Online Puja Services

పరమేశ్వరుని అనుగ్రహం కోసం కుక్కలుగా మారే భక్తులు !

3.147.104.120

పరమేశ్వరుని అనుగ్రహం కోసం కుక్కలుగా మారే భక్తులు !
లక్ష్మీ రమణ 

క్షీరసాగర మథనంలో అమృతం కన్నా ముందు లోకాలని దహించివేసే విషం పుట్టింది. లోకాలన్నీ రక్షించాలన్న తాపత్రయంలో శివుడు ఆ విషయాన్ని తన కంఠంలో నిలిపాడు. లోకాలనేలేటోడు తన తోడు కాబట్టి ఆ ఆదిదేవి సరేనని ఒప్పుకుందిగానీ, శివయ్యని ఆ విషం ఆగం చేస్తుందేమోనని భయం మాత్రం ఉండిపోయింది. దాంతో ఆయన్ని కాపాడుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాల్లో ఒకటి వింతైన సంప్రదాయానికి తెరతీసింది. ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి . 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో,  ఉరవకొండ నే ఊరుంది. ఇక్కడ  ఏడాదికోసారి జరిగే గవి మఠం బ్రహ్మోత్సవాలలోని సంగతే ఇది . బ్రహ్మోత్సవాలలో భాగంగా కురుబ కులస్తులు ఆచరించే వింత ఆచారం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఉత్సవాలలో భాగంగా కురుబ కులస్తులు శునకాల్లా మారి అరుచుకుంటూ గిన్నెలో పెట్టిన పాలు ఆరగిస్తారు . దీనివల్ల తాము శివుని కృపని పొందగలమని విశ్వసిస్తారు . 

అలా వారు ప్రవర్తించే కార్యక్రమాన్ని ఒగ్గుసేవగా పిలుస్తారు. ఈ సేవలో భాగంగా దొన్నెలలోని(గిన్నెలలో) ఉంచిన  పాలను గొరువయ్యలు శునకాల్లాగా అరుచుకుంటు, కొట్టుకుంటూ నాలుకలతో తాగుతారు. అదేవిధంగా శివుని ముందర ఉంచిన పళ్ళని కూడా ప్రసాదంగా భావించి, ఇదే తరహాలో స్వీకరిస్తారు . ఈ ఆచారాన్ని బ్రహ్మోత్సవాలలో చివరి రోజున నిర్వహిస్తారు. కొంచెం మోటుగా ఉన్నా, ఈ ఆచారం వెనుక గొప్ప కథని స్థానికులు వినిపిస్తారు. 

క్షీరసాగరమథనంలో పుట్టిన హాలాహలాన్ని స్వీకరించి , కంఠంలో నిలిపిన  పరమేశ్వరుడు, ఆదమరచి నిదిరించి, ఆ కాస్తా గుటుక్కున మింగేస్తాడేమోనని దేవతలా భయం. అందుకని వారంతా ఆయన నిద్రపోకుండా ఉండడం కోసం రాత్రంతా పెద్ద ఎత్తున భజనలు చేస్తూ ఉంటారు. అయితే కొంత సమయానికి దేవతలు నిద్రపోతారు. దాంతో పార్వతీదేవి భైరవస్వరూపాలని ఆహ్వానిస్తుంది .  ఒకె గిన్నెలో ఆరు శునకాలకి  పాలు పోస్తుంది.  అవి పాలను తాగటానికి గట్టిగా అరుచుకుంటూ, పోట్లాడుకుంటూ ఉండటం వల్ల ఆ పరమశివుడు, ఆ సవ్వడికి నిద్రపోకుండా మేల్కొని ఉన్నారట . 

ఈ విధంగా శివుడు నిద్రపోకుండా చేసిన ఆ భైరవాంశ సంభూత రూపాలే గొరవయ్యలని చెబుతుంటారు. ఈ కారణంగానే ప్రజలు శునకాల్లాగా మారి పాలు తాగుతూ శివుడికి సేవ చేస్తారని భక్తులు విశ్వసిస్తూ ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు. వీరికి ఆ పరమేశ్వరునితో పాటు ఆ పరమేశ్వరి కృపకూడా ఖచ్చితంగా లభిస్తుందని అనిపిస్తోంది . మీరేమంటారు ! 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha