Online Puja Services

వర్షాలు కావాలా ?

18.118.12.222

వర్షాలు కావాలా ? అయితే, ఈ కొమ్మున్న శివుణ్ణి  ఆరాధించాల్సిందే !! 
-లక్ష్మీ రమణ . 

పరమ నిష్టాగరిష్ఠుడు, వేదవేదాంగములు అభ్యసించిన మహర్షి ఋష్యశృంగుడు.  రామాయణంలోని రాముడు అవతరించడానికి కారణమయినవాడు. అగ్నిరాశి వంటి తేజోవంతుడు . ఆయన శివునిలో ఐక్యమయి పూజలందుకుంటున్న ప్రదేశం శృంగగిరి . లేదా శ్రీ శంకరులు స్థాపించిన శృంగేరీ శారదా పీఠము . ఆ ప్రదేశముని గురించి , అక్కడి మహాత్యమును గురించి యెంత చెప్పుకున్న తక్కువే! 
 
ఒకనాడు ఆదిశంకరాచార్యులవారు, తుంగానదీ సమీపంలో సంచరిస్తూ ఉన్నారు. అక్కడ ఎండతాపానికి తల్లడిల్లుతున్న ఒక కప్పకి, తన పడగని గొడుగుగా చేసి , సేదతీరుస్తున్న పాముని చూశారాయన. ఆ దృశ్యాన్ని చూసిన శంకరులు విస్మయానికి లోనయ్యారు. కప్ప సహజముగా పాముకు ఆహారము. కానీ, అవి వాటి సహజ వైరాన్ని మరచి పాము కప్పకు సహాయము చేస్తుండడము పూర్తి స్థల మహత్మ్యమే అని ఆయన గుర్తించారు.

ఇక తాను అద్వైతం ప్రచారము చేయటానికి స్థాపించదలచిన  నాలుగు పీఠములలో మొదటి పీఠము స్థాపించేదుకు ఆస్థలమే సముచితమని నిర్ణయించి, అక్కడే ఒక శిలపై శ్రీ చక్రాన్ని లిఖించి సరస్వతీ మాతను ఉద్దేసించి "తల్లీ, శారద అను పేరుతో ఈ  ప్రదేశములో స్థిరనివాసము ఏర్పరుచుకుని భక్త జనులను అనుగ్రహించాలి" అని శంకరులు ప్రార్ధించారు.  

సరస్వతీ మాత శంకరుల ప్రార్ధన అంగీకరించి అనుగ్రహించినది. ఈ విధంగా శ్రీ శారదాదేవి  ప్రధాన దేవతగా శంకరులు నాడు స్థాపించిన పీఠమే నేడు శ్రీ శృంగేరి శారదా పీఠముగా విరాజిల్లుతున్నది.  సాంప్రదాయాన్ని అనుసరించి ఈ పీఠాన్ని  దక్షిణామ్నాయ  శృంగేరి శ్రీ శారదా పీఠముగా పిలుస్తారు. దక్షిణ భారత దేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదమును  ఈ  పీఠమునకు ప్రదాన వేదముగా శ్రీ శంకరులు నిర్ణయించారు. అటువంటి మహత్యం కలిగిన స్థలమే శృంగగిరి . శ్రీ ఋష్యశృంగ మహర్షి వసించిన పుణ్య ప్రదేశం. ఇదే ఋష్యశృంగగిరి లేదా  శృంగగిరి అను పేర్లతో అలరారి ఇప్పుడు శృంగేరిగా విరాజిల్లుతోంది. 

రోమపాదుని కుమార్తె అయినా శాంతని వివాహం చేసుకొని , గృహస్థాశ్రమం స్వీకరించిన ఋష్యశృంగుడు , ఆ తర్వాత కొంతకాలం రాజ్యపాలనచేశారు . ఆతర్వాత , దశరథుని కోరిక మీద , అయోధ్యకి వెళ్లి ఆయనతోటి , అశ్వమేథం, పుత్రకామేష్ఠి యాగం చేయించాడు. దాంతో దశరథునికి రామ,లక్ష్మణ, భారత, శతృఘ్నులు జన్మించారు . ఆ తర్వాత కొంతకాలానికి  ఋష్యశృంగుడు గృహస్థజీవనంపై వైరాగ్యం చెంది, కుటుంబ సభ్యులను, ప్రజలను ఆశీర్వదించి, అడవులకు వెళ్ళి ధ్యానమగ్నుడయ్యాడు. చివరగా ఋష్యశృంగుడు దేహాన్ని త్యజించి, తాను  తపస్సుచేసిన ప్రదేశంలోని శివలింగంలో ఐక్యమయ్యాడు. ఆ శివలింగం ఉండే ఆలయం, శృంగేరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కిగ్గాలో శ్రీ ఋష్యశృంగేశ్వరాలయంగా విరాజిల్లుతోంది. 

జ్యోతిర్లింగాలలో శివయ్య జ్యోతిస్వరూపంలో విరాజిల్లుతుంటారని పురాణ వచనం .  అగ్నితేజస్సుతో విరాజిల్లిన ఋషి , ఋష్యశృంగుడు ఒక విద్యుల్లతలామారి అక్కడి శివలింగంలో ఐక్యమయ్యారని స్థానికులు అంటుంటారు. జ్ఞానం అనే అగ్ని నిత్యం జ్వలించేదే కానీ, అంతము లేనిది . జ్ఞానం తానైన ముని, ఆ లయకారునిలో లీనమై,  అనంత జ్ఞానరూపమై పూజలందుకోవడంలో పెద్దగా విశేషమేమీలేదుకదా ! ఈ ఆలయంలోని శివలింగంపై శృంగం ఉండటం విశేషం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో తీవ్ర అనావృష్టి పీడిస్తున్న ప్రాంతాల ప్రజలు శ్రీ శృంగేరి జగద్గురువులవారి అనుమతి తీసుకొని ,  శ్రీ ఋష్యశృంగేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. వెంటనే వారి ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.

 కాగా , ఋష్యశృంగ మహర్షి తండ్రి విభాండక మహర్షి , పుత్రుని వివాహానంతరం , అతన్ని ఆశీర్వదించి ఒక చిన్నకొండపై చాలాకాలం తపస్సు ఆచరించారు . అనంతరం  తనువు చాలించి, జ్యోతిరూపంలో ఆ కొండపై ఉన్న శివలింగంలో ఐక్యమయ్యాడు. ఇప్పటికి ఆ కొండ శృంగేరిలో ఉంది. ఆ మహర్షి ఐక్యమైన శివలింగం ఉన్న ఆలయమే శ్రీ మలహానికరేశ్వర ఆలాయంగా విరాజిల్లుతోంది.

ఈ యాత్ర సంపూర్ణమవ్వాలంటే , ఈ ఆలయాలతోపాటు , జగద్గురువులు శ్రీ శంకరులు స్థాపించిన శృంగేరి శారదాపీఠంను కూడా చూసి రండి . 

వివిధ మార్గాల ద్వారా శృంగేరికి ఇలా చేరుకోవచ్చు!

రోడ్డు మార్గము ద్వారా . . . 
          బస్సులో  చేరుకోవాలనుకొనే వారికి, చెన్నై, బెంగుళూరు, మైసూరు, మంగుళూరు, ఉడుపి, షిమోగా(శివ మొగ్గ) నగరాలనుంచి నేరుగా శృంగేరి చేరుకునేటందుకు బస్సు సౌకర్యము ఉంది. అంతే కాకుండా 325 కి.మీ దూరములో బెంగుళూరు బస్టాండు ఉన్నది. ఇచ్చటి నుంచి శృంగేరికి ప్రతిరోజూ కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, రాత్రి 9-00 గంటల ప్రాంతములో నిద్రిస్తూ ప్రయాణించే సౌకర్యమున్న రెండు బస్సులను నడుపుతోంది . 

రైలు మార్గము ద్వారా . . . 
      రైలులో శృంగేరికి చేరుకోవాలనుకొనే వారికి,  80 కి.మీ దూరములో ఉడుపి అనే  రైల్వే స్టేషన్, 105 కి.మీ దూరములో షిమోగా రైల్వే స్టేషన్, 110 కి.మీ దూరములో  మంగుళూరు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

వాయు మార్గము ద్వారా . . . 
       విమానంలో శృంగేరికి చేరుకోవాలనుకొనే వారికి, 100 కి.మీ దూరములో మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయము ఉంది. విమానాశ్రయము నుంచి టాక్సీలు అందుబాటులో ఉంటాయి.  

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya