Online Puja Services

లయకారుడి నివాస స్థలాన్ని దర్శిద్దామా !

18.119.172.146

లయకారుడి నివాస స్థలాన్ని దర్శిద్దామా ! -కైలాస పర్వతం
-లక్ష్మీ రమణ 

శివుడు ఉండేది కైలాసం. మంచుతో నిండి ఉండే పర్వతమని, ప్రమథగణాల రక్షణా వలయమని , శివపార్వతుల నివాసమని మన పురాణాలు చెబుతున్నాయి.  ఆ కైలాసం ఈ భూమ్మీదే ఉందని తెలుస్తోంది . సాధన చేయగలిగితే,  సజీవంగా కైలాసానికి వెళ్లడం సాధ్యమే అని అవి చెబుతున్నాయి . అదెలా సాధ్యం ? రండి ఈ కథలో తెలుసుకుందాం . 

శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు టిబెట్లో ఉన్న హిమాలయా పర్వతాల్లో మంచు కొండల్లో వెండివెన్నెల, అతీంద్రియ మహాశక్తులు, అంతుపట్టని వెలుగు దివ్వెలు, సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో సైన్స్ కు అందని అసాధారణ వ్యవస్థ. పరమశివుని ఆవాసం, పార్వతినివాసం ఈ భూమ్మీదే ఉంది.

సముద్ర మట్టానికి 21,778 అడుగుల (6,638 మీటర్లు) ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి (గంగానదికి ఉపనది)మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు అర్థంకాని రహస్యాలు ఎన్నో ఇక్కడ దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే నిజమైన భక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం కలుగుతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు ఈ కైలాస పర్వత శిఖర భాగాన నివశిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు. విష్ణు పురాణం ప్రకారం కైలాస పర్వతం ప్రపంచానికి పునాది వంటిది. తామర పువ్వు ఆకారంలో గల ఆరు పర్వత ప్రాంతాల మధ్యలో ఈ పర్వతం ఉంటుంది. కైలాసం నుంచి మొదలయ్యే నాలుగు నదులు ప్రపంచపు నాలుగు భాగాలకి ప్రవహించి ప్రపంచాన్ని నాలుగు భాగాలుగా విభజిస్తున్నాయి. కైలాస పర్వత నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రుబి, నీలం రాయులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెబుతుంది. అందుకే ఇది నలువైపులా నాలుగు వర్ణాల్లో గోచరిస్తుంది. అంతేకాదు కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి. ఒకవైపు సింహంగా, ఇంకోవైపు గుర్రంగా, మూడోవైపు ఏనుగుగా, నాలుగోవైపు నెమలిగా కనిపిస్తుంది. ఇందులో గుర్రం హయగ్రీవ రూపంకాగా, సింహం పార్వతి దేవి వాహనం, ఏనుగు విఘ్నేశ్వరుని ప్రతీక అయితే నెమలి కుమార స్వామి వాహనం.ఇవన్నీ ఈశ్వర స్వరూపానికి ప్రతీకలుగా పురాణాలు చెబుతాయి.

మంచుపూర్తిగా కప్పుకున్నప్పుడు పౌర్ణమి రాత్రి వెండికొండలా మిలమిల మెరిసే కైలాస దర్శనం అత్యద్భుతం, అమోఘం. కైలాస పర్వతాన్ని అపశవ్య దిశతో చుడతారు. దీని చుట్టుకొలత 52 కిలోమీటర్లు. కొంత మంది యాత్రికులు కైలాస పర్వతాన్ని ఒక్కరోజులోనే చుట్టిరావాలని నమ్ముతారు. కానీ ఇది అంత సులభం కాదు. మంచి ఆరోగ్యవంతుడై వేగంగా నడిచే వ్యక్తి ఈ 52 కిలోమీటర్ల దూరం చుట్టిరావడానికి 15 గంటల సమయం పడుతుంది. సాధారణ యాత్రికులకు మూడురోజుల సమయం పడుతుంది.

ప్రపంచంలో ఎవరూ అధిరోహించని పర్వతాల్లో కైలాస పర్వతం కూడా ఒకటి. దీన్ని అధిరోహించడం ఇప్పటికీ ఎవరి వల్ల సాధ్యంకాలేదు. దీన్ని ఎవరూ ముట్టుకునేందుకు కూడా సాహసించలేదు. కొంతమంది సాధువులు సాహసించినా వారు కొంత దూరంలోనే అదృశ్యమయ్యారని చెబుతారు. ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీని వాలులలో కాలుపెట్టడం మహాపాపం. ఈ మూఢ నమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించి వారంతా ఆ ప్రయత్నంలోనే మరణించాలని చెబుతారు. 

1950లో చైనిస్ సైన్యం టిబెట్ లో అడుగు పెట్టిన తరువాత, చైనిస్-ఇండియన్ సరిహద్దులలో నెలకొన్న రాజకీయ, సరిహద్దు అనిశ్చితి వలన శివ భగవానుడి నివాసానికి చేసే తీర్థయాత్ర 1954 నుండి 1978 వరకు నిలిపివేయబడింది. దానితరువాత పరిమిత సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది. చైనా దీనిపై ప్రయోగాలు చేసి విఫలమైంది. రెండుసార్లు ఈ పర్వతం పైకి హెలికాఫ్టర్ పంపిస్తే అవి మధ్యలోనే కూలిపోయాయి. అప్పటి నుంచి చైనా ఆర్మీ మౌంట్ కైలాస్ జోలికి వెళ్లే సాహనం చేయడం లేదు.ఆరు పర్వత ప్రాంతాల మధ్య ఉండటంతో ఇప్పటివరకు అవుటర్ సర్కిల్ లో తిరిగిన వారు తప్ప ఇన్నర్ సర్కిల్ లోకి వెళ్లిన వారు లేరు. ఈ పర్వత ఉపరి భాగంలో  ఏముందో సైన్స్ కు కూడా అంతుబట్టలేదు. యోగ శాస్త్రంలో మౌంట్ కైలాస్ ను షహస్ర దళాలతో ఉండే సహస్రార చక్రంగా పేర్కొన్నారు.

కైలాస పర్వత యాత్ర :

భారత ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మానససరోవర, కైలాస పర్వత యాత్ర నిర్వహిస్తుంది. టిబెట్, ఖాట్మాండుకు చెందిన కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఈ యాత్రను నిర్వహిస్తున్నాయి. ఫిట్ నెస్ కి సంబంధించి వైద్య పరీక్షల్లో పాస్ అయితేనే ఈ యాత్రకు అనుమతినిస్తారు.

మానస సరోవరం :

కైలాస పర్వత పాదపీఠంలో మానస సరోవరం మరో అపురూపం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానససరోవరం నుంచి కైలాస పర్వతాన్ని చూడవచ్చు. మానస్ అంటే మైండ్, బ్రహ్మ తన మైండ్ నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహుర్తంలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారని భక్తుల విశ్వాసం. ఎంచగలిగిన విజ్ఞానముంటే, మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.

ఈ ప్రపంచానికి కైలాసం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా ఉందని హిందువుల విశ్వాసం. పట్టాభిషేకం తర్వాత రామ,లక్ష్మణులు, చివరి దశలో పాండవులు, వశిష్ఠుడు, అరుంధతి, ఆది శంకరాచార్యుడు  కైలాస పర్వత యాత్ర చేసారని హిందూ మత గ్రంథాలు చెబుతున్నాయి.బుద్ధుని తల్లి మాయాదేవి కూడా మానస సరోవరంలోనే స్నానమాచరించి మంచి తనయుడు పుట్టాలని ప్రార్థించినట్లు బౌద్ధమత గ్రంథాలు పేర్కొన్నాయి. మానససరోవరంలో స్నానం చేసి కైలాస పర్వతాన్ని దర్శించుకుంటే పునర్ జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. కైలాస దర్శనం భక్తులకు ఒక పవిత్ర అనుభూతి, మాటల్లో వర్ణించలేని భావమది. పదాలకు అందని పవిత్రత అది.

హరహర మహాదేవ శంభో శంకర !

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha