఈ ఆలయాలుంటాయి . ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..

7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :
వేరెక్కడా కానరాని విధంగా , సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్న భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవునితోపాటు , శివలింగం , స్థానిక చెంచుల దేవుడైన నిరాకార 'బయన్న' కూడా ఒకేచోట కొలువై పూజలందుకుంటూ ఉండడం  విశేషం . 

8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :
ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా, చుట్టూ మండపంతో ఆరుబయట ఉన్న స్వచ్ఛమైన , అచ్చమైన  భైరవుడు దర్శనమిస్తాడు.

9. ఖాట్మండు (నేపాల్) :
నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు. అందుకే ఇక్కడ  అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామికి  చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తుంటారు. 

10. భైరవకొండ (ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లా) :

ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువైఉంటారు.. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది.. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 - 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందడం ఒక అపూర్వమైన దృశ్యం . క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.

11. తిరువైసనల్లూరు (తమిళనాడు లో కుంబకోణం) :

ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.

12. న్యూడిల్లి :

ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.

13. ధున్నాస్ (ఉత్తరప్రదేశ్) :

ఇక్కడ ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు..

జై కాళీవల్లభ.. జై కాలభైరవ..

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda