Online Puja Services

ఎన్ని లింగాలో ఈ క్షేత్రంలో !

18.190.219.65

ఉడుకుమోతు ఆంజనేయుడు చేసిన పనికి ఎన్ని లింగాలో ఈ క్షేత్రంలో !
-లక్ష్మీరమణ 

హనుమంతుడు మహా రామభక్తుడు. భక్తుడు ఒక్కడే కాదు, ఆయనంటే మహా ప్రేమ  కూడా ! అమ్మవారికంటే ఒక పిసరు ఎక్కువే ప్రేముందేమో అనే అనుమానం కూడా హనుమన్న కథలని , ఆయన చేసిన పనులని చూస్తుంటే, సాధారణ భక్తులకి కలుగక మానదు .   అలాంటి రామభక్తితో నెలకొన్న శైవ క్షేత్రం (శివాలయం) ఈ క్షేత్రం. ఈ రామలింగేశ్వర దర్శనం శివకేశవులతో పాటు , ఆంజనేయుని కృప కూడా సిద్ధిస్తుంది . విచిత్రమైన ఈ ఆలయ దర్శం చేద్దాం పదండి . 

తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కీసరగుట్టపై కొలువైన  రామలింగేశ్వరుని గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాలలోనే ఉండరు .  కానీ ఈ క్షేత్రంలో ప్రధానాలయంలో ఉన్న రామలింగేశ్వరుని కన్నా , విచ్చలవిడిగా ఆ క్షేత్రంలో విసిరివేసినట్టుగా ఉన్న శివలింగాలు మనల్ని మరింతగా ఆకర్షిస్తాయనడంలో సందేహంలేదు. నిజంగా ఇవి విసిరేసిన లింగాలే ! ఎందుకు ? ఎవరు ? ఎలా? అనే సందేహాలొస్తున్నాయా ? పూర్తిగా చదవండి మరి . 

 త్రేతాయుగంలో రాములవారు రావణ సంహారం చేశారు .  రావణాసురుడు అసురుడే కాదు , వేదవేదాంగాలూ అభ్యసించిన బ్రాహ్మణుడు కూడా ! దీంతో రాములవారికి  బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంది . ఒకనాడు ఆయన ఇప్పటి కీసరగుట్ట ఉన్న ప్రాంతానికి చేరుకొని అక్కడ బ్రహ్మహత్యా పాఠక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠాపన చేయాలనుకుని , హనుమంతులవారిని శివలింగాలని తీసుకురావాల్సిందని ఆజ్ఞాపించారు .  ఆయన ఆఘమేఘాలమీద వెళ్లి , కాశీ నుండి శివలింగాలని తీసుకురావడానికి బయల్దేరతారు . 

అప్పటికే మహర్షులు ముహూర్త నిర్ణయం చేసేశారు . ముహూర్తం సమీపిస్తున్నా పవననందనుడు లింగాలు తీసుకొని రాలేదు. దీంతో ముహూర్తం మించిపోతోందని భావించిన రాములవారు పరమేశ్వరుని ప్రార్థించారు . ఆయనే స్వయంగా తన ఆత్మలింగాన్ని అనుగ్రహించి అంతర్థానమయ్యారు.
ఇంతలో కాశీ నుంచి కేసరీ నందనుడు 101 లింగాలను తీసుకుని రానేవచ్చాడు . కానీ అప్పటికే లింగప్రతిష్ఠ జరిగిపోయింది .  ఆవిషయాన్ని తెలుసుకున్న హనుమ ఉడుకుమోతుతనంతో , రాములవారు తానూ వచ్చేలోపలే వేరే వారిచ్చిన ( స్వయంగా అది శివుడే కావొచ్చు , అయినా సరే) లింగాన్ని ప్రతిష్ట చేశారన్న ఈర్ష్యతో తన తోకతో ఆ 101 లింగాలను విసిరివేశారట . అప్పుడా లింగాలన్నీ అవన్నీ తలోదిక్కూ పడ్డాయని స్థానిక కథ . 

ఆ విసిరేయడం అనేది భక్తిలేకకాదు కదా ! ఆ స్వామిమీద ఉన్న అనురాగం వల్ల . ఆ అనురాగం ఎటువంటిదంటే, సీతమ్మతోటే పోటీపడేంత గొప్పది . అందుకే రాములోరి ఒక్క చిరునవ్వు రువ్వి ఆ ఆంజనేయుని  శాంతింపజేయగలిగారు. పైగా ఇకపై ఈ ప్రాంతం కేసరి నామంతో వర్ధిల్లుతుందని వరమిచ్చారు. ఆనాటి నుంచి ఈ ప్రాంతం కేసరిగిరిగా ప్రసిద్ధిని పొంది , ప్రస్తుతం కీసరగుట్టగా మారింది. అందుకే నెమో ఇక్కడ కోతులు విపరీతంగా ఉంటాయి . పైగా గాలి ప్రచండంగా వీస్తుంటుంది . ఇప్పుడు కాస్త కాంక్రీట్ జంగిల్ ఇటువైపు కూడా విస్తరిస్తుండడంతో , గాలి ఉదృతి కాస్త తగ్గింది గానీ, ఈ కొండపైన గాలి ఉదృతి సంగతి తెలుగు ప్రజలకి బాగా పరిచయమే . 

ఇక చారిత్రక నేపథ్యంలోకి వెళ్తే.. క్రీస్తుశకం 4వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం వరకు ఆంధ్రదేశాన్ని పాలించిన విష్ణుకుండినుల సైనిక స్థావరం ఈ గుట్టమీదే ఉండేది. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు దగ్గర మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్న.. తరచూ ఈ ఆలయాన్ని దర్శించుకునేవారట. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా వారే నిర్మించారు.

అందుకే, ఈ కీసర గుట్ట రామలింగేశ్వర దర్శనం చేసుకుంటే, శివకేశవులతో పాటు , ఆంజనేయుని కృప కూడా సిద్ధిస్తుంది. ఈ ఆలయానికి హైదరాబాద్ నుండీ బస్సు సౌకర్యం ఉంది .  దూరప్రాంతాలవారికి , హైదరాబాద్ రైల్వేస్టేషన్ , ఏర్పోర్ట్ దగ్గరి ప్రాంతాలు .  అక్కడి నుండీ రోడ్డుమార్గం ద్వారా కీసరగుట్టకి చేరుకోవచ్చు .  

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha