Online Puja Services

నీలకంఠేశ్వరుని ఆలయం !

3.134.104.173

మోకాళ్ళ నొప్పులు తగ్గించి , అనంత పుణ్యాన్ని అనుగ్రహించే నీలకంఠేశ్వరుని ఆలయం ! 
-లక్ష్మీ రమణ

కోటిజన్మల పుణ్యాన్ని ఇవ్వగలిగిన శివాలయం శ్రీ నీలకంఠేశ్వరుడు కొలువైన దివ్యాలయం.ప్రక్రుతి పరవశం నడుమ, ఈ నీలకంఠేశ్వరుణ్ణి స్వయంగా ఆయన భక్తుడైన మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించారు . ఇక్కడికి వచ్చి, స్వామీ దర్శనం చేసుకున్నవారికి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట. నిత్యమూ సహజ గంగా ప్రవాహం అభిషేకిస్తూ ఉండే ఆ శివ దర్శనాన్ని చేసుకుందాం రండి . 

గుంటూరు జిల్లా లోని అచ్చంపేట మండల కేంద్రానికి సుమారు  5 km దూరంలో   ఉన్న గ్రామం నీలేశ్వర పాలెం. ఇక్కడే ఉంది శ్రీ నీలకంఠేశ్వర ఆలయం . ఈ ఆలయం పేరుమీదనే ఈ ప్రాంతానికి నీలేశ్వర పాలెం అనేపేరువచ్చిందంటారు స్థానికులు . ఆలయం అంతాకూడా గ్రామీణ వాతావరణంలో చక్కని ప్రకృతి పారవశ్యంతో నిండి ఉంటుంది 

శివాలయం :
చక్కని ఆలయంలోపల నీలకంఠేశ్వర స్వామి ఆధ్యాత్మిక శోభల నడుమ దర్శనం ఇస్తారు . ఈ లింగాన్ని  భక్త మార్కండేయ వారు ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.ఆ మహా శివుడి ఆలయం కింది భాగంలో నీరు, ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది.  ఇది సహజగంగా ప్రవాహమే . ఇది ఎక్కడి నుండీ ఇలా ఉబికి వస్తుందన్నది శాస్త్రవేత్తలకు అంతుపట్టని విషయమే అయ్యింది . ఈ ఆలయంలో ఇలా శివునికి అభిషిక్తమయ్యే  నీటిని తాగితే మోకాళ్ళ నొప్పులు పోతాయని విశ్వశిస్తారు స్థానికులు.  

కోనేరు :
 ఈ గుడి ఎదురుగా  ఒక కోనేరు కూడా ఉంది. ఈ నీటిలో స్నానం చేసిన వారి పాపాలన్నీ పోతాయి. భక్తులందరూ పుణ్య స్నానాలు చేస్తారు. ఈ కోనేరులో ఆ మహా శివుని మహత్యం చూడవచ్చు. ఈ కోనేరులో నిత్యం నీరు ఉంటుంది. అంతే ఆ నీరు ఎంత తీసిన అంతే నీరు ఆ కోనేరు లో ఉంటూనే ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల రైతులు పొలాలకు నీరు నిత్యం పెట్టిన, ఆ నీరు కొంచెం కూడా తగ్గదు. ఇది ఆ మహా శివుని మహిమ అని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు.  

కార్తీకమాసంలో తిరునాళ్ళు :
ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసం చివరి సోమవారం రోజు పెద్ద తిరుణాల జరుగుతుంది. ఈ తిరునాళ్లను సెల తిరుణాల గా ప్రజలు జరుపుకుంటారు. సెలా అంటే ఆ మహా శివుడి ఆలయం కింది భాగంలో నీరు, ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది, కాబట్టి సెల అని పిలుస్తారు. ఆ తిరుణాల రోజు వేల సంఖ్యలో దూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి ఆ శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులందరూ పొంగలిని ఆ మహా శివుడికి నైవేద్యంగా పెడతారు.

శ్రీ నీలకంటేశ్వర స్వామి మహత్యం ఉందని భక్తులు చెప్పుకుంటారు. ఇక్కడ కోరిన కోరికలను శివుడు తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మకం. అనుకున్నది నెరవేరి, ఇక్కడ స్వామి వారికి మొక్కులు చెల్లించే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరగడమే అందుకు నిదర్శనం. 

స్థలపురాణం:

మృకండ మహర్షి భార్య మరుద్వతి, ఈమె మహాసాధ్వి, వీరికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడమే. పుత్రసంతానం కోసం మృకండ మహర్షి వారణాసికి తపస్సు చేయడానికి సతీసమేతంగా బయలుదేరుతాడు. వారణాసిలో వారు రెండు శివలింగాలను ప్రతిష్ఠించి, శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు.ఆ మహాశివుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనప్పటికీ , మృకండు మహర్షిని మరోమారు పరీక్ష చేయడానికి ఇలా అడుగుతారు. మహర్షి నీకు సద్గురువైన పదహారేళ్లు బ్రతికే పుత్రుడు కావాలా? లేక చెడ్డవాడైన సంపూర్ణ ఆయుష్షు కలిగిన పుత్రుడు కావాలా? అని అడుగుతారు.

దానికి మృకండ మహర్షి ఆలోచించి 16 ఏళ్లు బ్రతికే పుత్రుడు కావాలి అంటాడు. ఆ మహా శివుడు వరాన్ని ఇచ్చి వెళ్లిపోతారు. ఆ విధంగా మరుద్వతి గర్భవతి అయి, పుత్రుణ్ణి కంటుంది. అతనికి మార్కండేయుడు అని నామకరణం అన్ని చేస్తారు.

ఇలా రోజులు గడుస్తుంటాయి.  ఒక రోజు సప్తరుషులు మృకండు మహర్షి ని చూడడానికి వస్తారు. మార్కండేయుడు ఆ సప్తఋషులను నమస్కరించిన వెంటనే సప్తఋషులలో చిరంజీవ అనే ధీవిస్తారు. మృకండ మహర్షి తన కొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా అని సప్తఋషులను ప్రశ్నిస్తారు. అప్పుడు  వారు దివ్యదృష్టితో జరిగినది తెలుసుకుంటారు. మార్కండేయుని బ్రహ్మ దగ్గరకు తీసుకుపోయి, బ్రహ్మ చేత కూడా చిరంజీవి అని దీవింప జేస్తారు. ఆ తర్వాత జరిగింది తెలుసుకున్న బ్రహ్మ మార్కండేయుడి నిరంతరం శివారాధన చేయమని చెప్పి, బ్రహ్మ కూడా శివుడి గురించి తపస్సు చేసి మార్కండేయుడి నీ చిరంజీవిని చేయమని చెబుతారు. ఆ విధంగా మార్కండేయుడి కి 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన భటులను ప్రాణాలు తీసుకురమ్మని పంపుతాడు.

యమకింకరులు మార్కండేయుడి తేజస్సును చూసి మా వల్ల కాదని యముడికి చెబుతారు. వెంటనే యముడు వస్తాడు. యముడు వచ్చే సమయానికి మార్కండేయుడు అత్యంత భక్తితో శివారాధన చేస్తూ ఉంటాడు. యముడు తన యమా పాశాన్ని వేసిరేటప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని, శివ మహాదేవ కాపాడు అని అంటాడు. అలా అన్న వెంటనే శివలింగం నుండి మహాదేవుడు ఉద్భవించి, కాల రూపుడై యముడి పైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడి రక్షించమంటాడు.

తర్వాత యముణ్ణి క్షమించి, మార్కండేయుడు నాయనా చిరంజీవి ఈ సృష్టి ఉన్నంత వరకు చిరంజీవి గా ఉండేటట్లు వరం ఇస్తున్నాను అంటాడు. అలా చిరంజీవిగా నిలిచిన ఆ పరమ శివభక్తుడైన భక్త మార్కండేయ మహర్షి  వారు ఇక్కడ శ్రీ నీలకంఠేశ్వర స్వామిని భక్త జనులని అనుగ్రహించడం కోసం ప్రతిష్టించారు. భక్త మార్కండేయ వారు ప్రతిష్టించిన ఈ ఆలయాన్ని దర్శిస్తే, కోటిజన్మల పుణ్యం కలుగుతుంది. జన్మల పాపాలు పోతాయి, వీలైతే ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించండి.

ఇలా చేరుకోవచ్చు :
ఈ ఆలయం గుంటూరు నుండి 60 km.. గుంటూరు జిల్లా లోని అచ్చంపేట మండలం నుండీ  5 km దూరంలో నీలేశ్వర పాలెం గ్రామంలో ఉంది .  అచ్చంపేట నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి . 

Quote of the day

May He who is the Brahman of the Hindus, the Ahura-Mazda of the Zoroastrians, the Buddha of the Buddhists, the Jehovah of the Jews, the Father in Heaven of the Christians give strength to you to carry out your noble idea.…

__________Swamy Vivekananda