Online Puja Services

ఇక్కడ నంది చెవిలో మీకోరిక చెప్పారంటే

3.128.199.88

ఇక్కడ నంది చెవిలో మీకోరిక చెప్పారంటే, ఖచ్చితంగా నెరవేరుతుందంట !
లక్ష్మీ రమణ 

కాకతీయుల రాజధానిగా వెలుగొందిన నగరంలో, శివారాధనకి లోటేముంది . కాకతీయుల కాలంలో కట్టిన శివాలయాలు అద్భుతమైన శిల్పసంపదతో అలరారుతుంటాయి .  ఆ శిల్పాలను అనుసరించే తెలంగాణా నాట్యమైన పేరిణీ శివతాండవాన్ని నటరాజ రామకృష్ణులు పునరుద్ధరించారు. అటువంటి కళాత్మకతతో అలరారే  ఈ శివాలయాలలో ఒక ఆలయంలోని నంది మహాశయుడి గురించిన విశేషమే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం  . 

వేయిస్తంభాల గుడిలో ఉన్న  ప్రత్యేకతలు, అక్కడి శిల్పవైభవాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తెలుగు గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డకీ ఈ ఆలయం యెంత గొప్ప నిర్మాణమో బాగా తెలుసు. కానీ ఇక్కడున్న నంది మహాశయుని గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకుని తీరాల్సిన విశేషం ఒకటుంది . 

ఈ వేయిస్తంభాల గుడిలో ఉన్న పరమేశ్వరుణ్ణి రుద్రేశ్వర స్వామిగా పిలుస్తారు . క్రీస్తుశకం 12-14 శతాబ్దాల కాలంలో ఈ గుడి నిర్మాణాన్ని తమ కులదైవమైన రుద్రేశ్వరునికోసం కట్టించారు కాకతీయ ప్రభువులు. అప్పటినుండీ, ఆ వంశంలోని రాజులు, రాణులు అందరూ కూడా ఈ దేవుణ్ణి కొలిచి ఆయన ఆశిస్సులతో కాకతీయ సామ్రాజ్యలక్ష్మిని విస్తరించిన వారే  ! తూర్పుకి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ముఖమండపంలోనే ఆసీనుడై ఉంటారు ఈ మహా నందీశ్వరుడు . 

ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే, రుద్రేశ్వరుడుగా ఈ ఆలయంలో ఎన్నో పూజలందుకుంటున్న ఆ రుద్రునికి 41 సార్లు ప్రదక్షణ చేసి, ఆ పరమేశ్వరుడికి ఎదురుగా ఉన్న నంది చెవిలో మన కోరికను చెప్పడం వల్ల ఆ కోరిక కచ్చితంగా నెరవేరుతుందనీ భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ నందీశ్వరుడు చెవులొగ్గి వినేందుకు సిద్ధంగా ఉన్నాడా అన్నట్టు చెవుల దగ్గర పెద్ద రంద్రంతో కనిపిస్తాడు . 

అలా కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు ఇక్కడ  రుద్రేశ్వరున్ని పూజిస్తారు. ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయంలోని స్వామి వారికి ప్రతీ మాస శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఘనంగా ఈ ఆలయంలో జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎడ్లబండినీ చక్కగా అలంకరించుకుని స్వామి వారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు.

వందల ఏళ్ళ చరిత్ర , అద్భుతమైన శిల్ప సంపద, చారిత్రిక విశిష్ఠత , వీటన్నింటితో పాటుగా , అందమైన కొలను చక్కటి పరిశరాలు. ఆధ్యాత్మిక సంపత్తి కూడా తోడైన ఈ ఆలయానికి వెళ్లి ఆ నందీశ్వరుని చెవిలో మీ కోరిక చెప్పి, రుద్రేశ్వరున్ని దర్శించుకొని రండి . వరంగల్ పట్టణానికి రైలు సౌకర్యం ఉంది . హైదరాబాదు నుండీ, విజయవాడనుండీ బస్సులో కూడా వెళ్లొచ్చు . 

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda