Online Puja Services

మొగలిపూల పూజలందుకునే ఈ ఈశ్వరుడు

18.219.22.169

మొగలిపూల పూజలందుకునే సంగమేశ్వరుడు ఈ ఈశ్వరుడు . 
లక్ష్మీ రమణ 

మొగలిపూవు పూజకి పనికి రాదు అని శాపాన్ని పొందింది . బ్రహ్మ దేవుడికి దొంగసాక్ష్యం చెప్పిందికాదా మరి!  కానీ ఈ క్షేత్రంలో ఆ శాపమిచ్చిన శివుడే మొగలిపూల పూజలందుకుంటున్నాడు . ఏకంగా మొగలిపూల వనంలోనే కొలువైన ఈ సంగమేశ్వరుడు అమృతజలాలతో అనుగ్రహిస్తాడు. స్వయంగా ఆ గంగమ్మ మంజీరనాదాలు సందడి చేసే శివయ్య క్షేత్రం ఇది . దక్షిణ కాశీ క్షేత్రాన్ని దర్శించుకుందాం పదండి . 

స్థల పురాణాలు :

ఒకప్పుడు సౌనకాది మహామునులూ యజ్ఞాలు చేసిన పవిత్రస్థలం ఈ క్షేత్రం . మహాదేవుడి ఆగ్రహానికి గురై, పూజకు నోచుకోని బ్రహ్మ, కేతకి (మొగలిపువ్వు) సాక్షిగా వెలిసిన దివ్యక్షేత్రం ‘ఝరాసంగం’. శాపవిమోచనానికి శివుడి ఆనతి మేరకు బ్రహ్మదేవుడు ఝరాసంగంలోని కేతకి వనంలో ఘోర తపస్సు ఆచరించాడట. అందుకు మెచ్చి శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని స్థలపురాణం. బ్రహ్మకు దర్శనమిచ్చిన మహాలింగమే నేడు సంగమేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటోంది. ఆనాడు బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని అభిషేకించిన జలాలు ఆలయం వెనుక భాగంలో అమృతగుండంగా మారిందని భక్తులు విశ్వసిస్తారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ పరమేశ్వరుడికి నిత్యం మొగలి  పూలతో పూజాదికాలు నిర్వహిస్తారు.

ఇక్కడి అమృతగుండం మహిమ సామాన్యమైనదికాదు . కృత యుగంలో సూర్య వంశానికి చెందిన కుపేంద్ర అనే రాజు చర్మ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడు. తన వ్యాధి నివారణకు రాజు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి . అదేసమయంలో ఇక్కడి అమృత గుండంలో స్నానం ఆచరించడం ద్వారా అతని వ్యాధి పూర్తిగా కుదురుకుంది . అదే రోజు రాత్రి ఆ రాజుకి సంగమేశ్వర స్వామి కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, తనని  వెలికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. పరమేశ్వరుని ఆదేశం మేరకు రాజు స్వామికి ఆలయాన్ని కట్టించారాని మరో స్థానిక కథనం . ఇక్కడున్న అమృత కుండానికి  అష్ట తీర్ధమని మరో పేరుకూడా ఉంది. మనిషిలో ఏవిధంగా అయితే, నరాల వ్యవస్థ వ్యాపించి ఉన్నదో , అదే విధంగా జలము భూమిలో విస్తరించి ఉంది . ఆ విధంగా గంగానది యొక్క ఒక జలధారి ఇక్కడి అమృత కుండమనే విస్వాసం కూడా ఉంది .   

సంగమేశ్వరుడి స్థల ఐతిహ్యాలు ఇంతటితో అయిపోలేదు . అక్కడి శాసనాల ద్వారా మరో కథకూడా వినిపిస్తోంది. పూర్వం కేతకీ అనే అప్సరస ఓ ముని శాపంతో కేతకీ మొగలి వనంగా మారిందట. దీంతో శాప విమోచనాన్ని కోరి ఆమె శివుడ్ని గురించి ఘోర తపస్సు చేయగా, ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఇక్కడ బాణలింగ రూపంలో వెలిశాడట. ఆ కారణంగా ఆ స్వామి కేతకీ సంగమేశ్వర స్వామిగా పూజాదికాలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఈ సంగమేశ్వరుడిని అర్చించడం ద్వారా మహా పాపాలు , శాపాలు తొలగిపోతాయని, ఆరోగ్యం చేకూరుతుందని విశ్వసిస్తారు . ప్రత్యేకించి చర్మవ్యాధులతో బాధపడేవారికి ఇక్కడి పుష్కరిణి నిజంగానే అమృత కుండం అని చెబుతారు . మహాశివరాత్రి శోభ ఇక్కడ అత్యంత వైభవంగా కొనసాగుతుంది. వర్ణించడానికి అక్షరాలూ చాలని వైభవంతో కొనసాగే ఆ ఉత్సవాన్ని కనులారా తిలకించాల్సిందేకానీ చెప్పనలవికాదంటే, అతిశయోక్తి కాదు . 

అద్భుతమైన చరిత్ర అంతకుమించిన మహత్యంతో కూడిన సంగమేశ్వరుని ఇలా చేరుకోవచ్చు :

తెలంగాణా రాష్ట్రంలోని మెదక్ జిల్లా ,  జహీరాబాద్ పట్టణానికి నుండి 16 కి.మీ దూరం లో ఉన్న ఝరాసంగంలో  కొలువై ఉన్నాడు .  జహీరాబాద్ నుండీ , హైదరాబాదు నుండీ బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది . 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore